మహాభాగ్యం  మొలకెత్తినట్లే!

5 Sep, 2018 00:04 IST|Sakshi

గుడ్‌ ఫుడ్‌

మొలకెత్తిన ధాన్యాలు తినడం ఆరోగ్యకరం అని తెలిసిందే. ఇటీవల చాలామంది మొలకెత్తిన ధాన్యాలు తింటున్నారు. ప్రత్యేకించి మొలకెత్తిన పెసలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అవి ఏమిటో చూద్దాం.జుట్టు రాలిపోయి, పలచబడేవారికి మొలకెత్తిన పెసలు స్వాభావిక చికిత్స అనుకోవచ్చు. వాటితో జుట్టు కూడా మళ్లీ మొలకెత్తే అవకాశాలు ఎక్కువ. మొలకెత్తే పెసలలో పుష్కలంగా ఉండే విటమిన్‌–ఏ రోమాంకురాలను ప్రేరేపించి (హెయిర్‌ ఫాలికిల్స్‌ను స్టిమ్యులేట్‌ చేసి) మళ్లీ జుట్టును మొలిపించే అవకాశం ఉంది. అంతేకాదు... రోమాంకురాలకు సరఫరా అయ్యే రక్తనాళాల (క్యాపిల్లరీస్‌)ను కూడా ఈ మొలకలు ప్రేరేపిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.పైన చెప్పుకున్నట్లు మొలకెత్తే పెసర్లలో పుష్కలంగా ఉన్న విటమిన్‌–ఏ వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. వయసు పెరగడం వల్ల వచ్చే మాలిక్యులార్‌ డిజనరేషన్‌తో పాటు ఎన్నో రకాల కంటి వ్యాధులు నివారితమవుతాయి. 

వయసు పెరుగుతుండటం (ఏజింగ్‌)తో కనపడే ఎన్నో లక్షణాలను ఈ మొలకలు నివారిస్తాయి. జుట్టు తెల్లబడటం, జుట్టు రాలిపోవడం, చర్మం ముడతలు పడటం వంటి ఏజింగ్‌ పరిణామాలను అరికట్టి దీర్ఘకాలం యౌవనంగా ఉండేలా చూస్తాయి. పెసర మొలకలు మంచి ప్రోటీన్లకు నెలవు. ఎప్పటికప్పుడు కండరాలను రిపేర్‌ చేస్తుండటం వల్ల దీర్ఘకాలం పాటు కండరాలు మంచి పటుత్వంతో బలంగా ఉంటాయి. మొలకెత్తే పెసలలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇవి రక్తాన్ని భర్తీ చేస్తాయి. జుట్టు పెరుగుదలకు అవసరమైన ఐరన్‌నూ సమకూర్చడం వల్ల కూడా ఇవి జుట్టును మళ్లీ మొలిపించడానికి దోహదపడతాయి. మహిళల్లో హార్మోన్ల సమతౌల్యతకు పెసర మొలకలు సహాయం చేస్తాయి. చర్మంలోని కొత్త కణాల పుట్టుకను వేగవంతం చేయడం వల్ల పెసర మొలకలతో మేని మెరుపు, మంచి నిగారింపు వస్తుంది. చర్మక్యాన్సర్‌ వంటి వ్యాధులనూ ఈ మొలకలు నివారిస్తాయి. చర్మంలోని తేమను తగ్గకుండా చేస్తే హైడ్రేటింగ్‌ ఏజెంట్స్‌గా కూడా పెసర మొలకలు పనిచేస్తాయి. జీవక్రియల కారణంగా ఒంట్లో పేరుకుపోయే ఎన్నో రకాల విషాలను పెసర మొలకలు చాలా వేగంగా బయటకు వెళ్లేలా చూస్తాయి. అందుకే వీటిని మంచి డీ–టాక్సిఫయింగ్‌ ఏజెంట్లుగా చెప్పవచ్చు. గర్భవతులకు ఇవి చాలా మేలు చేస్తాయి. గర్భధారణ సమయంలో వీటిని ‘ప్రెగ్నెన్సీ ప్రోటీన్‌ పవర్‌హౌజ్‌’గా పరిగణిస్తారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. అయితే క్యాలరీలు చాలా తక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఆరోగ్యకరమైన ఆహారం ఈ పెసర మొలకలు.  అన్ని రకాల విటమిన్లు, ఖనిజలవణాల కారణంగా ఇవి ఒంటికి మంచి రోగనిరోధక శక్తిని ఇస్తాయి.  

మరిన్ని వార్తలు