ఈగ

18 May, 2018 00:27 IST|Sakshi

చెట్టు నీడ 

ఖురాసాన్‌ రాజు వేటనుంచి తీవ్ర అలసటతో తిరిగి రాజభవనానికి చేరుకుని తన రాజదర్బారులో విశ్రాంతి తీసుకునేందుకు కునుకు తీశాడు. అంతలోనే ఒక ఈగ తన ముక్కుపై వాలింది. అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. కోపంతో ఈగను అల్లించాడు. తేరుకొని ముంచుకొస్తున్న నిద్రతో కళ్లు మూతలుపడుతుండగా ఆ ఈగ మళ్లీ అతని ముక్కుపై వాలింది. రాజు గారికి ఈగ మీద చిర్రెత్తుకొచ్చింది. ఈగను నరికి పోగులేయాలన్న కోపంతో ఊగిపోయాడు. మాటిమాటికీ ఇదే పునరావృతమైంది. రాజుగారు తన పక్కనే ఉన్న తన సైనిక భటునితో ‘‘దేవుడు ఈగను ఎందుకు సృష్టించాడు.

దీన్ని పుట్టించడం వెనుక ఉద్దేశమేమిటి’’ అని కోపంతో అడిగాడు. ‘‘రాజులు, చక్రవర్తుల అధికార మదాన్ని, అహంకారాన్ని అణిచివేసేందుకే ఈగను సృష్టించాడు. ఎంత గొప్ప చక్రవర్తులైనా చిన్న ఈగపై కూడా ఎలాంటి ఆధిపత్యాన్ని చెలాయించలేరన్న విషయాన్ని తెలిపేందుకే ఈగను సృష్టించాడు. తమకు తిరుగులేదని విర్రవీగే చక్రవర్తులు చిన్న ఈగపై కూడా అధికారం చెలాయించలేనప్పుడు మన విలువ ఏపాటిదో గుర్తుంచుకోవాలి’’ అని సైనిక భటుడు రాజుగారి కళ్లు తెరిపించాడు. అతని మాటలకు ఎంతో మెచ్చుకున్న రాజుగారు అతన్ని తన మంత్రిగా నియమించుకున్నాడు.  
– తహీరా సిద్ధఖా

మరిన్ని వార్తలు