ఒత్తిడిని చిత్తు చేయండిలా

17 Mar, 2014 00:06 IST|Sakshi
ఒత్తిడిని చిత్తు చేయండిలా

 ఒత్తిడి.. స్ట్రెస్.. ఆందోళన.. మనిషి జీవితంలో సహజం. పాఠశాల విద్యార్థి మొదలుకుని.. గృహిణులు, కళాశాల విద్యార్థులు, ఉద్యోగస్థులు, వ్యాపార రంగంలో ఉన్నవారు ఇలా ప్రతి ఒక్కరూ.. ఏదో ఒక విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. అంతేకాకుండా అనారోగ్యం బారినా పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడికి కారణాలు.. నివారణ మార్గాలు మీ కోసం..
 
మానవుడు.. నిద్రలేవడం నుంచి నిద్రపోయే వరకూ ఏదో ఒక మానసిక సంఘర్షణతో సతమతమవుతూ అందమైన జీవితాన్ని అంధకారంగా మార్చుకుంటున్నాడు. జీవితంలో కావాల్సిన అవసరాలకు అనుగుణంగా చక్కని ప్రణాళిక లోపించినప్పుడు మనిషి ఒత్తిడికి గురవుతాడు. దీంతో శారీరక, మానసిక రుగ్మతలకు లోనవడంతోపాటు, సామాజికంగా, ఆర్థికంగా బలహీనుడవుతాడు. ఒత్తిడిని.. విజయానికి నాందిగా మార్చుకుంటే మనిషి ఒత్తిడిని జయించడమే కాకుండా విజయతీరాలకు చేరుకుంటాడు. ముఖ్యంగా ప్రాథమిక దశలోనే ఒత్తిడికి గల కారణాలపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ఒత్తిడికి కారణమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని నిర్మూలించాలి. అయితే చాలామంది ఒత్తిడి నుంచి బయటపడడానికి మార్గాలను అన్వేషించరు. ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి సిగరెట్, మద్యపానం, మాదక ద్రవ్యాల అలవాట్లతో పెడదారులను ఎంచుకుంటారు. దీనివల్ల ఒత్తిడి నుంచి తప్పించుకోలేకపోవడంతోపాటు ఆరోగ్యం తీవ్ర దుష్ర్పభావాలకు లోనవుతుంది. కుటుంబంపై కూడా దీని ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఎవరికీ మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఒత్తిడికి కారణాలు, వాటిని జయించడానికి ఎంచుకోవాల్సిన మార్గాలు ఒకసారి పరిశీలిద్దాం.
 
అందరికీ పని ఒత్తిడి!


ఒక గృహిణి తన రోజువారీ వంట చేయడం నుంచి పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, బట్టలు ఉతకడం, కూరగాయలు తరుక్కోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక విషయమై ఒత్తిడికి గురవుతుంటుంది. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు వారి హాజరు, పరీక్షలు, అసైన్‌మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్ వంటి విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. అలాగే ఆఫీసుకు సరైన సమయంలో వెళతామో, లేదో అని ఉద్యోగులపై ఒత్తిడి ఉంటుంది. ఆఫీసుకు వెళ్లిన తర్వాత అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేయడం, సహోద్యోగులతో సమన్వయం వంటి విషయాల్లోనూ ఒత్తిడి సహజం. వ్యాపారం చేసే వారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువ ఉంటుంది. వ్యాపార విషయాల్లో వ్యక్తి 24 గంటలూ (ఒక్క నిద్రపోయేటప్పుడు మినహా) ఆలోచిస్తూ ఉంటాడని ‘కాలిఫోర్నియా యూనివర్సిటీ’ చేసిన అధ్యయనంలో తేలింది. కాబట్టి ఒక గృహిణి, ఒక విద్యార్థి, ఒక ఉద్యోగస్థుడు, ఒక వ్యాపారి.. ఇలా ప్రతి  ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ప్రతిరోజూ, ఏదో ఒక స్థితిలో ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు.
 
ఒత్తిడిని ఇలా ఎదుర్కోండి:

 
ఒత్తిడిని జయించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ కొన్ని పద్ధతులను పాటించాలి. దీని ద్వారా ఒత్తిడిని సులువుగా ఎదుర్కోవచ్చు. కాలం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ రోజు రేపు రాదు. ఓ కవి చెప్పినట్లుగా పెరుగుతుంది వయసు అని అనుకుంటారు కానీ తరుగుతుంది ఆయువు అని తెలుసుకోరు. కాలానికి ఎవరైతే విలువనిస్తారో వారు కాలానుగుణంగా ఎదుగుతారు. సమయపాలన ప్రాధాన్యతా క్రమం, పనిపై అకుంఠిత దీక్ష, వ్యాయామం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక ప్రణాళిక; పిల్లలతో, పెద్దలతో ప్రేమతో నిజాయతీగా వ్యవహరించడం, డైరీ రాయడం, రోడ్ మ్యాప్ రూపొందించుకోవడం వంటి వాటి ద్వారా ఒత్తిడి మీ దరి చేరదు. దీనివల్ల మీరు ఎంతో ఆర్యోగంగా, ఉత్సాహంగా ఉంటారు.
 
సమయపాలన:
 
ప్రపంచం మొత్తానికీ అందుబాటులో ఉన్న సమయం 24 గంటలే. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒక  పాఠశాలలో, కళాశాలలో చదివే విద్యార్థికి వారి టైమ్‌టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. విద్యార్థి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు పాఠశాల/కళాశాలలో బోధించిన అంశాలను అధ్యయనం, లోతైన విశ్లేషణ చేయడం ద్వారా విద్యార్థికి ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. టైమ్ టేబుల్‌లో ప్రతిరోజూ ప్రాధాన్యతా క్రమానికి పెద్దపీట వేయండి. రోజూ భోజనం, నిద్రతోపాటు స్టడీకి చక్కని ప్రణాళిక రూపొందించుకోండి. ప్రయోజనం లేని పనులకు ప్రాధాన్యత ఇవ్వకండి,
 
ప్రాధాన్యతాక్రమం:

విద్యార్థులు.. తమకు ఏ సబ్జెక్టుల్లో అసాధారణమైన పట్టు ఉందో, వేటిలో బలహీనంగా ఉన్నారో తెలుసుకోవాలి. దీని ఆధారంగా ప్రాధాన్యతాక్రమాన్ని రూపొందించుకోవాలి. సాధారణంగా ఒక వ్యక్తి తన పనులను ఒకచోట రాసుకొని వాటిలో ఏది అతి ముఖ్యం, ముఖ్యం, చివరి ప్రాముఖ్యత.. ఇలా ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసుకోవాలి. ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. అద్దె కట్టడం - సరుకులు తీసుకోవడం - దుస్తులు కొనడం - రైల్వే రిజర్వేషన్  చేయించడం - ఇవి ఆ రోజుకు పనులుగా రాసుకుంటే...

1. రైల్వే రిజర్వేషన్ చేయించడం (ఒకవేళ మనం తొందరగా చేయకపోతే వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోవచ్చు) 2. కరెంట్ బిల్ కట్టడం (కట్టకపోతే పెనాల్టీ పడొచ్చు)
3. సరుకులు తీసుకురావడం,  
4. దుస్తులు కొనడం. ఈ ప్రాధాన్యతల్లో చిట్టచివరిది దుస్తులు కొనడం అంత ప్రాధాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మొదటి రెండు అంశాలు సమయానికి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక పుస్తకంలో మనం చేయాల్సిన పనులను, వాటి ప్రాధాన్యతలను రాసుకోవాలి. ప్రాధాన్యతలో భాగం రోజువారీ, నెలవారీ, ఆరునెలల వారీగా టాస్క్‌లను రాసుకోవడం వల్ల పనులన్నీ సజావుగా సాగిపోతాయి.
 

మరిన్ని వార్తలు