కరోనా నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌?

11 Jun, 2020 10:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడటం వల్ల ఎన్నో రకాల జబ్బులు మందుకు తమ నిరోధకత (డ్రగ్‌ రెసిస్టెన్స్‌) పెంచుకుంటున్నాయన్న విషయం మనం ఎంతోకాలంగా తెలుసు. అయినప్పటికీ మనలో చాలామంది కరోనా వైరస్‌ ప్రబలుతున్న ఈ కాలంలో అజిథ్రోమైసిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌నే మళ్లీ మళ్లీ వాడుతూనే ఉన్నాం. అయితే అనవసరంగా యాంటీబయాటిక్స్‌ ఎందుకు వాడకూడదో... అదెంత ప్రమాదమో మరోసారి తెలుసుకుందాం. ఇకనుంచైనా అప్రమత్తంగా ఉందాం. 

మనకు వచ్చే సాధారణ జలుబు, దగ్గు వంటివి ప్రధానంగా వైరస్‌ వల్ల వస్తాయి. ఇక వైరల్‌ జ్వరాలూ, జలుబులూ అన్నవి ఇన్‌ఫ్లుయెంజా, పారా ఇన్‌ఫ్లుయెంజా, రైనోవైరస్, ఎడినోవైరస్, హ్యూమన్‌ రెస్పిరేటరీ నిన్సీషియల్‌ వైరస్‌లతో పాటు... కరోనా వైరస్‌తో వస్తూ ఉండటం మనకు ఎప్పట్నుంచో తెలిసిన విషయమే. అయితే... ఇక్కడ మనం పేర్కొన్న వైరస్‌ రకాల్లో చివరన పేర్కొన్న కరోనా వల ఇప్పుడు తాజాగా వస్తున్న నావల్‌ కరోనా లేదా సార్స్‌–సీవోవీ2 వైరస్‌ వల్ల వచ్చే కొత్తరకం వైరల్‌ జలుబు/జ్వరం అన్నది ప్రపంచంలోనే అన్ని చోట్లకూ పాకి ఓ పాండమిక్‌గా మారింది. 

నిన్నమొన్నటి వరకూ మనం దగ్గు, జలుబు వంటి మందులకు యాంటీబయాటిక్స్‌ వాడుతూనే వచ్చినట్లుగానే... ఇప్పుడు కోవిడ్‌–19 అనే కొత్త జబ్బును తెచ్చే ప్రస్తుత కరోనా వైరస్‌ ప్రబలడం మొదలు పెట్టీపెట్టగానే మళ్లీ మనం అదే పల్లవి అందుకున్నాం. అదే... హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు అజిథ్రోమైసిన్‌ వాడటం అనే పాత పాటనే కొత్తగా మళ్లీ అందిపుచ్చుకున్నాం. నిజానికి వైరల్‌ జ్వరాలకూ, ఆ సంబంధిత రుగ్మతలకు యాంటీబయాటిక్స్‌ ఎంతమాత్రమూ ఉపయోగకరం కాదు. అయినప్పటికీ గతంలో మనం జలుబు, దగ్గు వంటి సమస్యలకు అజిథ్రోమైసిన్, సెఫిక్సిమ్, సెపోడోక్సిమ్‌ వంటి యాంటీబయాటిక్స్‌ వాడుతూ వచ్చాం. ఇప్పుడూ అదే తరహా వాడకాన్ని కొనసాగిస్తున్నాం. 

విచ్చలవిడిగా మనం దురుపయోగం చేస్తున్న యాంటీబయాటిక్స్‌ ఇవే... 
మనం ఈ కింద పేర్కొన్న యాంటీబయాటిక్స్‌ను సాధారణంగా వాడేస్తూ ఉన్నాం. అవి... మాక్రోలైడ్స్‌ అని పిలిచేవి... అజిథ్రోమైసిన్, సెఫాలోస్పోరిన్, సెఫిక్సిమ్‌. 

ఇంజెక్షన్‌ ద్వారా వాడేవి... సెఫ్‌ట్రియాక్సోన్‌ వంటివి. క్వినలోన్స్‌ అని పేర్కొనే... అఫ్లాక్సోసిన్, సిప్రోఫ్లాక్సిన్‌తో పాటు... ఎరిథ్రోమైసిన్, నార్‌ఫ్లాక్సిన్, సిఫ్రాన్, సెప్ట్రాన్, మోనోసెఫ్, పైపర్‌సిలిన్, టాజోబ్యాక్టమ్‌ వంటి యాంటీబయాటిక్స్‌ను విచక్షణరహితంగా ఉపయోగిస్తున్నాం. సాధారణ  జలుబు, దగ్గుకు అజిథ్రోమైసిన్, నీళ్లవిరేచనాలకు నార్‌ఫ్లాక్స్‌ వంటి మందులను చాలా మామూలుగా ఉపయోగిస్తుంటాం. ఇక ఇప్పుడు తాజాగా హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిథ్రోమైసిన్‌ వంతు అన్నమాట. 

నష్టం ఎన్ని రకాలుగా అంటే... 
ఇలా మనం యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడేస్తుంటే మనకు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇలా మరెన్నో రకాలగా నష్టం జరుగుతుంది. అదెలాగో చూద్దాం. 

  • చర్మంపై అనేక రకాల బ్యాక్టీరియా జీవిస్తుంటాయి. వాస్తవానికి అవేవీ హాని చేసేవి కావు. అయితే యాంటీబయాటిక్స్‌ వాడేవారిలో చర్మంపై ఉండే ఈ హానిరహితమైన బ్యాక్టీరియా క్రమంగా తగ్గిపోతుంది. రకరకాల జబ్బుల నివారణకి మనం యాంటీ బయాటిక్స్‌ వాడుతున్న కొద్దీ... హానిరహిత బ్యాక్టీరియాతో పాటు హానికారక బ్యాక్టీరియా కూడా విపరీతంగా వృద్ధి చెంది అవి చర్మానికి, కొందరిలో యూరినరీ బ్లాడర్‌కూ హాని చేయవచ్చు. 
     
  • యాంటీబయాటిక్స్‌ను డాక్టర్లు నిర్దేశించిన కాలం పాటే వాడాలి. అలా వాడకుండా మధ్యలోనే వదిలేయడం వల్ల మనలోని హానికరమైన బ్యాక్టీరియా నిర్మూలన జరగకపోగా... వ్యాధికారక సూక్ష్మజీవులు ఆ మందు పట్ల తమ నిరోధకతను పెంచుకుంటాయి. టీబీ, శ్వాసకోశవ్యాధులు, మూత్రంలో ఇన్ఫెక్షన్స్‌ విషయంలోనూ ఇలా నిర్ణీతకాలంలో మందులు వాడకపోవడం వల్ల వచ్చే ప్రమాదాలు మరీ ఎక్కువ. 
     
  • అసలు మనం కొన్ని రకాల యాంటీబయాటిక్‌ కాంబినేషన్లను వాడకూడదు. కానీ ఆ కాంబినేషన్లు మనకు తెలియపోవడం వల్ల ఆన్‌ కౌంటర్‌ మెడిసిన్‌గా ఇచ్చే అనేక రకాల యాంటీబయాటిక్స్‌ వాడి ముప్పు పెంచుకుంటూ ఉంటాం. 
  • కొన్నిసార్లు యాంటీబయాటిక్స్‌ ఎక్కువగా వాడటం వల్ల ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. 
     
  • ఇక ఆర్థిక నష్టం ఎలాగంటే... మన దేహంలో యాంటీబయాటిక్స్‌ పట్ల నిరోధకత పెరగడం వల్ల ఇంకా ఎన్నో రకాల సూక్ష్మజీవుల వచ్చే ఇన్ఫెక్షన్లు మరింత వృద్ధి అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల హాస్పిటల్‌లో ఉండాల్సిన వ్యవధి పెరగాల్సి రావచ్చు. దాంతో ఆసుపత్రి ఖర్చులు తడిసి మోపెడవుతాయి. రోగ క్రిములు ఒక పట్టాన లొంగక ఒకవేళ రోగిని ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచాల్సి వస్తే... ఆ ఖర్చులూ... మరింత ప్రభావకరమైన మందులతో పాటు... అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ కేర్‌కు అవసరమైన వ్యయాలూ పెరుగుతాయి. ఇది ఆర్థిక నష్టం కాగా... ఒక్కోసారి ఇంతగా ఖర్చు చేసినప్పటికీ ప్రయోజనం లేక... మందుల దుష్ప్రభావాలూ, చికిత్సను తట్టుకోలేనంతగా దేహం బలహీనపడటంతో రోగి మృత్యువాత పడటం కూడా జరగవచ్చు. 

అవి డాక్టర్లకే తెలుసు 
రోగికి వచ్చిన జబ్బును బట్టి, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తరహా యాంటీబయాటిక్స్‌ వాడాలి, అది ఎంత మోతాదులో వాడాలి, ఆ మోతాదును ఎంత కాలం పాటు కొనసాగించాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఈ నైపుణ్యాలను వారు తమ వైద్యవిద్యతోనూ, అనుభవంతోనూ గడిస్తారు. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్‌ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్‌)ను పెంచుకోవచ్చు. లేదా మరీ ఎక్కువగా ఇచ్చి దానివల్ల కూడా దేహానికి ఇతరత్రా సైడ్‌ఎఫెక్ట్స్‌ కారణంగా ప్రమాదం సంభవించవచ్చు.

అందుకే యాంటీబయాటిక్స్‌ ఉపయోగంలో కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాలు (గైడ్‌లైన్స్‌) ఉంటాయి. అవి వైద్యులకే స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి వారి సిఫార్సు మేరకే యాంటీబయాటిక్స్‌ వాడాలి. పైన చెప్పుకున్న నష్టాలను దృష్టిలో ఉంచుకుని, ఇకపై యాంటీబయాటిక్స్‌ను కేవలం డాక్టర్ల సలహాలు, సూచనలు, సిఫార్సుల మేరకే వాడాలని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో ఎన్నో జబ్బులు తమ తీవ్రతను పెంచుకోకుండా... తేలిగ్గానే అవి లొంగిపోయేలా చేసుకునే శక్తి మన చేతుల్లో ఉందని తెలుసుకోవడం ఎంతైనా మంచిది. 

విచక్షణరహితంగా ఎందుకు వాడకూడదంటే... గతంలో చాలా తేలిగ్గా... అంటే కేవలం ఓ చిన్న యాంటీబయాటిక్‌ వాడీ వాడగానే లేదా వాడకపోయినా కాస్త నిదానంగా తగ్గిపోయే వ్యాధులు ఇప్పుడు విపరీతంగా మొండికేస్తున్నాయి. తేలిగ్గా తుదముట్టించగల వ్యాధిక్రిములు సైతం తమ శక్తిని  పెంచుకుంటున్నాయి. ఇదంతా యాంటీబయాటిక్స్‌ను దురుపయోగం చేయడం వల్లనే. ఒకప్పుడు చిన్న డోస్‌తో తగ్గేవి సైతం ఇప్పుడు డబుల్‌డోస్‌ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.

ఉదాహరణకు... 

  • యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకున్న క్లాస్ట్రీడియమ్‌ డిఫిసైల్‌ అనే పెద్ద పేగుల్లో పెరిగే బ్యాక్టీరియా కారణంగా వచ్చే నీళ్ల విరేచనాలు ఇప్పుడు పెద్దవయసు వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించేలా తయారయ్యాయి. 
     
  • గతంలో చిన్న పిల్లల్లో, పెద్దల్లో తరచూ వచ్చే సెగగడ్డలు అప్పట్లో మామూలు యాంటీబయాటిక్స్‌ తగ్గేవి. కానీ ఇప్పుడు అలాంటి చిన్నచిన్న గడ్డలు తేలిగ్గా తగ్గడం లేదు. 
     
  • అప్పట్లో యాంటీబయాటిక్స్‌కు తేలిగ్గా లొంగిపోయే.. టీబీ, క్లెబిసియెల్లా నిమోనియా, సూడోమొనాస్‌ వంటి  సూక్ష్మక్రిములు సైతం ఇప్పుడు మరీ మొండిగా మారాయి. దాంతో గతంలో ఆయా సూక్ష్మజీవుల వల్ల తేలిగ్గా తగ్గే సమస్యలు సైతం ఇప్పుడు మొండిగా మారిపోయాయి... ఇంకా మారుతున్నాయి కూడా. దాంతో ఇది మనకు తీవ్రమైన నష్టంగా పరిణమిస్తోంది. 

    - డాక్టర్‌ నందనా జాస్తి
    మెడికల్‌ స్పెషలిస్ట్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌

మరిన్ని వార్తలు