పులీ పులీ ఏమయ్యావ్‌?!

6 Oct, 2017 23:36 IST|Sakshi

కళ

హిందీలో ‘బాగ్‌ బహాదుర్‌’ అనే సినిమా ఉంది. 1989లో వచ్చింది. పవన్‌ మల్హోత్రా (‘ఐతే’లో విలన్‌) హీరో. పశ్చిమ బెంగాల్‌లోని ఒక పులివేషదారుడి కథ అది. పశ్చిమ బెంగాల్‌లో పల్లె ప్రజలకు పులి వేషం ఒక వినోదం. పులి వేషగాడు పులి వేషం వేసుకుని ఊరూరు తిరిగితే ఆ వినోదానికి ఊరి వాళ్లు బియ్యం, పప్పులు, చిల్లర ఇస్తారు. అదొక్కటేనా? పులి వేషగాడికి ఎంతో గుర్తింపు గౌరవం కూడా ఉంటాయి. అతడిని అందరూ హీరోలా చూస్తారు. కాని ఒకరోజు హటాత్తుగా ఆ ప్రాంతానికి సర్కస్‌ వస్తుంది. అందులో నిజం పులి ఉంటుంది. నిజం పులిని చూసిన కళ్లతో ఊరి వాళ్లు పులివేషగాడిని చూడరు. వాడు ఎంత బాగా వేషం వేసుకొని ఎంత బాగా పులిలా ఆడినా అస్సలు పట్టించుకోరు. ‘కొత్తొక వింత పాతొక రోత’లాగా వాడి కథ అంతటితో విషాదంగా ముగిసిపోవడాన్ని ఆ సినిమాలో చూపిస్తారు. ఉత్తరాదిలోనే కాదు దక్షిణాదిలో కూడా ఇప్పుడు దాదాపు అంతరించిపోతున్న కళ పులేషం.

దసరాకు, సంక్రాంతికి
పులి వేషం దక్షిణాదిలో కూడా చాలా ఫేమస్‌. ముఖ్యంగా ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాల్లో పులివేషానికి ఎంతో ఆదరణ ఉండేది. తమిళంలో దీనిని ‘పులియాట్టం’ అంటారు. కేరళలో ‘పులికలి’ అంటారు. అయితే ఇప్పుడు తమిళనాడు, ఆంధ్రలో కొన ఊపిరితో ఉన్న ఈ వేషం కర్నాటక, కేరళల్లో కొద్ది కొద్దిగా ఉనికిలో ఉంది. ఆంధ్ర, తెలంగాణల్లో దసరా, సంక్రాంతి వస్తే పులి వేషం తప్పనిసరిగా కనిపించేది. ముఖ్యంగా రథోత్సవాల్లో ముందు పులి వేషగాళ్లు ప్రజలను ఉత్సాహ పరిచేవాళ్లు, తప్పెట్లు మోగుతుంటే నృత్యం చేస్తూ నిజం పులుల్లా ఒక ఉన్మత్తతతో ఈ డాన్స్‌ ఆడేవారు. నేల మీద పెట్టిన నిమ్మకాయను పులి డాన్స్‌ చేస్తూ వంగి పంటి కిందకు తీసుకుని కొరికి ఊయడం, వేటగాడు వస్తే అతడి మీద లంఘించడం ఇవన్నీ గగుర్పాటు కలిగిస్తాయి. కేరళలో ఓనం పండగ సందర్భంలో తప్పనిసరిగా పులివేషం కనిపించాల్సిందే. ఇది కాకుండా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో మొహర్రమ్‌ పండగ సమయంలో, ఉర్సులప్పుడు పులి వేషం ఉండేది. ముస్లింలు కూడా ఈ ఆటను విశేషంగా ఆదరించేవారు.

జంతువులను అనుకరిస్తూ...
మనిషి జంతువులను అనుకరిస్తూ నృత్యాలు చేయడం నేర్చుకున్నాడు. నెమలి నృత్యం, గుర్రం నృత్యం, గరుడ, సింహ నృత్యాలు కూడా జానపదులు సాధన చేశారు. అయితే వీటన్నింటిలో పులి వేషం కష్టమైనది. దీనికి శారీరక బలం ఎక్కువ ఉండాలి. పైగా ఒళ్లంతా రంగులు పూసుకొని వాటితో ఇబ్బందులు పడాలి. ముఖానికి మాస్క్‌ ధరించాలి. వీటన్నింటితో వేషం వేయడం కొద్ది మందికే సాధ్యం కాబట్టి వారికి గిరాకీ ఎక్కువ ఉండేది.

గత గాండ్రింపులే...
ప్రస్తుతం పులి వేషగాళ్లు దాదాపుగా అంతరించారని చెప్పవచ్చు. తమిళనాడులో చేసేవారే లేరు. ఇక కేరళలో మొన్న జరిగిన ఓనం పండగ సందర్భంలో ఆనవాయితీగా ఆడాల్సిన పులివేషగాళ్ల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ఆరుమంది జట్టుతో లేదా పన్నెండుమంది జట్టుతో సాగే ఈ ఆట కోసం ఎవరూ ముందుకు రాలేదు. అసలు ఆనాటి ఆట మర్మం తెలిసినవాళ్లు ఆ ప్రకారం తప్పెట్లు మోగించేవారు నేడు అతి తక్కువ మంది మిగిలారు. ఒక గొప్ప కళను ప్రభుత్వాలు, ప్రజలు పట్టించుకోకపోతే ఇలాగే అంతరించిపోతుంది. ‘నాన్నా పులి’ కథలో పులి మూడోసారి వస్తుంది. కాని ఈ కథలో మాత్రం పులి ఎప్పటికీ రాదు. రాబోదు.

మరిన్ని వార్తలు