'నవ'వేద్యాలు

30 Sep, 2016 23:17 IST|Sakshi
'నవ'వేద్యాలు

పండుగ అంటే ప్రతివారికీ ఆనందం.
కానీ విజయదశమి విషయమే వేరు.
మిగతా పండుగల్లో వేడుకలు ఒకటి రెండు రోజులే.
దసరాకు... తొమ్మిది రోజుల పాటు
సరదాలు, సంబరాలు, సంభ్రమాలు.
రుచులు ఆరు మాత్రమే అనే బెంగ వద్దు.
ఈ నవరాత్రులూ అమ్మవారి నైవేద్యానికి
‘ఫ్యామిలీ’ అందిస్తున్న నవవిధ ప్రసాదాలివి!

 
 
1. చక్కెర పొంగలి
కావలసినవి: బియ్యం -   కప్పు
పాలు - 2 కప్పులు; పంచదార - 4 కప్పులు
నీళ్లు - 3 కప్పులు; పెసర పప్పు - అర కప్పు
పచ్చి కొబ్బరి ముక్కులు - కప్పు; కిస్‌మిస్ - 15
జీడిపప్పులు - పది; నెయ్యి - అర కప్పు

తయారి:  బియ్యం, పెసర పప్పులను విడివిడిగా నూనె లేకుండా బాణలిలో వేయించి తీసి పక్కన ఉంచాలి.
* ఒక గిన్నెలో మూడు గ్లాసుల నీళ్లు, రెండు గ్లాసుల పాలు పోసి కాగాక వేయించి ఉంచుకున్న బియ్యం, పెసరపప్పు వేసి బాగా కలిపి ఉడికించాలి.
* పూర్తిగా ఉడికిన తరవాత పంచదార వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉంచాలి.
* బాణలిలో నెయ్యి వేసి కాగాక జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు విడివిడిగా వేసి దోరగా వేయించి ఉడికిన చక్కెరపొంగలిలో వేసి కలిపి దించేయాలి.
* నెయ్యి ఎంత ఎక్కువ వాడితే అంత రుచిగా ఉంటుంది.
 
2. కట్టె పొంగలి
కావలసినవి: బియ్యం - కప్పు; పెసరపప్పు - కప్పు
 జీలకర్ర - టీ స్పూను; మిరియాల పొడి - టీ స్పూను
 కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత
 నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు - గుప్పెడు
 
తయారి:
* ముందుగా ఒక గిన్నెలో బియ్యం, పెసరపప్పు వేసి నీళ్లతో బాగా కడిగి నీరు ఒంపేయాలి.
* ఆరు కప్పుల నీరు జత చేసి, కుకర్‌లో ఉంచి, నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి.
* బాణలిలో నెయ్యి వేసి కరిగాక ముందుగా జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
* మిరియాల పొడి వేసి వేగుతుండగానే, జీడిపప్పు వేసి బాగా వేయించాలి.
* కరివేపాకు వేసి వేయించి వెంటనే దించేయాలి.
* ఉడికించుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మెదపాలి.
* నేతిలో వేయించి ఉంచుకున్న పదార్థాలను వేసి బాగా కలిపి వేడివేడిగా వడ్డించాలి.
 
3. పులిహోర...
కావలసినవి: బియ్యం - 4 కప్పులు
చింతపండు - 100 గ్రా.; పచ్చి సెనగపప్పు-టేబుల్ స్పూను
 మినప్పప్పు - టేబుల్ స్పూను
 ఆవాలు - 2 టీ స్పూన్లు; జీలకర్ర - 2 టీస్పూన్లు
 ఎండుమిర్చి - 15; పచ్చి మిర్చి - 10; కరివేపాకు - 4 రెమ్మలు
 పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించినవి)
 నువ్వుల పొడి - 2 టేబుల్ స్పూన్లు (నువ్వులు వేయించి పొడికొట్టాలి)
 జీడిపప్పులు - 15; నూనె - 100 గ్రా.; ఇంగువ - టీ స్పూను
 పసుపు - టీ స్పూను; ఉప్పు - తగినంత
 
తయారి:  ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి, నీరు ఒంపేసి, 7 కప్పుల నీరు జత చేసి బియ్యం ఉడికించాలి.
* ఉడికిన అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక పెద్ద పళ్లెంలోకి తిరగబోసి, గరిటెతో పొడిపొడిగా అయ్యేలా కలపాలి.
* ఒక గిన్నెలో చింతపండులో తగినంత నీరు పోసి నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచుకోవాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి దోరగా వేయించాలి.  చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి, ఉడికించి దించేయాలి.
* అన్నంలో చింతపండురసం, పోపు వేసి బాగా కలపాలి.
* నువ్వులపొడి, పల్లీలు, జీడిపప్పులు వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఊరిన తరవాత తింటే ప్రసాదాన్ని రుచిగా ఆస్వాదించవచ్చు.
4. రవ్వకేసరి
కావలసినవి:
 బొంబాయి రవ్వ - కప్పు
 (నూనె లేకుండా దోరగా వేయించాలి)
 పంచదార - 2 కప్పులు
 నీళ్లు - 3 కప్పులు
 నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
 జీడిపప్పు - 10
 కిస్‌మిస్ - గుప్పెడు
 ఏలకుల పొడి - టీ స్పూను
 తయారి:
* ఒక పాత్రలో రవ్వ, పంచదార వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి.
* పెద్ద బాణలిలో నీళ్లు పోసి మరిగాక, రవ్వ పంచదార మిశ్రమం వేసి ఉండకట్టకుండా కలుపుతుండాలి.
* ఉడుకుతుండగా మధ్యమధ్యలో నెయ్యి వేస్తుండాలి.
* ఏలకుల పొడి వేసి కలపాలి.
* బాగా ఉడికిన తర్వాత దింపేయాలి.
* ఒక బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్‌మిస్ వేసి వేయించి తీసేయాలి.
* రవ్వ కేసరిలో వేసి కలపాలి.
* రవ్వకేసరి చేశామంటే పండుగ ఇంటికి వ చ్చేసినట్లే.
* పండుగ అంటే నోరు తీపి చేసుకోవడమే.
* అందునా అమ్మవారి వాహనమైన కేసరి ఈ మధుర  పదార్థంలోనే ఉంది సుమా.
 
5. అల్లం గారెలు
కావలసినవి: మినప్పప్పు - పావు కేజీ
 అల్లం ముక్కలు - 2 టీ స్పూన్లు
 జీలకర్ర - టీ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట
 నూనె - డీప్ ఫ్రైకి తగినంత; ఉప్పు - తగినంత
 
తయారి:
* మినప్పప్పును నాలుగు గంటలు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, గ్రైండర్‌లో వేసి  గారెల పిండి అనువుగా గట్టిగా పిండి పట్టాలి.
* ఉప్పు, అల్లం ముక్కలు, ఉల్లి తరుగు, జీలకర్ర, కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలపాలి.
* స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పిండిని చేతిలోకి తీసుకుని గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేగాక తీసేయాలి.
 
6. దద్ధ్యోదనం
కావలసినవి
బియ్యం - రెండు కప్పులు
అల్లం - చిన్న ముక్క; పచ్చి మిర్చి - 10
ఎండు మిర్చి - 5; సెనగ పప్పు - టీ స్పూను
ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర - చిన్న కట్ట
దానిమ్మ గింజలు - టేబుల్ స్పూను
చిన్న ద్రాక్ష లేదా కిస్‌మిస్ ద్రాక్ష - కప్పు
జీడి పప్పులు - 10; నెయ్యి - టేబుల్ స్పూను
 
తయారి
* ముందుగా బియ్యం కడిగి నీళ్లు ఒంపేసి,  ఐదు కప్పుల నీరు జత చేసి ఉడికించాలి.
* అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా దంచి పక్కన ఉంచాలి.
* బాణలిలో నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
* ఒక పెద్దపాత్రలో అన్నం వేసి, అందులో వేయించిన పోపు సామాను వేసి బాగా కలపాలి.
* తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలపాలి.
* చివరగా దానిమ్మ గింజలు, దానిమ్మ గింజలు చిన్న ద్రాక్ష లేదా కిస్‌మిస్ ద్రాక్ష, చెర్రీ ముక్కలు, టూటీ ఫ్రూటీ ముక్కలు, జీడి పప్పులు వేసి బాగా కలపాలి.
 
7. కదంబం
కావలసినవి: బాస్మతి బియ్యం - రెండు కప్పులు
 క్యారట్, బీన్స్, పచ్చి బఠాణీ, క్యాప్సికమ్, ఉల్లికాడలు, ఉల్లిపాయలు, బంగాళదుంప, మెంతి కూర, పుదీనా - అన్నీ కలిపి ఒక కప్పు; పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను; ఏలకులు - 2
 లవంగాలు - 2; దాల్చినచెక్క - చిన్న ముక్క
 కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - చిన్న కట్ట
 ఉప్పు - తగినంత; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
 జీడిపప్పు - గుప్పెడు; కిస్‌మిస్ - టేబుల్ స్పూను
 దానిమ్మ గింజలు - టేబుల్ స్పూను
 
తయారి:     ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉడికించి పక్కన ఉంచాలి.
* బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క వరుసగా వేసి కొద్దిగా వేయించాలి.
* తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసేయాలి.
* ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి విడివిడిలాడేలా చేయాలి.
* కూర ముక్కలు, ఉప్పు వేసి కలపాలి.
* జీడిపప్పు, కిస్‌మిస్, దానిమ్మ గింజలు జత చేసి బాగా కలపాలి.
* కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి.
 
8. బెల్లమన్నం
కావలసినవి:
 బియ్యం - కప్పు
 బెల్లం తరుగు - కప్పున్నర
 నెయ్యి - టేబుల్ స్పూను
 కొబ్బరి ముక్కలు - అర కప్పు
 (నేతిలో వేయించాలి)
 పచ్చ కర్పూరం - టీ స్పూను
 ఏలకుల పొడి - అర టీస్పూను
 
తయారి:     ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి రెండున్నర కప్పుల నీరు జత చేసి ఉడికించాలి.
* అన్నం పూర్తిగా ఉడికిన తరువాత బెల్లం తరుగు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి.
* ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.
* నెయ్యి, వేయించిన కొబ్బరి ముక్కలు, పచ్చ కర్పూరం వేసి బాగా కలిపి దించేయాలి.
 
9. పరమాన్నం
కావలసినవి:
 బియ్యం - కప్పు
 పంచదార - 4 కప్పులు
 పాలు - 2 కప్పులు
 నెయ్యి - టేబుల్ స్పూను
 జీడిపప్పు - 10
 కిస్‌మిస్ - గుప్పెడు
 కొబ్బరి తురుము - పావు కప్పు
 ఏలకుల పొడి - అర టీస్పూను
 
తయారి:  బియ్యం శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి.  పాలు స్టౌ మీద పెట్టి, మరుగుతుండగా అందులో బియ్యం పోసి బాగా క లపాలి.  బాగా ఉడికిన తరువాత పంచదార వేసి కలిపి కొద్దిసేపు స్టౌ మీదే ఉంచాలి.     బాణలిలో నెయ్యి వేసి కాగాక జీడిపప్పు, కిస్‌మిస్ వేసి వేయించి తీసేయాలి.  ఉడుకుతున్న పరమాన్నంలో పచ్చి కొబ్బరి తురుము, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి బాగా కలపాలి.
  ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించేయాలి.

మరిన్ని వార్తలు