కోడిగుడ్డుతో గుండెజబ్బులు దూరం!

23 May, 2018 01:24 IST|Sakshi

కోడిగుడ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని చైనా శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. గతంలో కోడిగుడ్లు గుండెజబ్బులకు కారణమవుతాయని కొన్ని అధ్యయనాలు చెప్పినప్పటికీ అన్ని ఒకే రకమైన అంచనాకు రాలేకపోయాయని, ఈ నేపథ్యంలో తాము ఇంకోసారి ఈ అంశంపై విస్తత అధ్యయనం చేపట్టామని ప్రొఫెసర్‌ లిమింగ్‌ లీ తెలిపారు.  కేన్సర్, మధుమేహం, గుండెజబ్బులు లేని దాదాపు నాలుగు లక్షల మందిని కనీసం తొమ్మిది సంవత్సరాల పాటు పరిశీలించి తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఈ కాలంలో 83 వేల మంది గుండెజబ్బులకు గురికాగా, 9985 మంది మరణించారని, తెలిసింది.

అధ్యయనం మొదలైనప్పుడు దాదాపు 13 శాతం మంది తాము రోజూ కోడిగుడ్డు తింటామని చెప్పారు.9.1 శాతం మంది అప్పటివరకూ గుడ్డు తినలేదని.. లేదా చాలా తక్కువగా తిన్నామని చెప్పారు. అధ్యయన కాలం తరువాత వివరాలను పరిశీలించినప్పుడు గుడ్లు అస్సలు తినని వారితో పోలిస్తే తినేవారిలో గుండెజబ్బుల అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. కోడిగుడ్లలో కొలెస్ట్రాల్‌ మోతాదు ఎక్కువగా ఉన్నప్పటికీ దాంతోపాటే ఆరోగ్యానికి మంచి చేసే విటమిన్లు, రసాయనాలు కూడా ఉన్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు