ఆపిల్స్, టమాటాలతోఊపిరితిత్తులకు మేలు!

22 Dec, 2017 10:12 IST|Sakshi

ధూమపానం మానేసిన వారికి ఎప్పుడూ ఓ సందేహం ఉంటుంది. కొద్దోగొప్పో పాడైన తమ ఉపిరితిత్తులను ఆరోగ్యవంతంగా చేయవచ్చా? అని. ఈ సందేహంపై జాన్‌ హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ ప్యారిస్‌ శాస్త్రవేత్తలు ఒక స్పష్టత ఇచ్చారు. తినే ఆహారంలో టమాటాలతోపాటు అధిక స్థాయిలో పండ్లు ముఖ్యంగా ఆపిల్స్‌ తింటే ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని తగ్గిస్తుందని వారు అంటున్నారు. దాదాపు పదేళ్లపాటు తాము పరిశీలన జరిపామని.. ఈ కాలంలో ఆపిల్స్, టమాటాలు ఎక్కువగా తిన్న మాజీ ధూమపాన ప్రియుల్లో ఊపిరితిత్తుల పనితీరు ఇతరులతో పోలిస్తే మెరుగ్గా ఉందని వెనెస్సా గార్షియా లార్సెన్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు.

జర్మనీ, నార్వే, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లకు చెందిన కొంతమందిపై ఈ పరిశోధన జరిగింది. వారు తీసుకునే ఆహారం, ఊపిరితిత్తుల పనితీరును పదేళ్ల అంతరంలో రెండు సార్లు పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని చెప్పారు. సగటున రోజుకు రెండు టమాటాలు లేదంటే మూడుకంటే ఎక్కువసార్లు పండ్లు తినేవారి ఊపిరితిత్తులు... ఒకటి కంటే తక్కువ టమాటాలు, పండ్లు తినే వారికంటే నెమ్మదిగా సమస్యలకు గురవుతున్నట్లు తెలిసిందన్నారు. టమాటాలు, పండ్లు ఊపిరితిత్తులకు మేలుస్తాయని, అలాగే ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని సరిచేసేందుకు ఇవి ఉపయోగపడతాయని తమ పరిశోధన చెబుతోందన్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు