దుష్ప్రభావాలు లేని మందులు

14 May, 2018 23:36 IST|Sakshi

మరింత సమర్థమైన, దుష్ప్రభావాలు అతి తక్కువగా ఉండే మందుల తయారీకి తాము ఓ వినూత్న పద్ధతిని గుర్తించినట్లు వీజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. మందులు రసాయన అణువులతో తయారవుతాయని మనకు తెలుసు. ఈ అణువుల్లోనూ కైరల్‌ అణువులు మరింత ప్రత్యేకమైనవి. మన రెండు చేతులు ఒకేలా ఉన్నా.. ఒకదానికి ఒకటి ప్రతిబింబంలా ఉంటాయి కదా.. కైరల్‌ అణువులు కూడా అచ్చం ఇలాగే ఉంటాయి. రెండు రకాల అణువుల పనితీరులో బోలెడంత వ్యత్యాసం ఉంటుంది. ఒకరకమైన అణువు స్థానంలో ఇంకొకదాన్ని వాడితే ప్రమాదం కూడా.

ఈ నేపథ్యంలో వీజ్‌మెన్‌ శాస్త్రవేత్తలు ఈ రెండు రకాల అణువులను సులువుగా వేరు చేసే పద్ధతిని ఆవిష్కరించడంతో, మందుల సామర్థ్యం పెరగడంతోపాటు దుష్ప్రభావాలు కూడా గణనీయంగా తగ్గుతాయని అంచనా. అయస్కాంతాల ఆధారంగా పనిచేసే ఈ పద్ధతిని ఆనుసరించినప్పుడు దుష్ప్రభావాలకు కారణమైన అణువులు ఎక్కువ స్థాయిలో వేరుపడిపోతాయని.. తద్వారా దుష్ప్రభావాలు తగ్గుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ నామన్‌ తెలిపారు. ఇదే పద్ధతిని వ్యవసాయంలో వాడే రసాయనాలకూ వర్తింపజేయవచ్చునని, తద్వారా తక్కువ మోతాదుతోనే ఎక్కువ ఫలితాలు సాధించేందుకు అవకాశమేర్పడుతుందని నామన్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు