సన్‌దడ 

21 Mar, 2019 00:49 IST|Sakshi

ఎండలు బాగా ముదిరాయి. గతంతో పోలిస్తే ఈ వేసవిలో ఎండ చండప్రచండంగా కాస్తూ ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదు కావచ్చంటూ వాతావరణశాఖ వారూ హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత ఎండలో బయటకు వెళ్లడం ప్రమాదకరం. కానీ పరీక్షలంటూ ఇటు విద్యార్థులూ, ఎన్నికల హడావుడిలో కార్యకర్తల రూపంలో అటు సాధారణ ప్రజలూ ఎండలో తిరగక తప్పని పరిస్థితి. అందుకే బాగా తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల వచ్చే సమస్యలూ, పిల్లల్లో ఎండదెబ్బకు అవకాశాలూ, ఎండ తీవ్రతకూ, వడదెబ్బకూ గురికాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కోసం ఈ కథనం. 

ఎండ తీవ్రత వల్ల చాలా రకాల సమస్యలొస్తుంటాయి. వాటిలో ఈ కింద పేర్కొన్నవి కొన్ని... 
హీట్‌ సింకోప్‌: ఎండలో ఎక్కువసేపు తిరుగుతూ ఉండటం వల్ల తల తిరిగినట్లు అనిపించడం, మరీ ఎక్కువ సేపు తిరిగితే సొమ్మసిల్లి పడిపోవడం జరగవచ్చు. ఎండలో ఎక్కువ సేపు ఉండటం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దాంతో మెదడుకు ఎంత రక్తం అందాలో అంతా అందకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో సొమ్మసిల్లడం జరుగుతుంది. ఈ పరిస్థితినే హీట్‌ సింకోప్‌ అంటారు. ఎంత ఆరోగ్యవంతులకైనా ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండటం అవసరం. అయితే కొన్ని జాగ్రత్తలతో రోగులు కోలుకుంటారు. 

చికిత్స: హీట్‌ సింకోప్‌కు గురైన వ్యక్తిని వెంటనే చల్లటి ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. అక్కడ మంచినీరు, తాజా పండ్లరసాలు, కొబ్బరినీళ్ల వంటి ద్రవాలను తాగించాలి. 

హీట్‌ క్రాంప్స్‌ / మజిల్‌ క్రాంప్స్‌: ఎండలో బాగా తిరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో రాత్రివేళల్లో లేదా అప్పటికప్పుడు కూడా పిక్కలు పట్టేసినట్లుగా ఉండి, తీవ్రమైన నొప్పికి గురికావడం జరుగుతుంది. ఎండలో ఆరుబయట ఆటలాడే పిల్లలకూ, రాత్రివేళల్లో పిక్క బలంగా పట్టేసి నిద్రాభంగమయ్యే పెద్దలకు ఇది అనుభవమే. దీనికి కారణం మన ఒంట్లో లవణాలూ, ద్రవాలు తగ్గడమే. శరీరం తన జీవక్రియలను కొనసాగించడానికి మెదడు నుంచి ప్రతి నరానికీ ఆదేశాలందాలి.

ఈ ఆదేశాలన్నీ లవణాలలోని విద్యుదావేశం కలిగిన  అయాన్ల రూపంలో నరాల ద్వారా ప్రసరించి, కండరాలకు ఆదేశాలిస్తాయి. ఎండవేడిమి తీవ్రతతో నీటిని తీవ్రంగా కోల్పోయి, దాంతోపాటూ లవణాలనూ కోల్పోవడం వల్ల నరాల ద్వారా మెదడునుంచి కండరాలకు ఆదేశాలు సరిగా అందవు. దాంతో నీరు కోల్పోయి డీ–హైడ్రేషన్‌కు గురి కాగానే... కండరాలు బిగుసుకు పోతాయి. వీటినే మజిల్‌క్రాంప్స్‌ అంటారు. 

జాగ్రత్తలు: మజిల్‌క్రాంప్స్‌కు గురైనప్పుడు శరీరం కోల్పోయిన నీటిని మళ్లీ వెంటనే భర్తీ చేయాలి. అందుకే గంటలకొద్దీ సాగే టెన్నిస్‌ వంటి ఆటలాడే సమయంలో ఆటగాళ్లు పొటాషియం లవణాలు ఉండే అరటిపండునూ, చక్కెరతోపాటు, ఇతర లవణాలు ఉండే నీళ్లను తరచూ కొద్దికొద్ది మోతాదుల్లో తాగుతూ ఉంటారు. 

