కల వరం

2 Aug, 2015 23:47 IST|Sakshi
కల వరం

‘‘ రాత్రి... భలే కలొచ్చింది. ఎక్కడున్నానో తెలియదుగానీ... చుట్టూ బంగారం. వజ్రవైఢూర్యాలు రాశులు పోసి ఉన్నాయి. ఏదెంత విలువ చేస్తుందో... అంత డబ్బు వస్తే ఏమేం చేయాలో లెక్కలేస్తూ ఉన్నాను. కానీ... పక్కనే ఐదు తలల నాగుపాము! బంగారు ముట్టుకుందామంటే... కస్సున బుసకొడుతోంది. నాగస్వరం ఊది దాని దృష్టి తప్పిద్దామనుకుంటున్నా... ఇంతలో.... ఛా... మెలకువ వచ్చేసింది’’.
 
కలలు ఇలాగే ఉంటాయి. కొన్ని అసలు అర్థం కావు.. ఇంకొన్ని సగం సగం తెలిసినట్టుగా, మరికొన్ని కళ్లకు కట్టినట్టుగా స్పష్టంగా! యుగాలుగా మనిషి మెదడు ప్రతిరోజూ వేస్తున్న ఈ ‘నైట్ షో’లకు ఎంతో కొంత అర్థం లేకపోలేదు. అసలు నిజానికి కలలు ఎందుకు వస్తాయి? వాటివల్ల ప్రయోజనమేమిటి? మనకు నచ్చినట్టు కలలు కనవచ్చా? అన్న ప్రశ్నలకు శాస్త్రవేత్తలు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. వందేళ్ల క్రితం సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్‌జంగ్ లాంటి సైకాలజీ శాస్త్రవేత్తలు కలలనేవి అణచివేతకు గురైన మనిషి ఆలోచనలు, కోరికలకు ప్రతిరూపాలని సిద్ధాంతీకరిస్తే... అవి మెదడులోని విద్యుత్ ప్రేరణల కాకతాళీయ మేళవింపు మాత్రమేనని అలన్ హాబ్‌సన్, రాబర్ట్ మెకార్లీ వంటివారు కొత్త సూత్రాన్ని ప్రతిపాదించారు.
 
ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం.. కొన్ని సమస్యల పరిష్కారానికి, మనం బాగా దృష్టి పెట్టాల్సిన అంశాలు, సంఘటనలను గుర్తు చేసుకునేందుకు కలలు ఉపయోగపడతాయి. హాబ్‌సన్, మెకార్లీల అంచనాల ప్రకారం మెదడులోని న్యూరాన్ల కనెక్షన్లకు వ్యాయామం కల్పించేందుకు, తద్వారా ఎదో ఒకటి నేర్చుకునేందుకు కలలు ఉపయోగపడతాయి! ఏది సత్యమన్నది ఇప్పటికీ మిస్టరీనే.
 
 కలలు... నిద్రలో రకాలు!

 స్థూలంగా చెబితే నిద్ర రెండు రకాలు. కొంచెం వివరంగా ఆలోచిస్తే మాత్రం ఐదు రకాలని శాస్త్రవేత్తలు చెబుతారు. ముందుగా రెండు రకాల నిద్ర గురించి చూద్దాం. ఇందులో మొదటిది రాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్‌ఈఎం) స్లీప్. రెండోది నాన్ ఆర్‌ఈఎం. దీంట్లో మరో నాలుగు చిన్నదశలు ఉంటాయి. కలతనిద్ర, మగత నిద్ర, దీర్ఘనిద్ర లాంటివన్నమాట! ప్రతిరోజూ మనం మన నిద్రను నాన్ ఆర్‌ఈఎం స్లీప్‌తో మొదలుపెడతాం. ఈ దశ దాదాపు 90 నిమిషాలపాటు ఉంటుంది. ఆ తరువాతి దశ ఆర్‌ఈఎం స్లీప్‌ది. కలలు ఎక్కువగా వచ్చేది ఈ దశలోనే. ఈ దశలో శరీరం మొత్తం చచ్చుబడిపోయినట్లు ఉన్నా... మెదడుమాత్రం మెలకువగా ఉన్నప్పటి మాదిరిగా చురుకుగా ఉంటుంది. గుండెకొట్టుకునే, ఊపిరి తీసుకునే వేగం కూడా ఈ దశలో ఎక్కువగా ఉంటుంది. మెదడు విడుదల చేసే గ్లైసీన్ అనే అమినోయాసిడ్ కారణంగా ఇదంతా జరుగుతుంది. అందువల్లనే ఆర్‌ఈఎం నిద్రలో ఎంతటి భయంకరమైన కలలు వచ్చినా... వాటికి మన శరీరం స్పందించదు. లేదంటే... మీ కలల్లో మీరు ఫుట్‌బాల్ ఆడుతూంటే... మీ కాళ్లూ ఎడాపెడా పక్కనున్న వారిని తన్నేస్తూంటాయి!
 
 మెలకువతో జ్ఞాపకాలు మాయం
 మంచి కల కంటున్నప్పుడు అకస్మాత్తుగా ఏ కారణం చేతనైనా మీకు మెలకువ వచ్చిందనుకుండి. ఆ వెంటనే... మీ కల దేనికి సంబంధించిందన్నది భేషుగ్గా గుర్తుంటుంది. ఐదు నిమిషాలు గడిస్తే మాత్రం సగం అంశాలు మరచిపోతారు. పదినిమిషాల తరువాత మిమ్మల్ని నిద్రలేపి అడిగితే ఏమో... గుర్తులేదన్న సమాధానం రావడం గ్యారెంటీ! ఎందుకిలా జరుగుతుందంటే... అవన్నీ అణచివేతకు గురైన ఆలోచనలు కాబట్టి అంటాడు ఫ్రాయిడ్. అలా ఏం కాదు.. పొద్దున్న లేవగానే మిగతా పనులు మన ఆలోచనలను తరుముతూంటాయి కాబట్టి కలలు గుర్తుండవని ఇతర శాస్త్రవేత్తల అంచనా. పైగా కలలు చాలా అస్పష్టంగా మొదలవుతాయి కాబట్టి, రెండు మూడు సార్లు వాటిని అనుభూతి పొంది అర్థం చేసుకోవడం వీలుకాదు కాబట్టి అవి గుర్తుండవని ఫ్రాయిడ్ కాలంలోనే పనిచేసిన ఎల్.స్ట్రంపెల్ వంటి వారు అంటారు.
 
 కలలను కంట్రోల్ చేయవచ్చా?
 శ్రమతో కూడినదైనా... ప్రాక్టీస్ చేస్తే మీకు నచ్చినట్లు కలలు కనడం సాధ్యమేనని అంటోంది ఈ కాలపు సైన్స్. ఈ రకమైన కలలను లూసిడ్ డ్రీమింగ్ అంటారు. కలలను గుర్తుపెట్టుకునేందుకు ఉపయోగించిన టెక్నిక్‌ల మాదిరివే దీనికి పనికొస్తాయని ‘ది లుసిడిటీ ఇన్‌స్టిట్యూట్’ వ్యవస్థాపకుడు స్టీఫెన్ లాబార్జ్ (స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ) అంచనా.

  కలలను నియంత్రించడం ద్వారా... మనకు కావాల్సిన విధంగా కల కనడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చునని ఈయన అంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు మాత్రమే కాకుండా... మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు, పీడకలల ప్రభావం నుంచి బయటపడేందుకు నియంత్రిత కలలు సాయపడతాయని ఈయన అంటున్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేసిన అనుభూతి పొందడం లూసిడ్ డ్రీమింగ్ ద్వారా సాధ్యమని ఉదాహరణకు... హార్ట్‌స్ట్రోక్ వల్ల పక్షవాతం వచ్చినవారు కలల్లో తమకిష్టమైన పని (నడవడం కావచ్చు, డ్యాన్స్ చేయడం కావచ్చు) చేయడం ద్వారా సెన్సరీ మోటార్లకు పనిచెప్పి త్వరగా కోలుకునే అవకాశం ఏర్పడుతుందని లాబార్జ్ అంచనా.
 - గిళియార్
 
 గుర్తు పెట్టుకోవాలంటే....
 కలల్ని గుర్తుపెట్టుకోవడం కష్టమే. కానీ అసాధ్యం మాత్రం కాదు. ఇందుకు సంబంధించి నెట్‌లో బోలెడంత సమాచారం ఉంది. అది కాకుండా..పడుకునే ముందు ఈ రోజు నాకు వచ్చే కలల్ని గుర్తుంచుకోవాలి అని గట్టిగా అనుకోవడం.90 నిమిషాలకు ఒకసారి మోగేలా అలారం పెట్టుకుని... మెలకువ వచ్చినప్పుడల్లా మీ కల సారాంశాన్ని రాసుకోవడం.
 
 పీడకలలు ఎందుకొస్తాయి?
 నిద్రల్లోంచి ఉలిక్కిపడి లేచేసే స్థాయిలో పీడకలలు రావడం మనందరికీ అనుభవమే. ఈ రకమైన కలల్లో ఆప్తుల మరణం మొదలుకొని... అనూహ్య పరిస్థితుల్లో ప్రమాదాలు మనల్ని వెంటాడటం వరకూ అనేక థీమ్‌లు కనిపిస్తూంటాయి. ఈ రకమైన కలలు వచ్చేందుకు మన మానసిక పరిస్థితి కొంతవరకూ కారణం కావచ్చునని శాస్త్రవేత్తలు అంటారు. కొన్ని రకాల మందులు కూడా కారణమవుతాయని, అకస్మాత్తుగా మందులు వాడటం ఆపేసినప్పుడూ పీడకలలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా. కలలను నియంత్రించుకునేందుకు ఉపయోగించే టెక్నిక్‌లను వాడటం ద్వారా పీడకలలను మనకు అనుకూలంగా మార్చుకుని నిజజీవిత సమస్యలను అధిగమించవచ్చునని వీరు అంటారు.
 
 కలల అద్భుతాలు
  రసాయన మూలకం బెంజీన్ ఆకారాన్ని కనుక్కున్నది జర్మనీ శాస్త్రవేత్త కెకూలే. పాములు తమనోటితో తోకలను పట్టుకుని గుండ్రటి ఆకారంలో తిరుగుతున్నట్లు ఆయనకు ఒక కల వచ్చింది. దాంతో అప్పటివరకూ బెంజీన్ ఆకృతిని అంచనా వేసేందుకు నానా కష్టాలు పడ్డ కెకూలే.. ఆ వెంటనే బెంజీన్ గుండ్రంగా ఉంటుందని తేల్చేశాడు!

ఎలియాస్ హోవే పేరెప్పుడైనా విన్నారా? 1884లో కుట్టుమిషన్‌ను ఆవిష్కరించింది ఈయనే. సూదిని ఓ యంత్రంలా ఎలా వాడుకోవాలని తర్జనభర్జన పడుతున్న సమయంలో ఆయనకు ఓ కల వచ్చింది. అందులో ఆయన్ను కొందరు గిరిజనులు బరిసెలతో చుట్టుముట్టారు. ప్రతి బరిసెలోనూ ఓ చిన్న రంధ్రం ఉందట. మేలుకున్న తరువాత... సూది చివరలో చిన్న రంధ్రం ఏర్పాటు చేస్తే కుట్టుమిషన్ సిద్ధమవుతుందని ఆయన లెక్కేశాడు. తయారు చేశాడు కూడా.పాల్ మెకార్టినీ, బిల్లీజోయెల బీతోవెన్ వంటి సంగీత కళాకారులు కలల ద్వారా స్ఫూర్తిపొందారని అంటారు. వీరిలో కొందరికి కలల్లో రకరకాల ఆర్కెస్ట్రా అమరికలు కనిపిస్తే... కొందరికి అందమైన పాటలు కలల్లో వినిపించేవట!
 
 

మరిన్ని వార్తలు