వినోదాల దసరా...

5 Oct, 2019 05:59 IST|Sakshi

అలనాడు

దసరా అంటేనే సరదాల పండగ. గంగిరెద్దుల మేళం, బొమ్మల కొలువు, దసరా వేషాలు... అంతా దసరా హడావుడే. ఊళ్లన్నీ కొత్త కొత్త ఆచారాలతో సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా చెప్పుకోవలసినవి దసరావేషాలు. వీటినే పగటివేషాలు లేదా పైటే వేషాలు అంటారు. వీటి ముఖ్య ఉద్దేశం ప్రజావినోదం. ఆయా ప్రాంతాల ప్రజల ఆశలు, ఆశయాలకు ప్రతిబింబంగా ఇవి మనదేశంలో బహుళ ప్రచారం పొందాయి. పగటì పూట మాత్రమే ప్రదర్శించే వేషాలు కావడం వల్ల వీటికి పగటివేషాలనే పేరు వచ్చింది. ప్రేక్షకులను నమ్మించడం ఈ వేషాల గొప్పదనం. అంతేకాక  ప్రజల సమస్యలను నాటి పరిపాలకుల దృష్టికి తీసుకురావడం, వర్తమానాలను చేరవేయడం కోసం ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోకి వచ్చాయని ప్రతీతి. ఇందులో  పౌరాణికమైనవి, కల్పిత వేషాలు, హాస్య పాత్రలు ఉంటాయి. మొట్టమొదట్లో ఈ కళ భిక్షుక వృత్తిగా ప్రారంభమై తరవాత సంక్లిష్ట రూపంగా మారింది.

శాతవాహనుల కాలం నుంచే ఈ కళారూపం ఉందని హాలుని గాథాసప్తశతి ద్వారా తెలుస్తోంది. మారువేషాలు ధరించి గూఢచారులుగా వీరు సమాచారాన్ని అందించేవారని, కాకతీయుల యుగంలో యుగంధరుడు పిచ్చివానిగా నటించి ఢిల్లీ సుల్తానులను జయించాడని చరిత్ర చెబుతోంది. వీటికి ఆదరణ తగ్గడంతో చాలా కళలు భిక్షుక వృత్తిగా మారిపోయాయి.పగటివేషాలు వేసేవారు ముఖ్యంగా దసరా పండుగ సమయంలోనే వేషాలు వేయడం వలన ఇవి దసరా వేషాలుగా ప్రసిద్ధికెక్కాయి. వీరు సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తూంటారు. వీళ్లనే బహురూపులు అని కూడా అంటారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలరోజుల పాటు ప్రదర్శనలు ఇస్తారు. ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ధ వహిస్తారు. చివరిరోజున సంభావనలు తీసుకుని అందరూ పంచుకుంటారు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్ధనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఒకే వ్యక్తి స్త్రీ, పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం ఈ వేషం ప్రత్యేకత. ముఖ మధ్య భాగంలో తెర కట్టుకుని ఒక వైపు శివుడుగా మరోవైపు పార్వతిగా అలంకరించుకుంటారు. తెరమార్చుకోవడంలోనే వీరి నైపుణ్యం ఉంటుంది.

ఇదేకాక దసరా పోలీసులు, పిట్టలు దొరలు కూడా ప్రత్యేకంగా వస్తారు. వారు తడబాటు లేకుండా నిరాఘాటంగా పదేసి నిముషాలు చెప్పే కబుర్లు నవ్వు తెప్పిస్తాయి. ఒకప్పుడు దాదాపుగా 64 రకాల వేషాలు వేస్తే, ఇప్పుడు 32 వేషాలు మాత్రమే వేస్తున్నారు. ఆదిబైరాగి, చాత్తాద వైష్ణవం, కొమ్ముదాసరి, హరిదాసు, ఫకీరు, సాహెబు, బుడబుక్కలవాడు, సోమయాజులు – సోమిదేవమ్మ, వీరబాహు, గొల్లబోయిడు, కోయవాడు, దేవరశెట్టి, ఎరుకలసోది, జంగం దేవర, గంగిరెద్దులు, పాములవాడు, పిట్టలదొర, చిట్టిపంతులు, కాశీ కావిళ్లు... వంటి ఎన్నో వేషాలు వేస్తున్నారు. వీటిలో కొన్నింటికి సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే, మరి కొన్నింటిలో... పద్యాలకు, అడుగులకు, వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. బుడబుక్కలవాడు, ఎరుకలసాని వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది.  
– డా. వైజయంతి

మరిన్ని వార్తలు