చెవిలో గుయ్‌ఁ మని ఒకటే హోరు..?

6 Oct, 2014 23:12 IST|Sakshi
చెవిలో గుయ్‌ఁ మని ఒకటే హోరు..?

నా వయసు 30 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా చెవిలో విపరీతమైన శబ్దం వస్తోంది. ఏ పనీ చేయలేకపోతున్నాను. రాత్రి సమయాల్లో హోరు ఎక్కువగా ఉంటోంది. వైద్యులను సంప్రదిస్తే నరాల బలహీనత ఉంది అని కొన్ని మందులు ఇచ్చారు. కానీ అంతగా ఫలితం లేదు. ఈ సమస్యతో ఉద్యోగం సరిగా చేయలేకపోతున్నాను. నాకు హైబి.పి కూడా ఉంది. ఏమవుతుందోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం తెలియచేయగలరు.

 - ఎస్. వినోద్, హైదరాబాద్
 
మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్యను‘టినైటస్’ అంటారు. ఇలా చెవిలో శబ్దాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. టినైటస్ చాలా వరకు వినికిడికి సంబంధించిన వ్యవస్థలోని లోపాల వల్ల వస్తుంది. చెవిలో ఇన్‌ఫెక్షన్‌లు ఒటోస్ల్కెరోసిస్ వంటి కారణాల వల్ల కూడా వస్తుంది. వీటితోపాటుగా వినికిడి వ్యవస్థలోని లోపలి భాగమైన కాక్లియా సంబంధిత భాగాలకు రక్తసరఫరా సరిగా జరగకపోవడం, వినికిడి నరంలో లోపం, కాక్లియాకు సంబంధించిన  ఇతర లోపాల వలన కూడా టినైటస్ రావచ్చు. మీకు అధిక రక్తపోటు ఉందంటున్నారు కాబట్టి వాస్కులర్ సిస్టమ్‌లో లోపాల వలన కూడా మీకు ఈ సమస్య వచ్చి ఉండవచ్చు.
 
మీరు వెంటనే నిపుణులైన ఇ.ఎన్.టి వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు ఆడియాలజిస్టునూ, న్యూరాలజిస్టునూ సంప్రదించి వారి సలహా మేరకు వినికిడి పరీక్షలు చేయించుకోండి. సాధారణంగా మీకు టినైటస్ ప్రశ్నావళి, లిపిడ్ ప్రొఫైల్, ఎం.ఆర్‌ఐ (బ్రెయిన్, ఐఎసి) మొదలైన పరీక్షలు (అన్నీ కాని లేదా వీటిలో కొన్ని) అవసరం కావచ్చు. స్వయంగా పరీక్షించిన డాక్టరు సూచన మేరకు చేయించుకున్న పరీక్షల నివేదిక ఆధారంగా మీ సమస్య పట్ల కచ్చితంగా ఒక నిర్ధారణకు రావచ్చు. ఆ తర్వాత మీకు చికిత్స పట్ల ఒక అవగాహన కలుగుతుంది. ఈ సమస్య మందులతో నయమవుతుంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. చాలామందికి టినైటస్ రీ ట్రైనింగ్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఉపయోగం ఉంటుంది. వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి మిషన్‌ల ద్వారా ఉపశమనం కలుగుతుంది.
 
- డాక్టర్ ఇ.సి. వినయ్‌కుమార్, ఇ.ఎన్.టి. నిపుణులు

మరిన్ని వార్తలు