ఉన్నది ఉన్నట్లు చెప్పగల ధైర్యం మీకుందా?

23 Jan, 2016 23:29 IST|Sakshi
ఉన్నది ఉన్నట్లు చెప్పగల ధైర్యం మీకుందా?

విద్య - విలువలు
మీలో ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా తగిన సంఖ్యలో ఉన్నారు కాబట్టి మేధావి, రాజనీతిజ్ఞుడు, మైసూర్ సంస్థానంలో దివాన్‌గా పనిచేసిన ఒక ప్రముఖ ఇంజనీర్ పేరు మీ అందరికీ కూడా పరిచితమే అని భావిస్తాను. ఆయన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సెప్టెంబర్ 15 ఆయన జన్మదినం కావడంతో ఆయన నుంచి స్ఫూర్తి పొందడానికి ప్రతిఏటా మనదేశంలో ఆ రోజు ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకుంటున్నాం. వారిది కర్ణాటకలో స్థిరపడిన తెలుగు కుటుంబం. బ్రిటీష్ ఇండియా ఆయనను నైట్ కమాండర్‌గా సత్కరిస్తే భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది.
 
మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి జీవితం గురించి చదువుతుంటే ఆశ్చర్యపోతాం. ఒకసారి కేంద్ర కేబినెట్ మంత్రి ఆయనను ఫలానా టైమ్‌లో కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. కానీ ఇచ్చిన టైందాటి పోయినా కలవలేదు. తర్వాత తీరుబడిగా కలవడానికి వచ్చారు. విశ్వేశ్వరయ్యగారు టైం ఇవ్వలేదు. తర్వాత ఫోన్‌లో ఆయన అదేమిటి నేను కేంద్ర ప్రభుత్వంలో మంత్రిని, కాస్త టైం అటూ ఇటూ అవుతుంటుంది... అని ఏదో చెప్పబోయారు. దానికి విశ్వేశ్వరయ్య గారు..‘‘మీరు ఏదైనా కావచ్చు. నేను టైం ఇచ్చినప్పుడు ఆ టైంకు రావాలి. మీరు తర్వాత వచ్చేటప్పటికి నేను మరొకరితో చర్చిస్తుంటాను. అప్పుడు ఆ చర్చలకు భంగం కలగవచ్చు. క్రమశిక్షణ లేని మీ వంటి వ్యక్తి వచ్చి నాతో మాట్లాడటం కుదరని పని’’ అనడంతో మంత్రిగారు బిత్తరపోయారు.
 
గాంధీగారు గ్రామసీమల అభ్యున్నతికోసం సేద్యపునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించి కొన్ని పథకాలు సిద్ధం చేశారు. వాటిని గురించి తెలుసుకోవడానికి సేద్యపు రంగంలో అప్పటికే బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన వద్దకు వెళ్లారు. అన్నీ కూలంకషంగా విన్న తరువాత ఇవి దేశాభివృద్ధికి పనికి రావని విశ్వేశ్వరయ్య చెప్పారు. దానికి గాంధీగారు మాట్లాడుతూ, ‘‘నేను చాలా గ్రామసీమలు తిరిగాను. అనుభవజ్ఞుడను’’ అని అన్నారు.

దానికి మోక్షగుండం అన్నారు కదా, ‘‘నేను మీకన్నా పెద్దవాడిని వయసులో, సబ్జెక్ట్ పరంగా కూడా మీకన్నా నాకు ఎక్కువ తెలుసు. దేశాభివృద్ధికి ఇవి అసలు పనికిరావు’’ అంటూ ఎందుకు పనికిరావో చాలా విస్పష్టంగా చెబుతూ, ‘‘నేను అంగీకరించను. అది అసలు కుదరదు’’ అని ఎక్కడా రాజీపడకుండా తేల్చి చెప్పారు.
 
అది శాస్త్రమైనప్పుడు, పెద్దలు చెప్పిన మాటయినప్పుడు, ఋషి ప్రోక్తమయినప్పుడు, అది పాడు చెయ్యదనుకున్నప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పగల ధైర్యం మీకుండాలి. ఒకప్పుడు కొందరు పిల్లలు రాష్ర్టపతి భవన్‌కు వెళ్లారు. వీరందరూ శారీరక, మానసిక వికలాంగులు. వీరిని మొగల్ సరాయ్ గార్డెన్స్‌లో కూర్చోబెట్టారు. కాసేపటికి అబ్దుల్ కలాం గారొచ్చారు. పిల్లలు... అయినా ఏం మాట్లాడాలో తోచక వారిని ఉత్సాహపరచడానికి ఆయన అంతకుముందెప్పుడో రాసుకున్న ఒక కవిత చదివి వినిపించారు. ‘‘బలవంతుడైన కొడుకును గురించీ తల్లీదండ్రీ ఆలోచించరు. బలహీనుడైన వారిని గూర్చే ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే భగవంతుడు కూడా మిమ్మల్ని గూర్చే ఎక్కువ ఆలోచిస్తాడు. బెంగపెట్టుకోకండి’’ అనేది ఆ కవితకు అర్థం.

అయితే అదేదో ఓదార్పు మాటలా, తామేదో కష్టంలో ఉన్నట్లు, ఓదారుస్తున్నట్లు అనిపించింది ఇరాన్ నుంచి వచ్చిన ఒక పిల్లవాడికి. వాడికి మోకాళ్ల వరకు కాళ్లు లేవు. పర్షియన్ భాషలో ఒక చిన్న కాగితం మీద రాసి వాడు దేకుతూ వెళ్లి కలాంగారికి ఆ కాగితం ఇచ్చాడు. ఆయన చదివాడు. ‘‘నాకు మోకాళ్ల వరకు రెండు కాళ్లు లేవు. దానికి నేను ఏమీ బాధపడడం లేదు. కానీ నా జీవితంలో నేను ఎవరి ముందు మోకరిల్లవలసిన అవసరం లేదని గర్వపడుతున్నాను’’ అని ఉంది. అంతే కలాం ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. ‘‘ఏం ధైర్యం! ఇంత ధైర్యం ఎలా వచ్చింది’’ అని ఆయన ఆశ్చర్యపోయాడు. అదీ నీకున్న ధైర్యంతో నీవు నిలబడగలగడం అంటే.
 
మీకా ధైర్యం లేకపోతే అర్థం లేదు. ఒక్కటే ఒక్క పరీక్ష. మీరెప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఎప్పుడు ఏ ఆలోచన మీ మనసులోకొచ్చినా... ఒక పొయ్యిలో కట్టె పెట్టి పొడిస్తే నిప్పురవ్వ రేగినట్లు వెంటనే అనేక ఆలోచనలు లేస్తాయి. ఒక్కో ఆలోచన రాగానే ఒక్కో భావన మనలో నుంచి పైకి లేస్తుంది. ముందుగా మాట్లాడేది పిరికితనం. ‘‘దీనివల్ల నాకు ప్రమాదం రాదు కదా’’ అంటుంది. రెండవది మనలో ఉండే లోభం. ‘‘దీనివల్ల నాకేమైనా కలిసి వస్తుందా?’’ అని అడుగుతుంది. లోపల ఉండే కీర్తికండూతి లేస్తుంది. ‘‘ఈ పనిచేస్తే నాకేమైనా పేరు ప్రతిష్ఠలు వస్తాయా’’ అంటుంది.

మీ అంతరాత్మ ఒక్కటే ఎప్పుడూ ఒక్కటే అడుగుతుంది...‘‘ఇది చెయ్యవచ్చా?’’ అని అడుగుతుంది. మీ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించండి. ‘ఇలా చెయ్యడం సబబేనా’ అని అడిగే అంతరాత్మ ప్రబోధాన్ని అనుమతించడం నేర్చుకోండి. దాని పీక నొక్కవద్దు. అది చెయ్యవచ్చో చెయ్యకూడదో తేల్చుకోవడానికి మీరు ఆదర్శంగా తీసుకున్న వ్యక్తిని ఉదాహరణగా తీసుకోండి. అలా తీసుకుని మీరు చెయ్యవలసినదొక్కటే. మీ రోల్‌మోడల్ తృప్తి కొరకు బతకండి. మీ రోల్‌మోడల్‌గా ఎవరిని తీసుకోవాలో నిర్ణయించుకోండి. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, అబ్దుల్ కలాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య... అలా ఎవరినైనా ఒకరిని ఎంచుకోండి. వారిని గుండెల్లో దాచుకోండి. అనుక్షణం వారిని అనుసరించండి.                                        
 
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు