రోజుకో గుడ్డుతో..

22 May, 2018 18:15 IST|Sakshi

లండన్‌ : ప్రతిరోజూ గుడ్డు తీసుకుంటే స్ర్టోక్‌కు గురయ్యే ముప్పు 25 శాతం తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. వారానికి అయిదు సార్లు గుడ్డు తింటే గుండె జబ్బుల ముప్పు 12 శాతం తగ్గుతుందని తెలిపింది. గుడ్డు వినియోగానికి స్ర్టోక్‌, గుండె జబ్బులకు గల సంబంధంపై పెకింగ్‌ యూనివర్సిటీ హెల్త్‌ సైన్స్‌ సెంటర్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. చైనాకు చెందిన 30 నుంచి 79 సంవత్సరాల మధ్య ఆరోగ్యవంతులైన 4 లక్షల మంది ఆహారపు అలవాట్లను శాస్త్రవేత్తలు పరిశీలించారు.

అథ్యయనం ప్రారంభంలో 13 శాతం మంది తాము రోజూ గుడ్డు తీసుకుంటామని చెప్పగా, 9.1 శాతం మంది చాలా అరుదుగా వీటిని తింటామని చెప్పారు. వీరిలో కొందరు తాము అసలు గుడ్డునే ముట్టమని తెలిపారు. తొమ్మిదేళ్ల పాటు వీరిని పరిశీలించగా 83,977 మందిలో గుండె జబ్బులు తలెత్తగా 9985 మరణాలు సంభవించాయి. 5103 హార్ట్‌ఎటాక్‌ కేసులు నమోదయ్యాయి.

మొత్తంమీద చూస్తే రోజూ గుడ్డు తీసుకునేవారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. వీరిలో స్ర్టోక్‌ ముప్పు కూడా 26 శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది. గుండె జబ్బుల ద్వారా మరణించే అవకాశం 18 శాతం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. సమతుల ఆహారంలో గుడ్డు కీలకపాత్ర పోషిస్తుందని తమ అథ్యయనంలో తేలిందని పెకింగ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ లిమింగ్‌ లి చెప్పారు. 

మరిన్ని వార్తలు