కోడిలాంటి గద్ద

29 Mar, 2018 00:52 IST|Sakshi

‘నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను’ అని ఒక గురువు దగ్గర చెప్పుకున్నాడు యువకుడు. అప్పుడు ఆ యువకుడిలో లోపించిన ఆత్మవిశ్వాసానికి కారణాలు తెలుసుకున్నాడు గురువు. వాటన్నింటినీ అధిగమిస్తేనే పైకి ఎదగగలవని సూచించాడు. మనిషిని పరిస్థితులు ఎలా నియంత్రిస్తాయో, వాటికనుగుణంగా ఆలోచన ఎలా కురచబారుతుందో తెలియజేసేందుకు ఈ కథ చెప్పాడు.

పొరపాటున ఒక గద్ద గుడ్డు, కోళ్లుండే చోట పడింది. అది ఏమిటని కోళ్లు ముందు ఆశ్చర్యంగా చూశాయి. చివరకు ఒక కోడి ఆ గుడ్డును పొదిగింది. కొన్ని రోజుల తర్వాత గద్ద పిల్ల అందులోంచి బయటికి వచ్చింది. కోళ్లన్నీ దాన్ని కోడిపిల్లలాగే పెంచాయి. అది ఎంతో ఎత్తుకు ఎగరాలనుకునేది. దాని రెక్కలకు ఆ నేల చాలేది కాదు. కానీ దాని తోటి కోడిపిల్లలన్నీ కిందే బతికేవి.

వాటితోపాటు గద్దపిల్ల కూడా నేలన తిరిగేది. అప్పుడప్పుడూ పైన గద్దలు ఎగురుతూ పోవడం అది చూసేది. అప్పుడు దాని రెక్కల్లోకి ఏదో కొత్త ఉత్సాహం వచ్చేది. ఎగరడానికి ప్రయత్నించేది. కానీ, ‘నువ్వు కోడిపిల్లవు, గద్దల్లాగా అంత పైకి ఎగరలేవు’ అని నూరిపోసేది తల్లికోడి. అది నిజమేనని నమ్మింది గద్దపిల్ల. ఇక శాశ్వతంగా నేలమీదే ఉండిపోయింది. చాలా ఏళ్లు కోడిలాగే బతికి, కోడిలాగే చచ్చిపోయింది.

మరిన్ని వార్తలు