మునగాకు సాగు ఇలా..

8 Jan, 2019 06:14 IST|Sakshi

పోషకాహార లోపాలకు మునగాకు సరైన మందు. కొన్ని ప్రాంతాల్లో మునగాకు ఉత్పత్తులను రోజు వారీ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. ఇటీవల కాలంలో నగరాల్లోనూ పోషకాహార లోపం నివారణకు వివిధ పద్ధతుల్లో మునగ ఆకు ఉత్పత్తుల వాడకం పెరిగింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మునగ ఆకును సాగు చేయటం ఎలా? ఇంటి పెరటిలోనో లేదా పొలంలోనో కొద్దిపాటి స్థలంలో మునగ ఆకు తోట పెంపకాన్ని చేపడితే ఏడాదంతా తాజా మునగాకును పొందవచ్చు. 

ఉన్న కొద్దిపాటి స్థలంలోనే మంచి పంట వస్తుంది. సామాజిక స్థలాలు, తోటలు, పాఠశాల ఆవరణల్లోనూ ఈ విధానంలో మునగతోటలను సాగు చేసుకుంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం మన సొంతమవుతుంది. ఎండిన కాడల నుంచి ఆకును సేకరించాలి. తాజా ఆకును వాడుకోవచ్చు. లేదా నీడలో ఆరబెట్టిన ఆకుతో పౌడర్‌ తయారు చేసుకోవచ్చు. కత్తిరించిన తరువాత మునగ మొక్కలు మళ్లీ చిగురిస్తాయి. మరో 50 రోజుల్లో కోతకొస్తాయి. మునగ తోట ఏళ్ల తరబడి ఆకును ఇస్తూ ఉంటుంది. అదెలాగో చదవండి మరి..


 ముందుగా 13 చదరపు అడుగుల స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ 2 అడుగులు లోతు మట్టి తవ్వాలి


 తవ్విన మట్టికి సమాన నిష్పత్తిలో కోళ్ల ఎరువు లేదా వానపాముల ఎరువును కలుపుకోవాలి


 తవ్విన గుంతను లేదా మడిని మట్టి, ఎరువుల మిశ్రమంతో నింపాలి. మడిని నీటితో తడుపుతుండాలి. ఆరు వారాల్లో మంచి ఎరువు తయారవుతుంది


 చెక్కముక్కలను ఉపయోగించి మడిని నాలుగు సమాన భాగాలుగా విభజించుకోవాలి


 తర్వాత మునగ విత్తనాలు నాటుకోవాలి


 విత్తనాలు విత్తిన తర్వాత గడ్డిని పరచి ఆచ్ఛాదన కల్పించి, నీటి తడులివ్వాలి


 పెంపుడు జంతువులు, పశువుల నుంచి మడికి రక్షణ కల్పించాలి


 మడిలో నెల రోజుల్లో ఏపుగా, వత్తుగా పెరిగిన  మునగ మొక్కలు


 5 వారాల్లో మునగ మొక్కలు ఇలా కనువిందు చేస్తాయి


 6 వారాల వయసున్న మునగ మొక్కలు



 భూమి మట్టం నుంచి అడుగున్నర ఎత్తులో కత్తిరించాలి


 కొమ్మలను నీడలో ఆరబెట్టాలి


 50–60 రోజులకల్లా  మళ్లీ మునగ తోట కోతకు సిద్ధంగా ఉంటుంది


మూడోసారి కోతకు సిద్ధంగా ఉన్న మునగ మొక్కలు


 మూడో కోతలో దాదాపు 90 కిలోల తాజా రెమ్మల దిగుబడి వస్తుంది

మరిన్ని వార్తలు