పరివర్తనతో పాప ప్రక్షాళనం

23 Dec, 2018 00:32 IST|Sakshi

నిరాశ, నిస్పృహల వల్ల కలిగే నష్టాలు, అనర్ధాలు, వినాశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, దాన్నుండి వారిని రక్షించడానికి ముహమ్మద్‌  ప్రవక్తమహనీయులు ఒక సంఘటన వినిపించారు. దీనివల్ల ప్రజలు తమ జీవితంలోని ఏదో ఒకదశలో తమ పాపాలకు సిగ్గుపడి, పశ్చాత్తాప హృదయంతో చిత్తశుద్ధిగా దేవునిముందు సాగిలపడి, క్షమాభిక్ష వేడుకుంటే, ఆయన తప్పకుండా క్షమిస్తాడన్న గుణపాఠం లభిస్తుంది.పూర్వజాతిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు కరడుగట్టిన నేరస్తుడు. ఎన్నో హత్యలు చేశాడు. ఇకనైనా పరివర్తన చెందుదామని ఒక సాధువును ఆశ్రయించాడు.‘అయ్యా.. నేను ఒకపాపాత్ముణ్ణి. ఇప్పటివరకు 99 హత్యలు చేశాను. ఇకనైనా మారదామనుకుంటున్నాను. పరివర్తన చెందుదామని నిర్ణయించుకున్నాను.

మరి నాపాపాలను దేవుడు క్షమిస్తాడా?’ అని ఆశగా ప్రశ్నించాడు. దానికా సాధువు, ‘లేదు.. లేదు.. నీ క్షమాపణకు ఇప్పుడు ఎలాంటి అవకాశాలూలేవు.’ అని కరాఖండిగా సమాధానం చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి నిరాశకు లోనై ఆ సాధువును చంపేశాడు.తరువాత అతడు మరో ధార్మిక గురువును అన్వేషించాడు. అతనికి తన వృత్తాంతమంతా వినిపించి, ‘ఇన్ని హత్యలకు పాల్పడిన నన్ను అల్లాహ్‌ కరుణిస్తాడా.. నా క్షమాపణను స్వీకరిస్తాడా... నా పాపాలకు నిష్కృతి ఉన్నదా..?’ అని ప్రశ్నించాడు ఆశగా..అప్పుడా ధార్మిక పండితుడు, ’ఎందుకు లేదు.. అల్లాహ్‌ అమిత దయాళువు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనంతంగా కరుణించేవాడు. క్షమాపణాద్వారాలు ఎల్లవేళలా తెరుచుకొనే ఉన్నాయి.

చిత్తశుద్ధితో మన్నింపును కోరుకో.. ఆయన తప్పకుండా క్షమిస్తాడు. అయితే, ఇక్కడి వాతావరణమూ, ఇక్కడి పరిసరాల ప్రభావమూ అంత బాగా లేదు. కాబట్టి నువ్వు ధార్మికచింతన అధికంగా ఉన్న ఫలానా ఊరికి వెళ్ళిపో. ఆధ్యాత్మిక చింతనాపరులైన అక్కడి ప్రజలతో కలిసి కొత్తజీవితాన్ని ప్రారంభించు.’ అని హితవు చేశాడు.దీంతో ఆ వ్యక్తి మారిన మనసుతో, పరివర్తిత హృదయంతో ఊరువదిలి బయలుదేరాడు. కాని తను వెళ్ళదలచుకున్న ఊరికి చేరకముందే మార్గమధ్యంలోనే మృత్యువు సంభవించింది. అప్పుడు దేవుని కారుణ్యదూతలు, యాతనా దూతలు అక్కడికి చేరుకున్నారు. ఇతడు వందహత్యలు చేసిన హంతకుడు.

చివరలో పశ్చాత్తాపం చెందినప్పటికీ, ఇంతవరకూ ఒక్క పుణ్యకార్యమైనా చెయ్యలేదు. అన్నారు యాతనా దూతలు.‘కాదు, ఇతను ఎన్నిపాపాలు చేసినప్పటికినీ,ç పరివర్తనచెంది, దేవుని సమక్షంలో క్షమాపణ వేడుకొని మారిన మనసుతో మంచి వైపుకు వచ్చాడని కారుణ్య దూతలు వాదించి, తమతో తీసుకుపోయారు. కనుక చెడులు చేస్తున్నవారు, ఇప్పటికే అనేక చెడులు చేశామని, చెడుల్లో కూరుకు పోయామని, ఇక ఇప్పుడు మంచి పనులు చేసినా ప్రయోజనం ఏముంటుందని నిరాశ పడకూడదు. జరిగిన పాపాలు, పొరపాట్ల పట్ల పశ్చాత్తాపం చెంది, మంచిమనసుతో, పరివర్తిత హృదయంతో కొత్తజీవితాన్ని ప్రారంభిస్తే దేవుడు తప్పకుండా కరుణిస్తాడు. ఎలాంటి సందేహమూలేదు. అల్లాహ్‌ అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని, సన్మార్గంపై నడపాలని మనసారా కోరుకుందాం.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

మరిన్ని వార్తలు