బాబుకు కాళ్లు, చేతుల మీద ర్యాష్... ఏం చేయాలి?

16 Oct, 2013 23:48 IST|Sakshi
బాబుకు కాళ్లు, చేతుల మీద ర్యాష్... ఏం చేయాలి?

మా బాబుకు మూడేళ్లు. వాడికి ఇటీవల కాళ్లు, చేతుల మీద నీటిపొక్కుల్లా వచ్చాయి. ఇదే ర్యాష్ మా ఏడాదిన్నర పాపకు కూడా వచ్చింది. ఇది చికెన్‌పాక్స్ అని చికిత్స చేశారు. అయితే మా వాడికి పోయిన ఏడాది కూడా ఇలాగే ర్యాష్ వచ్చి తగ్గిపోయింది. అలాగే వాడికి చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇలా మళ్లీ మళ్లీ ఎందుకు ర్యాష్ వస్తోంది? అసలిది చికెన్‌పాక్సేనా?
 - కేశవనాయుడు, చిత్తూరు

 
 మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ బాబుకు జ్వరంతో కలిసి కొద్దిపాటి పాపిలో వెసైకిల్ ర్యాష్ వచ్చినట్లు తెలుస్తోంది. పిల్లల్లో జ్వరంతో పాటు కలిసి ర్యాష్ వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మీజిల్స్, రుబెల్లా, చికెన్‌పాక్స్, డెంగ్యూ, హెర్పిస్ సింప్లెక్స్, కాక్సాకీ వంటి వైరల్ జబ్బులు, అలాగే స్టాత్ ఆర్‌ఎస్, స్టెఫాలోకాకస్, రికెట్షియల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌తో పాటు కొన్ని కొల్లాజెన్ డిసీజెస్ వల్ల కూడా శరీరం మీద ఇలా ర్యాష్ వస్తుండవచ్చు.
 
 మీరు చెప్పిన లక్షణాలను బట్టి, మీ అమ్మాయికి కూడా ర్యాష్ రావడం వంటి అంశాన్ని బట్టి, మీరు వివరించిన విస్తృతిని బట్టి చూస్తుంటే మీ పిల్లలకు ఈసారి వచ్చింది చికెన్‌పాక్స్ కాదు. వారిద్దరికీ వచ్చిన జబ్బు ‘హ్యాండ్ ఫుట్ మౌత్ సిండ్రోమ్’లా అనిపిస్తోంది. ఇది కాక్సాకీ వైరస్, ఎంటిరో వైరస్ అనే తరహా వైరస్‌ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. దీన్ని చిన్నపిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల నుంచి ఆరేళ్ల పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఈ పిల్లల్లో నొప్పితో కూడిన ఎర్రటి ర్యాష్ వేళ్ల మీద, కాళ్ల మీద వస్తుంటాయి. నోటిలోపలి భాగంలో అల్సర్స్ రూపంలో కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ర్యాష్‌తో పాటు చాలా కొద్దిశాతం మంది పిల్లల్లో గుండె ఇన్‌వాల్వ్‌మెంట్ (మయోకార్డయిటిస్), లంగ్ ఇన్వాల్వ్‌మెంట్ (నిమోనియా), బ్రెయిన్ ఇన్‌వాల్వ్‌మెంట్ (ఎన్‌కెఫలైటిస్) వంటి తీవ్రమైన అంశాలతో పాటు, చాలామందిలో శ్వాసకోశ (రెస్పిరేటరీ) ఇన్ఫెక్షన్లు, చెవినొప్పి వంటి కొద్దిపాటి లక్షణాలు కూడా కనపడుతుండవచ్చు. తీవ్రతను బట్టి ఈ జబ్బు మూడు నుంచి ఐదురోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది.
 
 ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. వాడినా ప్రయోజనం ఉండదు. కానీ నొప్పి, దురద నుంచి ఉపశమనం పొందడానికి మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరుగుతున్నప్పుడు లేదా దాని కాంప్లికేషన్లు పెరుగుతున్నప్పుడు యాంటీవైరల్ మందుల వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు. గత కొద్ది నెలలుగా ఈ లక్షణాలున్న పిల్లలను చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి లక్షణాలు నెలల పిల్లల్లో వచ్చినప్పుడు సెప్సిస్ వంటి కారణాలను రూల్ అవుట్ చేయడం చాలా ముఖ్యం.
 
 ఇక మీరు చెబుతున్న చికెన్‌పాక్స్ విషయానికి వస్తే... దానికోసం వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ అది మళ్లీ రావచ్చు. కానీ అప్పుడు దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వ్యాధి నివారణ, తీవ్రత తగ్గించడానికి వీలవుతుంది. కాబట్టి మీరు మీ బాబు, పాప విషయంలో ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు