ఆ పాలు తాగితే నిత్య యవ్వనం..

17 Jan, 2020 19:36 IST|Sakshi

లండన్‌ : వెన్నతీసిన పాలు తీసుకోవడం ద్వారా డీఎన్‌ఏ వయసు మీరడాన్నినియంత్రించవచ్చని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. తక్కువ కొవ్వున్న పాలను తాగేవారు వారు వారి వయసు కంటే నాలుగున్నరేళ్లు చిన్నవారిగా కనిపిస్తారని పేర్కొంది. 6000 మంది జీన్స్‌ను, వారు తీసుకునే ఆహారం, ఎలాంటి పాలు తాగుతారనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఆ సర్వే కీలక వివరాలను వెల్లడించింది. క్రోమోజోముల పరిమాణం ఆధారంగా డీఎన్‌ఏ వయసును శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రజలు తీసుకునే పాలల్లో ఒక శాతం కొవ్వు అధికమైనా ఒక్కో శాతానికి వారి డీఎన్‌ఏ నాలుగేళ్ల పైగా వయసు మీరినట్టు సర్వేలో వెల్లడైంది. 0.3 శాతం కొవ్వు కలిగి ఉన్న పాలను తీసుకునే వారు 3.6 శాతం కొవ్వున్న పాలను తీసుకునే వారితో పోలిస్తే దీర్ఘకాలం యవ్వనంగా కనిపిస్తూ ఆరోగ్యంగా ఉన్నట్టు తేలిందని సర్వే సూచించింది.

సంతృప్త కొవ్వులతో కూడిన పాలను తీసుకుంటే అది కణాలపై ఒత్తిడి పెంచి వాటిని నిర్వీర్యం చేస్తుందని శరీరంలోని కండరాల క్షీణతకు దారితీస్తుందని పేర్కొంది. పాలు తాగడం అనారోగ్యకరం కాదని, కానీ మీరు ఎలాంటి పాలు తాగుతున్నారనే దానిపై అవగాహన ఉండాలని పరిశోధకులు పేర్కొన్నారు. అధిక కొవ్వున్న పాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే వెన్నతీసిన పాలు డీఎన్‌ఏ దెబ్బతినకుండా కాపాడతాయనేందుకు పరిశోధకులు ఎలాంటి ఆధారాలు చూపకపోవడం గమనార్హం. వారు కేవలం ఈ పాలను తీసుకుంటే కలిగే ప్రభావాలను మాత్రమే పరిశీలించారు..కారణాలపై లోతుగా విశ్లేషించలేదు. బ్రిగమ్‌ యంగ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ అథ్యయనానికి ప్రొఫెసర్‌ లారీ టకర్‌ నేతృత్వం వహించారు. ఈ అథ్యయన వివరాలు సైన్స్‌ జర్నల్‌ ఆక్సిడేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ సెల్యులార్‌ లాంగివిటీలో ప్రచురితమయ్యాయి.

చదవం‍డి : గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న!

మరిన్ని వార్తలు