తేనెటీగల స్థానంలో డ్రోన్లు!

13 Jun, 2018 00:24 IST|Sakshi

క్రిమిసంహారక మందుల కారణంగా తేనెటీగలు ఏటికేడాదీ అంతరించిపోతున్నాయి. పూల పుప్పొడి తోట అంతా విస్తరించేలా చేసి ఫలదీకరణకు సాయపడే తేనెటీగలు తగ్గిపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని రైతులు ఇప్పటికే గుర్తిస్తున్నారు. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? చాలా సింపుల్‌ అంటోంది న్యూయార్క్‌ కంపెనీ డ్రాప్‌కాప్టర్‌. తేనెటీగల సైజులో కాకున్నా ఓ మోస్తరు సైజుండే డ్రోన్లతో పుప్పొడిని వ్యాపింపచేయవచ్చును అంటోంది ఈ కంపెనీ. ఈ మధ్యే డ్రాప్‌కాప్టర్‌ డ్రోన్లు అమెరికాలోని ఓ ఆపిల్‌ తోటలో చెట్లకు ఎనిమిది అడుగుల ఎత్తులో ఎగురుతూ పుప్పొడిని వెదజల్లాయి.

ఇది తేనెటీగల స్థాయిలో సమర్థంగా  పనిచేసిందా? లేదా? అన్నది తేలాలంటే దిగుబడి వచ్చేవరకూ వేచి చూడాల్సిందే. అయితే డ్రోన్లు ఎంత బాగా పనిచేసినప్పటికీ అవి తేనెటీగలకు సాటికాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. డ్రాప్‌కాప్టర్‌ డ్రోన్లు సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపవచ్చునేమోగానీ.. తేనెటీగలను పరిరక్షించుకోవడం దీని కంటే ముఖ్యమైన విషయమని అంటున్నారు వారు. 
 

మరిన్ని వార్తలు