ముందు సంపాదన... తర్వాత సరదా!

19 Mar, 2014 01:05 IST|Sakshi
ముందు సంపాదన... తర్వాత సరదా!

గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలనుకొనే ప్రస్తుత యువతరానికి ‘ఒరాకిల్’ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం ఒక కల. ఆయన కూడా అలాంటి మంచి ఉద్యోగం ఏదైనా సంపాదించుకొంటే చాలనుకొన్నాడట. అయితే మదిలోని వ్యాపార ఆలోచనలు అతడిని ప్రశాంతంగా ఉద్యోగం మీద దృష్టి సారించనివ్వలేదు.


ఏదో చేయాలనే తపన తీవ్రమవసాగింది.  అమెరికాలో ఇంకా అప్పుడప్పుడే కంప్యూటరీకరణ అవుతున్న సేవారంగ వ్యవస్థలను చూసి ఆ రంగంలో ప్రయత్నిస్తే లాభం ఉంటుందేమోననే ఆలోచన మొదలైంది. ప్రయత్నాలు మొదలెట్టాడు, అంతే... ఆయన దశ తిరిగింది. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకడయ్యాడు. దాదాపు 32 ఏళ్ల క్రితం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని మొదలుపెట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేల మందికి ఉపాధినిస్తూ కోట్ల రూపాయలకు అధిపతి అయిన ఆయనే - ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎలిసన్.
 న్యూయార్క్‌లోని ఒక యూదు కుటుంబంలో జన్మించిన ల్యారీ ఎలిసన్‌ను తల్లిదండ్రులు చిన్నప్పుడు తెలిసిన వాళ్లకు దత్తత ఇచ్చేశారు. వారింట్లో పెరిగి పెద్ద అయిన ఎలిసన్‌కు చదువు అంతగా అబ్బలేదు. అయితే గ్రాడ్యుయేషన్‌లో నేర్చుకొన్న కంప్యూటర్స్ సబ్జెక్ట్ బాగా నచ్చింది. దాన్నే అర్హతగా చేసుకొని ‘ఆంపెక్స్ కార్పొరేషన్’ అనే డాటా మేనేజ్‌మెంట్ కంపెనీలో పని చేయసాగాడు. ఆ సమయంలో అమెరికన్ గూఢచారి సంస్థ ‘సీఐఏ’ ఇచ్చిన ఒక ప్రాజెక్ట్‌కు ఎలిసన్ పెట్టిన పేరే -


 ‘ఒరాకిల్’. అది 1970 నాటి మాట. ఆ తర్వాత 12 సంవత్సరాలకు ‘ఒరాకిల్ సిస్టమ్స్ కార్పొరేషన్’ పేరుతో ఒక కంపెనీని స్థాపించాడు ఎలిసన్. 1990 వరకూ కూడా నిలదొక్కుకోవడానికి ఆ కంపెనీ చాలా కష్టాలే పడింది. అప్పటి వరకూ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య కేవలం 400. అయితే ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ సేవలు విస్తృతం అయ్యాక ఒరాకిల్ కంపెనీ స్థాయి మారిపోయింది. కోట్ల డాలర్ల టర్నోవర్ స్థాయికి చేరుకొంది.


ఆ తర్వాత అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలను కొనుగోలు చేసి విలీనం చేసుకొన్నాడు. ఉద్యోగుల సంఖ్య వేల స్థాయికి చేరింది. ఎలిసన్ సంపద కోట్ల స్థాయికి చేరింది. ఇందులోనే కొంత మొత్తాన్ని విరాళాలకూ, సామాజిక  సేవకూ వెచ్చిస్తూ సాగుతున్నాడు ఎలిసన్. ఇక ఆయన జీవనశైలి విషయానికి వస్తే... ఎలిసన్ ఒక సరదా మనిషి. ఆయన అభిరుచులు చూసిన వారు చెప్పే మాట ఇది.
 ‘‘ఒక దశ వరకూ క్రమశిక్షణతో గడిపితే తప్ప కోట్ల రూపాయలను జమ చేయడం సాధ్యం కాదు... కానీ కొంత సంపాదించాక మన సరదాలను తీర్చుకోగలగాలి. వాటి కోసం కూడా మనం కొంత సమయాన్ని వెచ్చించాలి.



అలా వెచ్చించగలిగినప్పుడు జీవితంలో సాధించిన సక్సెస్‌కు ఒక పరిపూర్ణత వస్తుంది...’’ అని అంటాడాయన. ఎలిసన్‌కు విమానాలు నడపడం అంటే ఇష్టం. బాగా డబ్బు సంపాదించిన తర్వాత మొదలైన సరదా అది. అందుకోసం ఆయన సొంతంగా విమానాలు కొనుక్కున్నాడు. పెలైట్‌గా శిక్షణ పొందాడు. 69 ఏళ్ల వయసులో కూడా విమానాలను నడపడంలో సాహసాలు చేస్తూ థ్రిల్‌ఫుల్‌గా గడిపేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రపంచంలోని శ్రీమంతుల జాబితాలో నాలుగోస్థానంలో ఉన్న ఎలిసన్ భవిష్యత్తులో తొలి స్థానానికి చేరే అవకాశాలు కూడా ఉన్నాయని ‘ఫోర్బ్స్’ అంచనా
 
 

మరిన్ని వార్తలు