దూరం ఒకటే దారే వేరు

21 Jan, 2019 00:27 IST|Sakshi

పరిచయం అంజలి హజారికా

మహిళల్లో ఉన్న ప్రతిభాపాటవాలకు సంప్రదాయ భావజాలం ఏ విధంగా అడ్డంకిగా మారుతోందనే విషయాలను  సంకలనం చేస్తూ ‘వాక్‌ ద టాక్, ఉమెన్, వర్క్, ఈక్విటీ, ఎఫెక్టివ్‌నెస్‌’ పుస్తకం రాశారు అంజలి. ఇటీవల హైదరాబాద్, బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో జరిగిన ఇంటరాక్షన్‌ సెషన్‌లో డాక్టర్‌ అంజలి హజారికా పాల్గొన్నారు.  ఆ సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు.

‘‘పిల్లలూ! డాక్టర్‌ బొమ్మ వేయండి’’. పిల్లలందరూ డాక్టర్‌ బొమ్మ వేశారు. ‘‘ఇప్పుడు... పైలట్‌ బొమ్మ వేస్తారా?’’ పైలట్‌ బొమ్మ కూడా వేశారు. ‘‘ఫైర్‌మన్‌ బొమ్మ?’’ అదీ వేశారు.

డ్రాయింగ్‌షీట్‌ మీద తమ పేర్లు రాసిచ్చారు క్లాసులోని పిల్లలంతా. మొత్తం అరవై షీట్‌లు. ఆ డ్రాయింగ్‌ షీట్‌లలో ఉన్నది యాభై ఐదు మంది మగడాక్టర్లు, ఐదుగురు లేడీ డాక్టర్లు. యాభై ఐదు మంది మగ పైలట్‌లు, ఐదుగురు మహిళా పైలట్‌లు. ఫైర్‌మన్‌ దగ్గరకొచ్చేసరికి అరవై మందీ మగవాళ్లే!! ఇవి పిల్లలు గీసిన బొమ్మలు మాత్రమే కాదు, సమాజానికి దర్పణాలు కూడా. పిల్లలేం చూశారో అదే బొమ్మ వేశారు.సమాజం ఎలా ఉందో దాన్నే పిల్లలు చూశారు. డాక్టర్‌ అంజలి హజారికా నాలుగేళ్ల పాటు సమాజాన్ని శోధించి తెలుసుకున్న వాస్తవాలను నిర్ధారించుకోవడానికి ఏడెనిమిదేళ్ల పిల్లలనే గీటురాయిగా తీసుకున్నారు. ఆ గీటురాళ్లు చూసిన, చూపించిన సమాజం డ్రాయింగ్‌ షీట్‌లలో కనిపించింది. 

వేరు చేసేది సమాజమే!
పురుషాధిక్య సమాజంలో మహిళలకు ఎదురవుతున్న అడ్డంకులకు ఆ రంగం, ఈ రంగం అనే తేడా లేదని.. 2009లో నోబుల్‌ బహుమతి అందుకున్న ఇజ్రాయెల్‌ మహిళ అదా యోనా  మాటల్ని ఉటంకించారు... అంజలి. ఆ దేశం నుంచి నోబుల్‌ బహుమతి అందుకున్న పదిమందిలో ఏకైక మహిళ యోనాత్‌. అయితే యోనాత్‌ ప్రొఫెషన్‌లో నిలదొక్కుకోవడానికి మహిళ అనే వివక్ష కారణంగా లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పలేదని చెప్పారు అంజలి. ‘‘ఏదైనా ఒక పనిలో ఒక మగవ్యక్తి విఫలమైతే అది అతడి వ్యక్తిగత వైఫల్యంగా పరిగణిస్తుంది సమాజం. అదే ఒక మహిళ విఫలమైతే ఆ వైఫల్యాన్ని మహిళాజాతి మొత్తానికీ ఆపాదిస్తుంది. ‘అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుట్టినప్పుడు వాళ్లు పిల్లలు మాత్రమే. పెరిగే క్రమంలో అబ్బాయి, అమ్మాయిల్లా వారిని వేరు చేస్తున్నది సమాజమే’’ అన్నారామె. ‘‘సమానత్వం కోసం చేసే పోరాటాలు కొన్నిసార్లు శృతి తప్పి ఆధిపత్య పోరాటాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. నిజానికి జెండర్‌ ఈక్వాలిటీ కోసం చేసే ప్రయత్నం మగవాళ్లను కించపరచడానికి, వారిని న్యూనత పరచడానికి కాకూడదు, వివక్షలేని సమాజ నిర్మాణం కోసం చేసే ప్రయత్నం అది. ఇప్పటివరకు ఉన్న మూస భావజాలం నుంచి మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది’’ అన్నారు అంజలి.

నిర్ణయం ‘ఆమె’దే
మహిళ ఏ రంగంలో కొనసాగాలనేది కూడా అత్తింటి వాళ్లే నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఒక మహిళ అనుభవాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు అంజలి.‘‘పెళ్లిచూపులకొచ్చాడు ఓ అబ్బాయి. తనది చాలా పెద్ద హోదా కలిగిన ఉద్యోగం. తరచూ టూర్లు ఉంటాయి. ఇంట్లో ఉండే తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఇంటికి వచ్చే కోడలిదే. కాబట్టి తన భార్య ఉద్యోగం చేయకూడదు అని నిబంధన పెట్టాడతడు. అప్పుడు పెళ్లి కూతురి తల్లి ఒకే మాట చెప్పారు. ‘మీక్కావలసింది రోజంతా ఇంట్లో ఉండే పని మనిషి. మంచి జీతం ఇచ్చి ఒక సర్వెంట్‌ మెయిడ్‌ను నియమించుకోండి. మా అమ్మాయికి తన కెరీర్‌ మీద కొన్ని లక్ష్యాలున్నాయి అని చెప్పారామె. అప్పుడా తల్లి అంత స్థిరంగా ఆ మాట చెప్పలేకపోయి ఉంటే ఆమె కూతుర్ని ఈ రోజు ప్రొఫెసర్‌ హోదాలో చూడగలిగే వాళ్లం కాదు. అలాగే మరో మహిళ విషయంలో ఆమె అత్తింటి వాళ్లు తాము చాలా ఉదారంగా ఉన్నాం చూడండి.. అన్నట్లు వ్యవహరించారు. వాళ్లు చెప్పేదేమంటే... అమ్మాయి తాను చేస్తున్న ఉద్యోగం మానేయాలి, ఇప్పటి వరకు ఉన్న సీనియారిటీని వదులుకుని పెళ్లి చేసుకుని అత్తగారింట్లో అడుగుపెట్టాలి. చదువుకుని ఇంట్లో ఖాళీగా ఉండడం కష్టంగా అనిపిస్తే ఇంటి పనులన్నీ చేసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లో ఉద్యోగానికి వెళ్లవచ్చు– అని. అంటే ఒక అమ్మాయికి తన జీవితం మీద నిర్ణయం తీసుకునే అవకాశం తన చేతిలో ఉండడం లేదు. అత్తింటివారి చేతిలోకి వెళ్లిపోతోంది. ఇక్కడ మనం ఆక్షేపించాల్సింది పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లడాన్ని కాదు, పెళ్లి కోసం కెరీర్‌ను వదిలేసుకోవాల్సి రావడాన్ని మాత్రమే. కెరీర్‌ అంటే డబ్బు సంపాదించే ఉపాధి మాత్రమే కాదు, అది ఆమె గుర్తింపు, ఆమెకు దక్కే గౌరవం. అందుకే మహిళలు తమ గుర్తింపుకు, గౌరవానికి భంగం కలగని విధంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా సరే తమ ఐడెంటిటీని నిలబెట్టుకోవాలి, అవసరమైతే పరిస్థితులతో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. అందుకు ఇంటి వాతావరణం కూడా సహకరించాలి’’ అన్నారు అంజలి.

తప్పని బాధ్యతలు
‘‘ప్రపంచంలో ఒక దేశానికీ మరో దేశానికీ మధ్య తప్పనిసరిగా వైవిధ్యత ఉంటుంది. ఆ దేశానికంటూ ప్రత్యేకమైన బలాలు, బలహీనతలు ఉంటాయి. మహిళల విషయానికి వస్తే... అది కమ్యూనిస్టు దేశమైనా, క్యాపిటలిస్టు దేశమైనా, సోషలిస్టు దేశమైనా సరే... మహిళల అవకాశాలకు దారులు మూసేయడంలో మాత్రం వైవిధ్యత కనిపించలేదు. నేటికీ అమెరికా వంటి అగ్రరాజ్యంలో కూడా ప్రజాప్రతినిధులుగా మహిళలను వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితే ఉంది’’ అంటారు అంజలి.  దీనికి తోడు మహిళల పట్ల అనేక అపోహలు రాజ్యమేలుతున్న వైనాన్ని వివరించారామె. ‘‘ఫలానా బాధ్యతను నిర్వర్తించడానికి మహిళలు కరెక్ట్‌ కాదు, ఈ క్లిష్టమైన వ్యవహారాన్ని నడిపించడం మహిళలకు అసాధ్యం, మహిళలకు ప్రొఫెషన్‌లో ఎదగాలని, ప్రమోషన్‌లు తెచ్చుకోవాలని ఉండదు. మగవాళ్లతో సమానంగా పని చేయాలనుకోరు. ఇంటర్నేషనల్‌ అసైన్‌మెంట్‌లు అప్పగిస్తే వెళ్లడానికి ముందుకు రారు, ట్రాన్స్‌ఫర్‌కు సిద్ధంగా ఉండరు’ అనే దురభిప్రాయాలు చాలామందిలో నెలకొని ఉండడాన్ని గమనించాను. మరికొన్ని కార్పొరేట్‌ కంపెనీల నిర్వాహకుల మాటల్లో ‘ఈ ఉద్యోగానికి ఆమెకి అన్ని అర్హతలున్నాయి. అయితే మన కంపెనీ క్లయింట్లు మహిళా ఇంజనీర్‌ అంటే మనకు ప్రాజెక్టులు ఇస్తారో ఇవ్వరో’ అనే సందేహం కనిపించింది. మరొకరయితే ‘ఆమెకు ప్రమోషన్‌ ఇవ్వడం ఎలా, తరచూ అఫిషియల్‌ టూర్లుంటాయి’ అంటారు. నిజానికి ఈ తరం మహిళలు ఇలాంటి మిషలతో ఉద్యోగంలో ఎదుగుదలను వదులుకోవడం లేదు.ఈ అభిప్రాయాలు మగవారిలో నాటుకుపోయి ఉన్నాయంతే’’ అన్నారామె.

పరుగు ఒక్కటే... భారమే తేడా
‘‘1991లో ‘పని ప్రదేశంలో మహిళల పరిస్థితి’ అనే అంశం మీద వాషింగ్టన్‌లో ఓ సదస్సులో పాల్గొన్నాను. పని చేసే మహిళలకు గృహిణి నిర్వహించిన ఇంటి బాధ్యతలను పూర్తి చేయాల్సిన అదనపు బరువు తప్పడం లేదు. వ్యవసాయ రంగంలో ఉండే మహిళ నుంచి, కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగిని వరకు అందరి పరిస్థితీ ఇదే. ఇంటి బాధ్యతలు పూర్తి చేసి ఆఫీసుకెళ్లిన తర్వాత మగవాళ్లతో పోటీ పడి రేసులో పరుగెత్తాలి. ఒక్కమాటలో చెప్పాలంటే మగవాళ్లు ఏ బరువూ లేకుండా పరుగుపందెంలో పాల్గొంటుంటే, ఆడవాళ్లు మాత్రం కాళ్లకు ఇంటి బాధ్యతల ఇనుపగుండు కట్టుకుని రేసులో పాల్గొంటున్నారు. వర్క్‌ ప్లేస్‌లో మగవాళ్లు– ఆడవాళ్లు ఇద్దరూ సమానమేననే వాస్తవాన్ని మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా గుర్తుంచుకోవాలి. ఆడవాళ్లు పని ప్రదేశంలో తమకవసరమైన ప్రత్యేక సౌకర్యాల కోసం డిమాండ్‌ చేయవచ్చు కానీ, పని తగ్గించుకోవడానికి వెసులుబాటు కోరుకోకూడదు. ప్రతి మహిళకూ తన శక్తి మీద, తాను నిర్వర్తించాల్సిన పనుల మీద అవగాహన ఉండాలి. తన బాధ్యతలను పూర్తి చేయడానికి ఇతరుల మీద ఆధారపడకూడదు. తన శక్తి మీదే తాను నిలబడాలి. సమాజం నిర్దేశించిన చట్రం నుంచి బయటపడి కొత్త సామాజిక చక్రాన్ని రూపొందించాలి. అది వివక్షకు తావులేని సమానత్వం సాధించిన సమాజం కావాలి’’ అన్నారు అంజలి హజారికా. 

విస్తృత పర్యటనలు
డాక్టర్‌ అంజలి హజారికా పుట్టింది మహారాష్ట్రలోని పూనాలో. సైకాలజీ, సోషల్‌ సైన్సెస్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. మేనేజ్‌మెంట్‌లో డాక్టరేట్‌ చేశారు. పాశ్చాత్యదేశాల్లో విస్తృతంగా పర్యటించి ప్రాచ్య– పాశ్చాత్య సమాజాలను తులనాత్మకంగా బేరీజు వేశారు. భారతదేశంలోని ఆయిల్‌ అండ్‌ గ్యాస్, పెట్రోలియం కంపెనీలతో పని చేశారు. ఉద్యోగుల రక్షణ, సంక్షేమం కోసం సంస్థలు కల్పించాల్సిన సౌకర్యాల గురించి ఆయా సంస్థలకు వ్యవస్థీకృతమైన దిశానిర్దేశం చేశారు. ఆమె సేవలకు భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ ‘ఎక్సలెన్స్‌’ అవార్డుతో గౌరవించింది. అమెరికాలోని ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద సొసైటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ సంస్థకు గౌరవ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆమె. పబ్లిక్‌ సెక్టార్‌లో పని చేస్తున్న మహిళల కోసం వేదికను నెలకొల్పడంలో అంజలి విశేషమైన సేవలందించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నిర్వాహకుల సదస్సును అధ్యక్ష బాధ్యతలతో నిర్వహించారామె.

అమ్మ మాట
మా అమ్మ నాకు చెప్పిన మాట ఒక్కటే.. ‘ఇతరులకు నీ సహాయం అవసరమైనప్పుడు నువ్వు అక్కడ ఉండాలి. అలాగని నువ్వు వెనుకపడకూడదు’ అని. ఈ మాటే నన్ను నడిపించింది, ఈ స్థానంలో నిలబెట్టింది. యువతులు భర్తను ఎంపిక చేసుకోవడంలో తమను తాము సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అతడు తనకంటే ఎక్కువ చదువుకుని ఉండాలి, తన కంటే పెద్ద ఉద్యోగం చేస్తుండాలి అనే సంప్రదాయ భావజాలం నుంచి మహిళ బయటకు రావాలి. కలిసి జీవించడానికి ఒకరినొకరు అర్థం చేసుకోగలగడం, అభిప్రాయాలు కలవడం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. 
– అంజలి హజారికా,  రచయిత, సామాజిక
ధోరణుల అధ్యయనవేత్త 

– వాకా మంజులారెడ్డి 

మరిన్ని వార్తలు