చికిత్స: పిల్లలకు మజిల్‌క్రాంప్స్‌ వచ్చి వాళ్ల కండరాలు బిగదీసుకుపోతుంటే వారికి ‘ఓరల్‌–రీ–హైడ్రేషన్‌ (ఓఆర్‌ఎస్‌) ద్రావణాన్ని తాగించాలి. ఇప్పుడీ ఓఆర్‌ఎస్‌ పాకెట్లు అన్ని మెడికల్‌ దుకాణాలలోనూ ఓఆర్‌ఎస్‌ ద్రావణపు పౌడర్‌ మనకు ఇష్టమయ్యేలా ఎన్నో ఫ్లేవర్లలో దొరుకుతుంది. 

►ఓఆర్‌ఎస్‌ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు. 

►ఓఆర్‌ఎస్‌గానీ, కొబ్బరినీళ్లుగానీ అందుబాటులో లేకపోతే... ఒక అరటిపండు తిని, మంచినీళ్లు తాగాలి. పిల్లల విషయంలోనూ ఇదే జాగ్రత్త పనిచేస్తుంది. అరటిపండులో పొటాషియం వంటి  లవణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటిపండు, నీటితో అవి చాలావరకు భర్తీ అవుతాయి.

హీట్‌ ఎగ్జషన్‌: శరీరంలోని నీరు, ఖనిజలవణాలు కోల్పోవడం వల్ల కలిగే పరిస్థితి ఇది. బాగా తీవ్రమైన ఎండకు కొన్నాళ్లపాటు అదేపనిగా ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. నీరసం, నిస్సత్తువ, కండరాల్లో పట్టులేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఈ సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది. 

జాగ్రత్తలు / చికిత్స : ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిని చల్లటి ప్రదేశానికి తరలించి, అక్కడ తగినన్ని ద్రవాలు తాగించాలి. వెంటనే మళ్లీ ఎండకు వెళ్లకుండా చూడాలి. బయట తిరగాల్సిన అవసరం ఉంటే... బాగా చల్లబడ్డాకే వెళ్లనివ్వాలి. 

హీట్‌ హైపర్‌ పైరెక్సియా:  బయటి ఎండ కారణంగా రోగికి జ్వరం వచ్చేస్తుంది. దాంతో శరీర ఉష్ణోగ్రత గరిష్ఠంగా 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకూ పెరుగుతుంది. మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ తాత్కాలికంగా దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితినే హైపర్‌ పైరెక్సియా అంటారు. దీనికీ, వడదెబ్బకూ కాస్త తేడా ఉంది. ఈ కండిషన్‌లో మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ తాత్కాలికంగా దెబ్బతింటే... వడదెబ్బ (హీట్‌స్ట్రోక్‌)లో మాత్రం తక్షణం వైద్యసహాయం అందితే తప్ప మెదడులో ఉష్ణోగ్రత వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించలేం. 

హీట్‌ స్ట్రోక్‌ / వడదెబ్బ : ఈ హీట్‌స్ట్రోక్‌నే మనం సాధారణ పరిభాషలో వడదెబ్బగా చెబుతుంటాం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పూర్తిగా విఫలం కావడంతో వచ్చే ఈ కండిషన్‌ వల్ల ఒక దశలో శరీర ఉష్ణోగ్రత గరిష్ఠంగా 106 డిగ్రీల ఫారెన్‌హీట్‌ను కూడా దాటిపోవచ్చు. కళ్లు తిరగడం, వాంతులు కావడం, శరీరాన్ని ముట్టుకుని చూస్తే విపరీతమైన వేడి కనిపిస్తుంది. రోగి క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది చాలా తీవ్రమైన దశ. చివరికి చంకల్లో కూడా చెమట పట్టని పరిస్థితి వస్తుంది. దీన్ని వడదెబ్బకు సూచనగా గుర్తుంచుకోవాలి. ఇదే పరిస్థితి వస్తే... రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లడానికి (మార్బిడిటీకి) 40% అవకాశం ఉంటుంది. అప్పటికీ జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ ప్రాణాంతకం కూడా కావచ్చు. 

ఎందుకింత తీవ్రం : వడదెబ్బ ప్రాణాంతకంగా ఎందుకు పరిణమిస్తుందో చూద్దాం. మన పరిసరాల ఉష్ణోగ్రత బాగా ఎక్కువైనప్పటికీ లేదా బాగా తక్కువైనప్పటికీ మన శరీర ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగా 98.4 డిగ్రీల ఫారిన్‌హీట్‌ ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతల వద్దనే మన శరీరం నిర్వహించాల్సిన జీవక్రియలన్నీ (మెటబాలిక్‌ ఫంక్షన్స్‌) సక్రమంగా జరుగుతుంటాయి. మన ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారిన్‌హీట్‌ ఉండేందుకు మెదడులోని హైపోథెలామస్‌ తోడ్పడుతుంది. మన ఒంటి ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు దాని ఆదేశాల మేరకు స్వేదగ్రంథులు మనకు చెమట పట్టేలా చూస్తాయి. ఇలా చెమటలు పట్టినప్పుడు బయటి గాలి తగిలితే... ఆ స్వేదం ఇగిరిపోతుంటుంది. ఇలా ఇగిరిపోడానికి అది మన ఒంటి ఉష్ణోగ్రత (లేటెంట్‌ హీట్‌)ను తీసేసుకుంటుంది. దాంతో ఒంట్లోని ఉష్ణోగ్రత తగ్గుతుంది.

అయితే వాతావరణంలో వేడి మరీ ఎక్కువగా ఉండి, స్వేదగ్రంథులు అదేపనిగా నిరంతరం పనిచేయాల్సి వస్తే... అవి కూడా పూర్తిగా అలసిపోతాయి. ఇక దాంతో చెమటపట్టని పరిస్థితి. ఫలితంగా ఒంట్లోని ఉష్ణం బయటకు పోదు కాబట్టి... మన శరీర ఉష్ణోగ్రత అదేపనిగా, అనియంత్రితంగా పెరిగిపోతుంది. హైపోథెలామస్‌ కూడా దాన్ని తగ్గించలేని పరిస్థితి. మన దేహంలోని అన్ని వ్యవస్థలూ తమ జీవక్రియలను నిర్వహించేందుకు ఆదర్శ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్‌ అన్న విషయం తెలిసిందే. కానీ శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106... కొన్ని సందర్భాల్లో 110కి కూడా చేరి అది ఎంతకూ తగ్గకపోవడంతో, దేహంలోని అన్ని వ్యవస్థల పనితీరుకు (మెటబాలిక్‌ ఫంక్షన్స్‌) తీవ్రంగా దెబ్బ తగులడంతో అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోతాయి. దాంతో వృద్ధులు, బలహీనంగా ఉన్న కొందరిలో మరణం కూడా సంభవించే ఆస్కారం ఉంది. 

అది అపోహ మాత్రమే : కొంతమంది ఎండలో లేకుండా నీడ పట్టున ఉంటే వడదెబ్బ తగలదని అనుకుంటారు. అయితే ఎండలో ఉన్నా నీడలో ఉన్నా పరిసరాలు చాలా వేడిగా ఉన్నప్పుడు, వేడి చాలా అధికంగా ఉండే సముద్రప్రాంతాల్లో నేరుగా ఎండతగలని చోట ఉన్నప్పటికీ వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే వడదెబ్బనుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే... మనకు నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం మాత్రమే సరిపోదు. చల్లటి ప్రదేశంలో ఉండటం అవసరమని గుర్తించాలి. 

వడదెబ్బ లక్షణాలు : వికారం; వాంతులు; కళ్లు తిరగడం; నీరసం;

►స్పృహతప్పడం; ఫిట్స్‌ రావడం;

►చివరగా కోమాలోకి వెళ్లడం జరగవచ్చు. 

