ఈశావాస్యోపనిషత్తు బ్రహ్మసూత్రాల సారం

30 Jan, 2016 23:14 IST|Sakshi
ఈశావాస్యోపనిషత్తు బ్రహ్మసూత్రాల సారం

ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదంలోని నలభయ్యవ అధ్యాయంలోనిది. ఇందులో ఉన్నవి పద్ధెనిమిది మంత్రాలు మాత్రమే. అయితే ఇది మిగిలిన అన్ని ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ, భగవద్గీతనూ అధ్యయనం చేసే క్రమంలో ముందుండి దారి చూపిస్తుంది. మానవ జాతికి ఈ జన్మ ఎందుకు ఎత్తామో, ఎలా జీవించాలో, ఏం తెలుసుకోవాలో తెలియజేస్తుంది అందుకే నాలుగు వేదాలలో్ర పాచీనమూ, ప్రసిద్ధమూ అయిన పది ఉపనిషత్తులలోనూ దీనికే ప్రథమస్థానం దక్కింది. ఈ ఉపనిషత్తు గురించి మనం గతవారం చెప్పుకున్నాం. మరికొన్ని విశేషాలు ఈ వారం..
 
అంతటా ఆత్మయే నిండి భిన్న రూపాలుగా కనిపిస్తోందని తెలిసిన తర్వాత మానవ సమాజం ఎవరి పనులు వారు చేస్తూ కక్షలూ, కార్పణ్యాలూ లేకుండా నిండుగా నూరేళ్లూ జీవిస్తారనీ జీవించాలనీ ఈశావాస్యోపనిషత్తు ఆకాంక్ష.
 
 
ఓం ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మాగృధః కస్య స్విద్ధనమ్ ఈ జగత్తులో సృష్టి స్థితి లయలతో పరిణామం చెందుతూ కనపడేదంతా పరబ్రహ్మ స్వరూపమైన భగవంతునిచే ఆవరింపబడి ఉంది. ఈ సత్యాన్ని గ్రహించు. అతను నీకు అనుగ్రహించిన దానిని అనుభవించు. మరొకరికి ఇచ్చిన సంపదను దొంగిలించకు అన్నది ఈశావాస్యోపనిషత్తు ప్రధాన సూత్రం. ఈశావాస్య అనే మంత్రపాదం అనేకచోట్ల కనిపిస్తుంది కనుక ఈ ఉపనిషత్తుకు ఈశావాస్యోపనిషత్తు అని పేరు వచ్చింది.
 అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృత మశ్నుతే... అవిద్యతో మృత్యువును గెలిచి విద్యతో అమృతత్వాన్ని పొందవచ్చు అనే వాక్యం ఈ ఉపనిషత్తుకు ప్రాణం. భౌతికాన్ని, పారలౌకికాన్ని మానవుడు ఒకటిగా ఇష్టపడకుండా రెండిటి ప్రయోజనాన్ని పొందాలని ఈ ఉపనిషద్వాక్యం సూచిస్తోంది.
 
భౌతిక జీవన ప్రియత్వాన్ని అసంభూతి అనీ, ఆత్మజ్ఞానాన్ని సంభూతి అనీ దీనిలో పేరు పెట్టారు. అసంభూతితో ఎంత అంధకారంలో పడతారో కేవలం సంభూతితో అంతకంటే గాఢాంధకారంలో పడతారు. రెండిటినీ తెలుసుకున్నవాడే అమృతత్వాన్ని పొందుతాడు. రూపరహితమైన విశ్వాత్మను చర్మచక్షువు లతో చూడాలంటే.. సూర్యుడే చూపించగలడు. సౌరశక్తిని ఈ ఉపనిషత్తు జ్ఞానమార్గంగా స్తుతిస్తోంది. సత్యదర్శనానికి అడ్డంగా సూర్యబింబం మూతలాగా పెట్టబడి ఉంది. సూర్యుణ్ణి ప్రార్థించాలి. ఆయన కొంత కాంతి తగ్గించుకుని దారి చూపిస్తే మనకు సత్యదర్శనం అవుతుంది. సూర్యునిలో ఉన్న విశ్వశక్తి గోచరిస్తుంది.
 అప్పుడు భౌతిక శరీరంలో ఉన్న ప్రాణవాయువు విశ్వంలో లీనమవుతుంది. ఈ దేహం భస్మమౌతుంది. అనగా దేహభ్రాంతి నశిస్తుంది. జన్మపరంపర స్వరూపం గుర్తుకు వస్తుంది.
 
‘అగ్నే నయ సుపథారాయే అస్మాన్’ అంటే ఓ అగ్నీ! మమ్మల్ని మంచి దారిలో నడిపించు అంటూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించడంతో ఈశావాస్యోపనిషత్తు ముగుస్తుంది. మానవులకు పగలూ, రాత్రి కూడా ఆత్మజ్ఞానంతో కూడిన జీవనమే ఉంటుంది. సూర్యుడు, అగ్ని వారిని అలా నడిపించాలి. ఇహపరాల సమన్వయంతో కూడిన విశ్వాత్మజ్ఞానమే మానవ జన్మకు సార్థకతను ఇస్తుంది. అంతటా ఆత్మయే నిండి భిన్నరూపాలుగా కనిపిస్తోందని తెలిసిన తర్వాత మానవ సమాజం ఎవరి పనులు వారు చేస్తూ కక్షలూ, కార్పణ్యాలూ లేకుండా నిండుగా నూరేళ్లూ జీవిస్తారనీ జీవించాలనీ ఈశావాస్యోపనిషత్తు ఆకాంక్ష.
 
ఓ సూర్యుడా! నీవు ఒక్కడివే ఋషివి (జ్ఞానపారంగతుడివి). అందరినీ నియమించేవాడివి. అన్ని ప్రాణులను కార్యోన్ముఖులను చేసేవాడివి. సృష్టిలో అన్నిటిపైన ఆధిపత్యం కలవాడివి నువ్వే. మహాకాంతిమంతమైన సూర్యగోళం నన్ను అనుగ్రహించాలి. మంగళప్రదంగా నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి. అప్పుడు నేను నువ్వవుతాను. అనే ఈ ప్రార్థన జ్ఞానసముపార్జనను, ఇంద్రియ నిగ్రహాన్ని, కార్యోన్ముఖత్వాన్ని, జ్ఞానం వల్ల స్థిరమయ్యే అద్వైత స్థితిని తెలియజేస్తుంది. మానవజాతి జీవనవిధానం ఇలా ఉండాలి అని సూచిస్తుంది. సూర్యుడికి అందరినీ పోషించే శక్తి ఉంది కనుక అతడిని పూషా అంటారు.
 
‘‘ఓ అగ్నీ: మమ్మల్నందరినీ సుపథంలో నడిపించు. అన్ని లోకాలనూ దివ్యత్వంతో నింపగల విద్వాంసుడివి నీవే. మాకు పోరాడే శక్తిని ప్రసాదించు. మా పాపాలను పోగొట్టు. నీకు అనేక నమస్కారాలు చేస్తున్నాం.
 ఓం పూర్ణమదః పూర్ణమిదం,
 పూర్ణాత్ పూర్ణముదచ్యతే
 పూర్ణస్య పూర్ణమాదాయ,
 పూర్ణమేవావశిష్యతే.
 అది పూర్ణం ఇది పూర్ణం. పూర్ణం నుండి పూర్ణమే పుడుతుంది. పూర్ణానికి పూర్ణాన్ని కలిపితే పూర్ణమే మిగులుతుంది. శుక్ల యజుర్వేదంలోని ఈ శాంతిమంత్రం ఒక్కటి చాలు. మనకు సంపూర్ణజ్ఞానాన్ని కలిగించడానికి.
 - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

మరిన్ని వార్తలు