అహంకారంతో భ్రష్టత్వం

20 Aug, 2017 00:07 IST|Sakshi
అహంకారంతో భ్రష్టత్వం

పరుగెత్తడం గొప్ప విషయమే, కాని పరుగెత్తుతూ పడిపోకుండా చూసుకోవడమూ ముఖ్యమే. పరుగు పందెంలో పాల్గొనేవారికి కోచింగ్‌ ఇచ్చే నిపుణులు కాలు మడతపడి పోకుండా ఎలా పరుగెత్తాలో మెలకువలు చెబుతారు. అపొస్తలుడైన పౌలు కూడా ‘తాను నిలుచున్నానని తలంచేవాడు పడిపోకుండా జాగ్రత్తపడాలి’ అంటాడు (1కొరింథీ 10:12). హిమాలయ శిఖరాన్ని కూడా పడేయగల శక్తి అహంకారానిది. విశ్వాసుల ఆత్మీయ పురోభివృద్ధికి అడ్డుపడే ప్రధాన శత్రువు అహంకారం.

విశ్వాసులుగా, సేవకులుగా దేవుని రాజ్య నిర్మాణంలో భాగంగా మనం చేసేదంతా దేవుడిచ్చే శక్తితోనే సాధ్యమవుతోందని మర్చిపోయి, ‘ఇదంతా నా ప్రతిభే!’ అని భావించిన మరుక్షణం నుండి పతనం ఆరంభమవుతుంది. ఈ స్వాతిశయమే భ్రష్టత్వంలో పడవేస్తుంది. లోకంలో ఎదుర్కొనే ప్రతిరోదననూ జయించే ఆత్మీయశక్తిని దేవుడు విశ్వాసిలో, సేవకుల్లో నిక్షిప్తం చేశాడు. అయితే ‘అహంకారం’ ఆ శక్తిని దొంగిలించి లేదా నిర్వీర్యపర్చి మనల్ని ఆత్మీయంగా బలహీనుల్ని చేస్తుంది.చూస్తూండగానే పతనం అంచులకు లాక్కుపోతుంది.


మన చిన్న చిన్న విజయాలు, ఆర్జించిన జ్ఞానం, అనుకోకుండా కలిసొచ్చిన సిరి, అహం విజృంభించబడడానికి చాలాసార్లు దోహదం చేస్తుంది. ఆదిమకాలంలో ప్రపంచంలోనే అత్యంత గొప్ప మేధావిగా పేరుగాంచిన గమలీయేలు పాదాల వద్ద జ్ఞానాభ్యాసం చేసిన పౌలు, ఎన్నడూ అతిశయించలేదు. దేవుడిచ్చిన పరలోక భాగ్యం, పరలోక జ్ఞానం ముందు తన ఈ లోకజ్ఞానం ‘వ్యర్థ పదార్థమే’నని ఆయన ప్రకటించాడు. అపరిచితులున్న కొత్త కొత్త ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ పరిచర్య చేసి కొత్తవిశ్వాసులతో చర్చిలు స్థాపించిన ఘనవిజయాలు పరిచర్యలో చవిచూసినా, నరకానికి పాత్రుడనైన తనను పరలోక పౌరుడిగా మార్చిన యేసుక్రీస్తు ప్రేమకు తాను రుణం తీర్చుకొంటున్నానన్నాడే తప్ప అదంతా తన ప్రతిభ అని ఎన్నడూ పొంగిపోలేదు.

బైబిలులోని కొత్త నిబంధన పుస్తకాల్లో సగం పౌలు రాసినవే! ఈనాడు క్రైస్తవంగా లోకం అర్థం చేసుకొంటున్న ఆత్మీయ సంగతులన్నీ ఆయన ఆవిష్కరించినవే! అంతటి మేధావి అయినా పౌలు, యేసుక్రీస్తు ప్రేమను అందరికీ పంచేందుకు తనను తాను మనుషులందరికీ దాసునిగా మారానని రాసుకున్నాడు (1 కొరింథీ 9:22). ఈ రెండువేల ఏళ్ళ క్రైస్తవ చరిత్రలో అపొస్తలుడైన పౌలు చేసినంత పరిచర్య ఎవరూ చేయలేదు, ఆయనలాగా శ్రమించినవారూ లేరు. అంతటివాడే తాను బానిసనని చెప్పుకుంటే, కొద్దిపాటి పరిచర్యకే కాలరెగరవేసే వారినేమనాలి? వినయం, సాత్వికత్వం, ప్రేమ, మృదుభాష్యమే విశ్వాసి లక్షణాలు.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు