దేవుని కాడి సులువు

27 Aug, 2017 01:04 IST|Sakshi
దేవుని కాడి సులువు

స్వాభిమానం, స్వయంకృషి, స్వాతంత్య్రం... ఇవి కదా ఆధునిక సమాజంలో వినిపించే మాటలు. పాజిటివ్‌ ఆలోచనా సరళిని గురించి దాని ప్రభావానికి సంబంధించిన వాదనలు, దృకృథాలు వినబడని రోజే లేదు. ఎవరికి వాళ్లు వ్యక్తిగతంగా ఇతరులతో సంబంధం లేకుండా బతకడమే ఆధునికతగా మారింది.

అది ఏ సమాజమైనా, యుగమైనా, కాలమైనా, ఎంత గొప్పగా జీవించినా, జీవితానికి సంబంధించిన ‘అకౌంట్‌’ అంతా దేవునికి అప్పగించే రోజు ఒకటుంటుందని, దాన్నే తీర్పు దినమంటారని బైబిలు చెబుతుంది (ప్రసంగి 11:9). అనుకున్నది సాధించడమే ధ్యేయంగా, అంచెలంచెలుగా పైకి ఎగబాకడమే విజయ చిహ్నంగా, అంతా భావిస్తున్న నేటి తరంలో ‘పైన దేవుడున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు’ అని చెప్పడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది.

ఎందుకంటే అదేదో పాతచింతకాయ పచ్చడి సిద్ధాంతమంటూ తేలిగ్గా కొట్టేసే అవకాశాలే ఎక్కువ. దేవుడు లేకుండా జీవించగలమన్న ధీమా ఉంటే మంచిదే! కాని అందుకు అవసరమైనదానికన్నా ఎక్కువగా ‘స్వీయజ్ఞానం’ మీద ఆధారపడవలసి ఉంటుంది. అది ప్రమాదమే!’ దేవుడున్నాడు సుమా! అనేది ఒక బెదిరింపు కాదు, హెచ్చరిక అసలే కాదు. ఆదరణతో కూడిన స్పష్టీకరణ అది.

పెరిగే జ్ఞానంతో, విశృంఖలత్వంగా వెర్రితలలు వేస్తున్న స్వేచ్ఛా ధోరణులతో సమాజానికేమైనా మేలు జరిగిందా అంటే అదీ లేదు. మద్యానికి, లైగింక విశృంఖలత్వానికి, నేరప్రవృత్తికి, మాదకద్రవ్యాలకు బానిసలైన తరాన్ని అది పెంచి పోషిస్తోంది. పెద్ద జీతం గొప్ప జీవితాన్నిస్తుందనుకుంటే, పరుపు మెత్తదనం గాఢనిద్రనిస్తుందనుకుంటే, విశాలమైన భవనంలో సుఖశాంతులుంటాయనుకుంటే, అందం జీవితానికి సౌశీల్యాన్నిస్తుందనుకుంటే, ఇవే కదా ఎండమావుల భ్రమలంటే!!

ఎంత ప్రయాసపడ్డా, బయట ఎంతకాలమున్నా చీకటి వేళకు సొంతగూటికి చేరుకోవలసిందే! వైఫల్యాలు, కన్నీళ్ళు, అవమానాలు, అన్యాయాలన్నీ సహించి బలహీనపడ్డాక సేదతీరేది మాత్రం దేవుని ఒడిలోనే! ప్రయాసపడి భారం మోసే సమస్త జనులకు ఆయనిచ్చే ‘విశ్రాంతి’ని పొందడమంటే, మండుటెండలో దప్పికతో అలమటిస్తున్న బాటసారికి చల్లటి, తియ్యటి మంచినీళ్ళు దొరకటమే! ప్రతివ్యక్తి జీవితంలో ఏదో ఒక కాడి మోయక తప్పదు. కాని సాత్వికుడు, దీన మనస్సుగలవాడైన దేవుడిచ్చే కాడి సులువైనది, తేలికైనది అని బైబిలు చెబుతోంది (మత్తయి 11:28–30).
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు