నీతి శాస్త్రము చెప్పబోతది –పాతకములో బడునుబోతది

21 Jan, 2019 00:50 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

‘యెంత మూర్ఖపు మనసు వినుడీ – యేమనీ తెల్పుదును గనుడీ
యింతనైన హరిని దలువక –
చింతలల్లా జిక్కబోతది

నీతిశాస్త్రము జెప్పబోతది –
పాతకములో బడనుబోతది
కోతి గుణములు మాననంటది – దాతనూ మది మరచియుంటది’

1907–57 మధ్యకాలంలో జీవించిన ఈగ బుచ్చిదాసు సంకీర్తనల్లో ఇదీ ఒకటి. దాస సంప్రదాయంలో జీవించిన ఎందరో తెలంగాణ వాగ్గేయకారుల్లాగే తన పేరు చివరా ‘దాసు’ను చేర్చుకున్నారాయన. వరంగల్‌కు చెందిన బుచ్చిదాసు అనారోగ్య కారణాల రీత్యా యాదగిరి గుట్టకు వచ్చి అక్కడే కొండపైన కుటీరం నిర్మించుకొని లక్ష్మీ నరసింహస్వామిని సేవించారు.
‘తల్లడిల్లె నాదు ప్రాణమూ శ్రీ నారసింహ
పుల్లసిల్లె నాదు దేహమూ’.
ఆరోగ్యం బాగుపడిన తర్వాత చుట్టుపక్కల విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ క్రమంలోనే ఈయనకు అనంతర కాలంలో సాధు బుచ్చిమాంబగా పరిణామం చెందిన బుచ్చమ్మ సహా ఎందరో శిష్యులైనారు. నరసింహస్వామి భక్తుడిగా బుచ్చిదాసు అలవోకగా చెబుతూవుంటే ఈ శిష్యులు రాసిపెట్టేవారు. ఆయన రాసినవాటిల్లో ‘శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భజన కీర్తనలు’, ‘శ్రీయాదగిరి నరహరి శతకం’, ‘శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి బతుకమ్మ పాట’ ఉన్నాయి. సీసపద్యాల్లో రాసిన శతకం ‘యాదగిరివాస నరహరీ! సాధుపోష!!’ మకుటంతో సాగుతుంది.

‘జప తపంబుల నేను సలిపితినంచును
గొప్పగా ప్రజలతో జెప్పలేదు
ఆత్మతత్వంబు నే నరసితి నంచును
యార్యులతోడనే నసగ లేదు...’
పల్లెల్లోని భక్త సమాజాలు పాడుకునే ఈ కీర్తనలు, బతుకమ్మ పాటలను 1960ల్లో బుచ్చిమాంబ తొలిసారి ప్రచురింపజేశారు. మళ్లీ వాటిని అన్నింటినీ ఒక దగ్గర చేర్చి, ‘యాదగిరి క్షేత్ర సంకీర్తన కవి ఈగ బుచ్చిదాసు’ పేరుతో 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించింది. దీని పరిష్కర్త డాక్టర్‌ పి.భాస్కరయోగి.

మరిన్ని వార్తలు