గర్భవతులు డ్రైవింగ్ చేయవచ్చా?

22 Dec, 2014 23:47 IST|Sakshi
గర్భవతులు డ్రైవింగ్ చేయవచ్చా?

గర్భధారణకు పట్టే తొమ్మిది నెలల వ్యవధిని మూడు భాగాలుగా విభజించి వాడుకలో మూడు త్రైమాసికాలుగా (ట్రైమిస్టర్స్)గా పేర్కొంటుంటారు నిపుణులు. మొదటి మూడు నెలల వ్యవధి అయిన మొదటి ట్రైమిస్టర్‌లో పొట్ట అంతగా కనిపించదు. కానీ రెండో ట్రైమిస్టర్ అయిన నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు పొట్ట కనిపించడం మొదలవుతుంది. ఇక మూడో ట్రైమిస్టర్ అయిన ఏడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు అది గరిష్ఠంగా పెరుగుతుంది. పొట్ట పెరగడం జరిగే రెండో ట్రైమిస్టర్‌లో గర్భవతులైన మహిళలు కారు నడపడం అంత మంచిది కాదని పేర్కొంటున్నారు కెనడాకు చెందిన వైద్య నిపుణులు. కెనడా పరిశోధకులు ఐదేళ్ల వ్యవధిలో మొత్తం 5,07,262 మంది గర్భవతులపై వివిధ అధ్యయనాలు చేశారు. యాక్సిడెంట్ జరిగిన సందర్భాల్లో గర్భం లేని మహిళలకూ, మొదటి ట్రైమిస్టర్ మహిళలకు ప్రమాదాల గణాంకాల్లో పెద్ద తేడా ఏమీ లేదనీ, అయితే రెండో ట్రైమిస్టర్‌లో ఉన్న మహిళలకు మాత్రం... ప్రమాదాలు జరిగే అవకాశాలు 42 శాతం ఎక్కువని తేల్చారు.ఈ అధ్యయన సారాంశమంతా ‘కెనెడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్’లో చోటు చేసుకుంది. అయితే కారు నడిపేవారు విధిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కానీ... ఈ సీట్ బెల్ట్‌ను పొట్ట కింది నుంచి సౌకర్యంగా ఉండేలా ధరించేట్లుగా చూసుకోవాలి.

ద్విచక్రవాహనాలు నడిపే మహిళలకోసం...

 ఇక కొందరు స్త్రీలు తాము ద్విచక్రవాహనం నడుపుతుంటామని, అలా నడపవచ్చా అని సందేహపడుతుంటారు. దీనికి నిపుణులు చెప్పే సమాధానం ఏమిటంటే... కుదుపుల్లేకుండా నడుపుతూ, ట్రాఫిక్‌లో తాము తీసుకునే జాగ్రత్తల విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధతీసుకుంటూ, తమ శరీరం సహకరించినంత వరకు మహిళలు స్కూటర్ లేదా స్కూటీ వంటి వాహనాలను నడపవచ్చు. కాకపోతే అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, ఎదురుగా ఉన్న గుంతల్లోకి వాహనాన్ని నడిపి శరీరాన్ని అకస్మాత్తుగా కుదుపునకు గురిచేయడం వంటివి జరగకుండా చూసుకోవాలి. అందుకే రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో వాహనం నడపకుండా అవాయిడ్ చేయడమే మంచిది.
 

మరిన్ని వార్తలు