ప్రకృతితో దోస్తీ.. మంచిదే!

11 Jul, 2018 01:11 IST|Sakshi

ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆరోగ్యానికి మంచిదని చాలాకాలంగా తెలుసు. ఈ విషయాన్ని ఈస్ట్‌ ఆంగ్లియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించారు. పచ్చటి చెట్ల మధ్య ఎక్కువ కాలం గడపడం గుండెజబ్బులతోపాటు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను అడ్డుకోగలదని, ఒత్తిడిని దూరం చేయగలదని తాము దాదాపు 29 కోట్ల మంది వివరాలను విశ్లేషించడం ద్వారా తెలుసుకున్నామని ఈస్ట్‌ ఆంగ్లియా యూనివర్శిటీ శాస్త్రవేత్త కామీ ట్వోహిగ్‌ బెన్నెట్‌ తెలిపారు. ఇప్పటికే జరిగిన దాదాపు 140 అధ్యయనాలను మరోసారి సమీక్షించడం ద్వారా తమకు ఈ విషయం అర్థమైందని చెప్పారు.

సహజసిద్ధమైన లేదా పార్కుల్లాంటి మానవ నిర్మిత పచ్చటి ప్రాంతాలు రెండింటి ద్వారా మన ఆరోగ్యానికి అందే లాభం ఒకేలా ఉందని వీరు తేల్చి చెప్పారు. చెట్లు, పచ్చదనం అందుబాటులో లేనివారి ఆరోగ్యాన్ని ఇతరులతో పోల్చి చూసినప్పుడు ఎంతో తేడా కనిపించిందని బెన్నెట్‌ అన్నారు. ప్రకృతికి దగ్గరగా ఉన్న వారి రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, ఒత్తిడి కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తెలిసిందని వివరించారు. పచ్చదనానికి దగ్గరగా ఉన్న వారి ఎంగిలిలో ఒత్తిడిని సూచించే కార్టిసాల్‌ రసాయనం తక్కువగా ఉందని తెలిపారు.  

మరిన్ని వార్తలు