వడదెబ్బకు చికిత్స  
ఒంటి ఉష్ణోగ్రత 100 ఫారెన్‌హీట్‌ డిగ్రీలకు మించుతున్నట్లు తెలియగానే పెద్దలనైనా,  పిల్లలనైనా వెంటనే చల్లటి గాలి సోకేలా ఫ్యాన్‌ కింద ఉంచాలి. (ఫ్యాన్‌ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదు). దుస్తులను వదులుగా చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఒకవేళ బట్టలు ఇబ్బందికరంగా ఉంటే నడుముకు చిన్న ఆచ్ఛాదన ఉంచి, మిగతా బట్టలన్నీ తీసేయాలి. ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లలకు చంకల కింద / గజ్జల వద్ద ఐస్‌ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత
తగ్గకపోతే, దాన్ని మెడికల్‌ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి. 

పిల్లలకూ, వృద్ధులకూ వడదెబ్బ ప్రభావం మరింత ఎక్కువ: పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట పట్టడం తక్కువ. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధుల్లోనూ చెమట గ్రంథుల పనితీరు తగ్గుతుంది. దాంతో పిల్లలూ, వృద్ధులు తేలిగ్గా వడదెబ్బ ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉంది. పిల్లలకు పెద్దగా చెమట పట్టకపోవడం వల్ల వారు పెద్దగా ద్రవాలను కోల్పోవడం లేదనీ, వారు సురక్షితంగానే ఉన్నారని అపోహ పడుతుంటారు. కానీ తమకు విపరీతంగా చెమటలు పడుతున్నందున పిల్లల కంటే తామే ఎక్కువగా ద్రవాలను కోల్పోతున్నామని అనుకుంటారు. కానీ ఈ అభిప్రాయాలు వాస్తవం కాదు. పిల్లలతో పోలిస్తే పెద్దల్లో చెమట గ్రంథులు ఎక్కువ.

కాబట్టి ఉష్ణోగ్రతలు కాస్తంత ఎక్కువగా  పెరగగానే పెద్దల్లో చెమటలు పట్టే ప్రక్రియ వెంటనే మొదలవుతుంది. కానీ పిల్లల్లో అలా కాదు. వాళ్లలో పెద్దల తరహాలోనే చెమటలు పట్టాలంటే పెద్దలకంటే ఉష్ణోగ్రత చాలా చాలా రెట్లు పెరగాలి. కానీ అమితంగా పెరిగినప్పుడు పిల్లల ఒంటిని చల్లబరిచే మెకానిజం అయిన చెమట పట్టడం తక్కువ కావడంతో పిల్లల ఒంటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అందుకే పిల్లల్లో పెద్దగా చెమటలు పట్టకపోయినా... వాళ్ల ఒంటి ఉష్ణోగ్రత తేలిగ్గా పెరుగుతుందని పెద్దలు గ్రహించాలి. పైగా ఒంటిని చల్లబరిచేందుకు ఉద్దేశించిన స్వేద గ్రంథుల సంఖ్య వాళ్లలో తక్కువ కాబట్టి ఒళ్లు వెంటనే ఒక పట్టాన చల్లబడదని గ్రహించాలి. అందుకే ఈ వేసవి సీజన్‌లో వారిని ఎప్పుడూ చల్లగా ఉండే ప్రదేశాల్లోనే ఆడుకొమ్మని చెప్పాలి. ఒకవేళ ఆరుబయట ఆడుకోడానికి వెళ్తుంటే సాయంత్రం 5 తర్వాతే వారిని బయటకు అనుమతించాలి. 

 ఒబేస్‌ పిల్లల విషయంలో మరింత జాగ్రత్త..
మామూలు పిల్లలతో పోలిస్తే కాస్త ఒళ్లు చేసి ఉన్న పిల్లలూ, ఒబేసిటీతో బాధపడే పిల్లలూ వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బాగా ఒళ్లు చేసి ఉన్న పిల్లలు ఆటలాడుతున్నప్పుడు వాళ్లకు చెమట పట్టడం, బరువు తగ్గడం జరుగుతుంది. అలా తమ పిల్లలు బరువు తగ్గారు కదా అంటూ పెద్దలు ఆనందించడం మామూలే. కానీ ఇలా స్థూలకాయంతో ఉన్న పిల్లలు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గితే అది ఆనందించాల్సిన విషయం కాదు. ఆ పిల్లలు ఆటలాడటం వల్ల తమ ఒంట్లోంచి నీళ్లు కోల్పోవడంతో పాటు, ఆ నీటితో పాటు విలువైన ఖనిజలవణాలనూ కోల్పోయారని గ్రహించాలి. ఇలా స్థూలకాయం కలిగి ఉన్న పిల్లలు బాగా ఆటలాడితే ప్రతి కిలో బరువుకు 500 మిల్లీలీటర్ల మేరకు ద్రవాలను కోల్పోవచ్చు.

ఆ మేరకు బరువూ తగ్గుతారు. దాంతో తమ పిల్లలు బరువు కోల్పోయి ఆరోగ్యంగా మారుతున్నారంటూ పెద్దలు అపోహ పడవచ్చు. కానీ అలా సరికాదు. వాళ్లు విలువైన ఖనిజలవణాలు కోల్పోయి డీ–హైడ్రేషన్‌కు గురవుతున్నారనే విషయాన్నే గ్రహించాలి. అందుకే ఇలా బరువు తగ్గుతున్నప్పుడు పెద్దలు వారి ఒంటిలో జరిగే జీవక్రియలకు (మెటబాలిక్‌ ఆక్టివిటీస్‌కు) అవసరమైన నీటిని భర్తీ చేస్తూ ఉండాలి. అందుకే స్థూలకాయులైన పిల్లలు వెంటవెంటనే మరింత బరుతు తగ్గుతున్నట్లు గ్రహిస్తే పెద్దలు వారి ఒంట్లోకి తగిన ఎలక్ట్రోలైట్స్‌ పంపించేందుకు కొబ్బరినీళ్లు, గ్లూకోజ్‌ వంటివి ప్రతి 20 నిమిషాలకొకసారి తప్పనిసరిగా తాగిస్తూ ఉండాలి. 

ఎండ దుష్ప్రభావాల నివారణ ఇలా... 
►ఎండవేళల్లో పెద్దలూ, పిల్లలూ ఎండకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పిల్లలను ఇంట్లోని చల్లటి జాగాల్లో ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఎండవేళల్లో పిల్లలను కేవలం ఇన్‌డోర్‌ గేమ్స్‌కు మాత్రమే పరిమితం చేయాలి. 

►పెద్దలూ, పిల్లలూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండాలి. మరీ ఎక్కువ పని ఉంటే తప్ప ఉదయం పది తర్వాత పెద్దలు బయటకు ఎండవేడికి వెళ్లకూడదు. 

►మనం నేరుగా ఎండ∙తగలకుండా నీడలోనే ఉన్నా లేదా గదిలోనే ఉన్నా ఒకవేళ ఆ గది ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్నప్పటికీ వడదెబ్బ తగలవచ్చు. కాబట్టి నేరుగా ఎండకు వెళ్లకపోవడమే కాదు... మనం ఉన్నచోట చల్లగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. చల్లగా ఉండే ప్రదేశాల్లోనే ఉండండి.  

►ఆరుబయటకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తప్పక గొడుగు తీసుకెళ్లండి. లేదా అంచు వెడల్పుగా ఉండే బ్రిమ్‌ క్యాప్‌ వాడాలి. 

►బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా వాటర్‌బాటిల్‌ను దగ్గర ఉంచుకోండి. డ్రైవింగ్‌ చేసేవారు ఎప్పుడూ తప్పనిసరిగా తమతో వాటర్‌ బాటిల్‌ ఉంచుకోవాల్సిందే. 

►మనం వేసవిలో తరచూ నీరు తాగుతూ ఉండాలి. ముఖ్యంగా ఆటల్లో నిమగ్నమైపోయే పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే వారికి తరచూ మంచినీళ్లు తాగిస్తూ ఉండాలి. ఈ వేసవిలో కొబ్బరినీళ్లు, తాజా పండ్లరసాలు తీసుకుంటూ ఉండటం మంచిది. కూల్‌డ్రింక్స్‌ వద్దు. కార్బొనేటెడ్‌ డ్రింక్స్, శీతల పానీయాల వల్ల మరింత డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. దాంతో ఒంట్లోని లవణాలను మరింత వేగంగా కోల్పోతామని గుర్తుపెట్టుకోండి. 

మరిన్ని వార్తలు