విన్నవించుకోనా... చిన్న కోరికా...

2 Oct, 2016 23:45 IST|Sakshi
విన్నవించుకోనా... చిన్న కోరికా...

దసరా సరదా
అదిగదిగో ఆ ఇంట్లోకి ఒక్కసారి తొంగిచూడండి. ఏం కనిపిస్తోంది. పెళ్లిచూపుల తంతు కదూ. ఎంత ఆర్భాటంగా, ఉత్సాహంగా జరుగుతోందో చూశారా. ఎంతమందికి పెళ్ళిళ్లు అయ్యి, సంసారాలు సజావుగా నడుస్తున్నా, ఎప్పటికప్పుడు పెళ్లిచూపుల తంతు కొత్తేగా. అది సరే. అక్కడ చూడండి... అమ్మాయి గురించి అబ్బాయివారు అబ్బాయి గురించి అమ్మాయివారు అన్నీ ఎంత ముచ్చటగా మాట్లాడుకుంటున్నారో.  ఇక్కడ విశేషం చూశారా. వారి మధ్యన మాటలన్నీ ఎంత ప్రశాంతంగా నడిచిపోతున్నాయో. ఇరుపక్షాలకు ఏ ఇబ్బందీ లేకుండా ఎంత హాయిగా ఉందో.

నిజమే... పెళ్లిచూపులు ఇలా జరిగిపోతే ఎంతబాగుంటుందో కదండీ. అయ్యో ఇదేంటి. ఇంతలోనే అమ్మాయి తల్లి లేచి తనకేదో కోరిక ఉందని... ‘విన్నవించుకోనా చిన్నకోరికా’ అంటూ గొంతు సవరిస్తోంది. పదండి చూద్దాం, ఆవిడగారి ఆ కోరికేమిటో మనమూ తెలుసుకుందాం.
 
అన్నయ్యగారూ మాదొక చిన్న షరతండీ... అంటూ కొంచెం దర్పంగా పలికింది అమ్మాయి తల్లి.
షరతా! చెప్పండి! చెప్పండి! అంటూ హడావుడి పడ్డాడు అబ్బాయి తండ్రి.
షరతేమిటి వదినగారూ! అంటూ అబ్బాయి తల్లి ఇంత సాగ దీసింది.
 ఏమీలేదండీ! మీరంత హడావుడి పడకండి, మాదేమీ గొంతెమ్మ కోరిక కాదు, మీరలా భయపడిపోవడానికి.
 మేమూ అబ్బాయిని కన్న తల్లిదండ్రులమే... అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది అమ్మాయి తల్లి..
 ఏమోనమ్మా! అబ్బాయి పెళ్లి జరగడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, అన్నీ కుదిరాయి, మా అబ్బాయి పెళ్లి అవుతుందిలే అని నేను సంబరపడుతుంటే, మీరిలా కండిషన్ పెడుతున్నానంటే నాకు భయంగా ఉండదా మరి... అంది పెళ్లికొడుకు తల్లి.
 
అంత భయపెట్టేవాళ్లల్లా ఉన్నామా. మేమూ అబ్బాయి పెళ్లి చేసినవాళ్లమేనండీ. మా అబ్బాయి పెళ్లిలో మా వియ్యాలవారు మమ్మల్ని ఏది అడిగారో, మేమూ మిమ్మల్ని అదే అడగ బోతున్నాం.
 కొంపదీసి అత్తగారి లాంఛనాలు, బావమరిది కట్నాలు, మరదలి వేడుకలు ఏమైనా తీర్చాలా ఏంటి వదినగారూ!
 కట్నాలు, లాంఛనాలు ఇచ్చిపుచ్చుకోవడాలు లేదని మనం ముందే అనుకున్నాం కదా. పెళ్లి అంటే రెండు కుటుంబాలు కలిసిపోయి, జీవితాంతం హాయిగా సంతోషంగా విందువినోదాలతో గడపాలనేది మా లక్ష్యం.
 నిజమే. మీ మాటతో పూర్తిగా ఏకీభవిస్తాను. అందులో సందేహమే లేదు.
 
ఈ మధ్యన పెళ్లి అంటే వ్యాపారంగా మారిపోయింది కదండీ. అందుకని అడిగాను.
 మనం అలాంటి వ్యాపారాల విషయాలు మాట్లాడుకోవద్దు.
 మాటల్లో పెట్టేసి, అసలు విషయం దాటేస్తున్నారు...
 దాటేయడం ఎందుకండీ! మీరేమైనా ఊహిస్తారేమోనని ఎదురుచూస్తున్నాను....
 ఏమో మీరేం అనుకుంటున్నారో నేను ఎలా ఊహించగలను.
 ఊహించండి. కాసేపు సరదాగా మాట్లాడుకుందాం.
 సరదాగా అంటే గుర్తు వచ్చిందండోయ్. సరదా పదంలోనే దసరా ఉంది కదా. దసరా పండుగ రాబోతోంది కదా.
 ఆ ఇప్పటికి దారిలోకి వచ్చారు.
 
అంటే...
 మన పిల్లల పెళ్లి అయ్యాక వచ్చే మొదటి పండుగ దసరానే కదా.
 అవును. ఇందులో కొత్తేమీ లేదుగా. అమ్మాయి తరఫువారు అబ్బాయి తరఫువారిని పండుగకు ఆహ్వానించి వారందరికీ కొత్తబట్టలు పెట్టడం ఆనవాయితీనేగా. అసలు దసరా అంటేనే అల్లుళ్ల పండుగ కదా. ఇందులో విశేషం ఏంటో అర్థం కావట్లేదు.
 అదేమరి... ఈ సారి మార్పు చేద్దాం.
 ఏమిటో...?
 
ఏమీ లేదు. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా అందరూ చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతున్నారు.
 అయితే ఏంటంటారు?
 ఈ దసరా పండుగకి కొత్త కోడలిని, వారి తర ఫువారిని ఆహ్వానించి స్వయంగా మీరే ఆదరించాలి. ఇది అల్లుళ్ల పండుగ మాత్రమే కాదు, కోడళ ్లపండుగ కూడా ‘నవ దసరా’కి నాంది పలకాలి. ఇదే మా షరతు... హాయిగా నవ్వుతూ పలికింది అమ్మాయి తల్లి.
 ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా అబ్బాయి తల్లి అంగీకరించింది.
 
‘నిజమే కదా, నా పెళ్లయిన కొత్తలో నేను ఇలాగే అనుకున్నాను కదా, ఎప్పుడూ అల్లుళ్లని పిలవడమే కాని, కోడళ్లను పిలవరా అని, నా మనసులోని మాట తెలుసుకున్నట్లు వియ్యపురాలు ఈ షరతు పెట్టడం బావుంది’ అని మనసులో అనుకుంటూనే...
 తప్పకుండా వదినగారూ, అంతకంటేనా, మా ఇంట్లో అడుగు పెట్టేవరకే కోడలు, ఆ తరవాత మా అమ్మాయేగా! అలా కూడా మేం అల్లుడిని సత్కరించుకున్నట్లేగా... అంటూ హాయిగా నవ్వేసింది.
 దసరా పండుగ ఎంత సరదాగా గడపాలా అని కబుర్లు చెప్పుకుంటూ తాంబూలాలు పుచ్చుకున్నారు.
- డా. పురాణపండ వైజయంతి

మరిన్ని వార్తలు