సైరంధ్రి

6 May, 2019 00:46 IST|Sakshi

సాహిత్య మరమరాలు

అవి విశ్వనాథ బందరు హైస్కూల్లో ఫిఫ్త్‌ ఫారం (10వ తరగతి) చదువుతున్న రోజులు. వారికి తెలుగు పండితులు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి. ఒకరోజు జిల్లా విద్యాధికారి పాఠశాల తనిఖీ నిమిత్తం వచ్చారు. తిక్కన భారతంలోని కీచకవధ ఘట్టం సాగుతోంది. ద్రౌపదీదేవి సైరంధ్రిగా ఉందని చెబుతుండగానే, సైరంధ్రికి వ్యుత్పత్తి ఏమిటని ప్రశ్నించారు విద్యాధికారి. విశ్వనాథ సహా విద్యార్థులంతా తెలీదన్నారు. అప్పుడు చెళ్లపిళ్లనే అడిగాడు విద్యాధికారి. ‘‘ఇతఃపూర్వం నేను పరిశీలించలేదు. ఇప్పుడు తెలియదు. ఇకముందు చూచే ఉద్దేశ్యం కూడా లేదు’’ అంటూ కటువుగా జవాబిచ్చారు. అందుకా విద్యాధికారి ‘‘నాకూ తెలీకే అడుగుతున్నా’’ అన్నారు. ‘‘తెలీకపోతే తూర్పుతిరిగి దణ్ణంపెట్టు’’ అని పెంకిగా జవాబిచ్చారు చెళ్లపిళ్ల. ఆ అధికారి బిక్కచచ్చి క్లాసులోంచి వెళ్లిపోయారు.

ఆయనటు వెళ్లగానే, ‘‘స్వైరంధ్రియతి ఇతి సైరంధ్రీ – అనగా తనకు ఇష్టం వచ్చినట్లు ఉండగల స్త్రీ అని అర్థం’’ అంటూ చెప్పి, ‘‘ఇప్పుడు వచ్చిన ఈ అధికారి వున్నాడే– మన డ్రాయింగ్‌ మాస్టరును తీసివేయమని వ్రాశాడట. పాపం అతనికి ఆరుగురు సంతానం. పేదవాడు. ఈ ఉద్యోగమూ లేకుంటే ఎలా బ్రతుకుతాడు? అందుకే నాకు కోపం వచ్చింది. డ్రాయింగ్‌ మాస్టర్ని తీసివేయవలసివస్తే మా ఇద్దర్నీ తీసివేయమని చెప్పాను. నన్ను వదులుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆ డ్రాయింగ్‌ మాస్టర్నీ తీసివేయలేకపోయారు. ఒకరి పొట్టగొడితే నీకేమొస్తుందయ్యా! అన్నా వినడే! అందుకే అలా ప్రవర్తించవలసి వచ్చింది’’ అంటూ వివరించారు చెళ్లపిళ్ల.

-డి.వి.ఎం.సత్యనారాయణ 

మరిన్ని వార్తలు