ఇంకొకరైతే...

7 Jan, 2016 22:39 IST|Sakshi
ఇంకొకరైతే...

రేప్ చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎనిమిది మంది. కొట్టారు... తిట్టారు... మనసును పుండు చేశారు. పుండు మీద పురుషాహం‘కారం’ చల్లారు. శరీరానికి మనసుకు నొప్పి తెలిసింది. స్ఫూర్తిని మాత్రం ముట్టుకోను కూడా ముట్టుకోలేక పోయారు. తమ బాధను మర్చిపోవడానికి కొందరు ఇతరుల కోసం ఆశ్రమాలు కట్టారు.సునీతా కృష్ణన్ ఏకంగా ఆశ్రయమే కట్టింది. తల దాచుకునే ఆశ్రమం కాదు... తలరాతను మార్చే ఆశ్రయం. ఇంకొకరైతే  ఆశ్రమానికి చేరేవారు. మరొకరైతే ఆగిపోయుండేవారు. సునీత కదిలింది. సునీతను చూసి వాళ్లూ కదం తొక్కుతున్నారు
 
ఆమె చిన్నప్పుడు అమ్మానాన్నల గారాలపట్టి. ఎనిమిదేళ్ల వయసుకే సమాజ సేవపై ఆసక్తి పెంచుకుంది. తను నేర్చుకున్న డాన్స్‌ను మెంటల్లీ చాలెంజ్డ్ పిల్లలకు నేర్పడం మొదలుపెట్టింది. పన్నెండేళ్లు వచ్చేప్పటికి స్లమ్‌లోని పిల్లలకు టీచర్‌గా మారింది. పదిహేనో యేట దళితులను అక్షరాస్యులను చేసే క్యాంపెయిన్‌లో భాగమైంది. అయితే ఆ సర్వీస్‌లైన్ సరళరేఖలా సాగలేదు. ఆమె మీద ఎనిమిది మంది లైంగికదాడి చేశారు.
 
పడిలేచిన కెరటం
 పసివయసులో మనసుకి, శరీరానికి అయిన ఆ గాయం ఆమెను అనామికగా మిగల్చలేదు. అక్రమరవాణాలో చిక్కుకున్న అమ్మాయిలకు కొత్త జన్మనిచ్చే అమ్మగా మార్చింది. ప్రజ్వల సునీతాకృష్ణన్‌గా ప్రపంచానికి
 సుపరిచితురాలిని చేసింది.  
 
నేపథ్యం
 బెంగుళూరులో పుట్టి తండ్రి రాజుకృష్ణన్ ఉద్యోగరీత్యా దేశమంతటా ప్రయాణం చేస్తూ పెరిగింది సునీత. తల్లి నళిని కృష్ణన్ గృహిణి. భూటాన్‌లోని సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో స్కూలింగ్, బెంగళూరులోని సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ నుంచి ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్‌లో డిగ్రీపట్టా పొంది మంగుళూరు యూనివర్సిటీ రోషిణి నిలయలో సోషల్‌వర్క్ మీద పీహెచ్‌డీ చేసింది సునీత. డాక్టరేట్ కోసం సెక్స్‌వర్కర్స్ జీవితాల పరిశోధనను అంశంగా తీసుకుంది.
 
ఆకాశాన్నంటిన అల
 పొద్దస్తమానం సమాజం, బడుగువర్గాలు, అక్రమరవాణాకు గురవుతున్న మహిళలు అంటూ పాటుపడ్డం సునీత తల్లిదండ్రులకు అంతగా రుచించలేదు. అంతకుముందే దెబ్బతిన్న మనిషి.. దాని తాలూకు భయమేదీ లేకుండా దూసుకెళ్తుంటే మళ్లీ ఇంకేదైనా ప్రమాదం ముంచుకు రావచ్చనే వెరపుతో ఆమెను ప్రోత్సహించలేదు. అయినా ఆమె వెనక్కి వెళ్లలేదు. తీరాన్ని చేరడం కాదు ఆకాశాన్నంటాలి అనే సాహసంతో ముందుకు సాగింది. హైదరాబాద్ వచ్చేసింది. వర్గీస్ థెకనాథ్ నడుపుతున్న పీపుల్స్ ఇనీషియేటివ్ నెట్‌వర్క్ (పీఐఎన్)లో చేరింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ‘మూసీ బ్యూటీఫికేషన్’ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా నినదించింది. మూసీ తీరాన్ని ముస్తాబు చేయడం కోసం దాని తీరం వెంట ఉన్న స్లమ్‌లోని ఇళ్లను కూల్చేసే  ప్రక్రియ అది. నిరాశ్రయుల తరపున వాళ్ల  హక్కుల కోసం ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించింది.
 
ప్రజ్వల

1996..  హైదరాబాద్ పాతబస్తీలోని మెహబూబ్ కీ మెహందీ... అంటే సెక్స్‌వర్కర్స్ ఉండే ప్రాంతం. పాత బస్తీలోంచి వాళ్లను పంపించే కార్యక్రమాన్ని చేపట్టింది అప్పటి ప్రభుత్వం. దాంతో వ్యభిచారం ఉచ్చులో బిగుసుకున్న వాళ్లంతా నిలువ నీడలేని వాళ్లయ్యారు. వాళ్ల పిల్లలు ఆ కూపంలోకి జారిపోకుండా ఈ రెండోతరం కోసం ఓ స్కూల్‌ను ప్రారంభించింది. నగా నట్రా, చివరకు ఇంట్లోని వస్తువులనూ అమ్మి మరీ ఆ స్కూల్‌ని నిలబెట్టింది. అదే ప్రజ్వల. సునీత కృష్ణన్ ప్రయత్నాలకు అడ్రస్‌గా.. ఆమె కష్టాలకు ప్రతిఫలంగా  కనిపిస్తున్న సంస్థ. ఇప్పటి వరకు దాదాపు పన్నెండువేల మందిని సెక్స్ ట్రాఫికింగ్ నుంచి కాపాడి ప్రపంచంలోనే అతిపెద్ద యాంటీ ట్రాపికింగ్ సంస్థగా తన శక్తి నిరూపించుకుంది.
 
ఆటుపోట్లు రాలేదా?

‘బోలెడు. ఇప్పటికి పదిహేడుసార్లు నామీద దాడులు జరిగాయి. నా కుడిచెవి దెబ్బతింది. వీటిని నేను దాడులుగా భావించట్లేదు. వ్యవస్థీకృతమైన నేరాన్ని ఆపే నా ప్రయత్నానికి గుర్తింపు అనుకుంటున్నా. ఒక అమ్మాయి అక్రమరవాణాకు గురై, వ్యక్తిగత, సామాజిక గుర్తింపు సహా ఆరోగ్యం, కుటుంబం, అనుబంధాలు అన్నిటినీ కోల్పోతోంది. ఆమెను కాపాడి తను కోల్పోయిన సెల్ఫ్ అండ్ సోషల్ ఐడెంటిటీనీ మళ్లీ ఆమె పొందేలా చెయ్యాలన్నదే లక్ష్యం. వాళ్లను తిరిగి ఈ సమాజంలో భాగం చెయ్యాలి. ఆ బిడ్డలూ మన బిడ్డలే అన్న స్పృహ కల్పించాలి. ప్రజ్వలకొచ్చి కొత్త జీవితం మొదలుపెట్టిన అమ్మాయిల మొహాల్లోని నవ్వు, తమను  హింసించిన వాళ్లను క్షమించే సహనం నా గాయాలను మరిపించేస్తాయి. నాలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని నింపుతాయి’  
 
ప్రజ్వల ఎలా పనిచేస్తుంది?
 పోలీసుల సహాయంతో రెస్క్యూ చేసి ఆ పిల్లలను ప్రజ్వల హోమ్‌కి తెస్తారు. హోమ్‌కు వచ్చిన ఆ అమ్మాయిల మానసిక స్థితి చాలా చిత్రంగా ఉంటుంది. అసలు ఆ కూపంలో పడి మగ్గిపోవడమే తమ తలరాత అనే భావనలో ఉంటారు. వాళ్లను ట్రాఫికర్స్ అలా తయారు చేస్తారు. దీంతో హోమ్‌లోని కేర్‌టేకర్స్‌ను నమ్మే పరిస్థితి ఉండదు. పారిపోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్లను వాళ్లు హింసించుకుంటుంటారు. కొందరైతే ఆత్మహత్యాయత్నానికీ పాల్పడతారు. అలాంటి వాళ్లకు సైకాలజికల్, సైకియాట్రిక్ కౌన్సెలింగ్స్ ఇస్తారు. సాధారణస్థితికి వచ్చాక  లైఫ్‌స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది. వీటితో వీళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొంతమందిని వాళ్లవాళ్లు తీసుకెళ్తారు. ఇంకొంతమంది తిరిగి ఇంటికి వెళ్లడానికి ఇష్టపడరు. మరికొంతమందిని కుటుంబాలు తిరస్కరిస్తాయి. అలాంటి వాళ్లకు ప్రజ్వలే ఇల్లు, సునీతకృష్ణే అమ్మ. ఇక్కడ కంప్యూటర్స్, హార్డ్‌వేర్, బైండింగ్, వెల్డింగ్  రంగాల్లో శిక్షణపొందిన చాలా మంది అమ్మాయిలు పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు.
 - సాక్షి ఫీచర్స్ ప్రతినిథి
 
ఆడపిల్లల్ని అలర్ట్ చేసే...

 
స్వరక్షా క్యాంపెయిన్
సెంటిమీటరు భూమి పోయిందంటే సుప్రీంకోర్టుదాకా వెళ్లే మనుషులు ఆడకూతురికి అన్యాయం జరిగితే నాలుగు గోడల మధ్యే దాస్తున్నారు. ఈ రోజు కులం, మతం పేరుమీద జరుగుతున్న ఇంటాలరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మన ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాలపై మాత్రం ఎక్కడలేని టాలరెన్స్ ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ ఆడపిల్లలు తమను తమనే రక్షించుకోవాల్సిన అవసరాన్ని కల్పిస్తున్నాయి. ఎలా రక్షించుకోవాలి... మోసపోకుండా, అక్రమ రవాణాకు బలి కాకుండా ఎలాంటి జాగ్రత్త కావాలి అని చెప్పే ‘స్వరక్షా యాత్ర’ను ప్రారంభించబోతున్నాం. అమెరికన్ కాన్సులేట్‌తో కలిసి ప్రజ్వల చేసే ఈ ప్రయాణం జనవరి 9న మొదలై మే వరకు సాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని 53 జిల్లాలు, 132 గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్తాం. అదీ రేప్ సర్వైవర్స్‌తో. ఓ కారవాన్‌లో వెళ్తాం. వెళ్లిన ప్రతిచోటా ఈ సర్వైవర్స్ తమ సొంత కథను చెప్తూ ట్రాఫికింగ్ పట్ల అవగాహన కలిగిస్తారు. మగపిల్లలనూ సెన్సిటైజ్ చేస్తాం. మగపిల్లలు థ్రిల్ కోసం పోర్న్‌సైట్స్ చూసి సెక్స్‌ని కొనాలనుకున్నప్పుడు వాళ్ల  కోరిక తీర్చడానికి ఎక్కడో అక్కడ ఓ అమ్మాయి ఎలా అమ్ముడుపోతుందో చెప్తాం. పోస్టర్లు, షార్ట్‌ఫిలిమ్స్, సినిమాల ద్వారా చూపిస్తాం. అలా ఇంకో మగాడి కోరికకు వీళ్లింట్లోని ఆడపిల్ల కూడా బలవ్వచ్చు అనే స్పృహను కలిగించి రియల్ మ్యాన్ డోంట్ బై సెక్స్ అనే మెసేజ్‌ను తెలియజేస్తాం.
 
అమెరికన్ కాన్సులేట్‌తో కలిసి ప్రజ్వల చేసే ఈ ప్రయాణం జనవరి 9న మొదలై మే వరకు సాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని 53 జిల్లాలు,  132 గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్తాం.
 

మరిన్ని వార్తలు