మహిళలకే గాని పురుషులకు డైటింగ్ అక్కర్లేదు...

20 Jul, 2013 05:20 IST|Sakshi
మహిళలకే గాని పురుషులకు డైటింగ్ అక్కర్లేదు...
 డైట్‌లో, వర్కవుట్‌లో ఎన్నిరకాల మార్పులు చేర్పులు చేసుకున్నా... కొన్నిసార్లు అవేవీ సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. వ్యాయామం కొనసాగిస్తున్నప్పుడు ఆహారవిహారాలకు సంబంధించి మనలో పేరుకుపోయిన కొన్ని అపోహలే దీనికి కారణం కావచ్చు. అలాంటి వాటిలో అగ్రభాగాన ఉండే అపోహలు కొన్ని: 
 
 క్యాలరీలను లెక్కించి తీసుకుంటే ఫ్యాట్ తగ్గించుకోవచ్చు...
 
 ఫ్యాట్‌ను తగ్గించుకోవడంలో క్యాలరీలను నియంత్రించుకోవడం అనేది అవసరమే. అయితే  వినియోగిస్తున్న ఆహారం ఏదనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే మనం తగ్గించుకుంటున్నది ఏమిటనేది గుర్తించాలి. జంక్‌ఫుడ్ తీసుకుంటున్నప్పుడు క్యాలరీల లెక్క సరిపోతుంది కానీ... నాణ్యమైన, మజిల్స్‌కు అవసరమైన ఆహారం తీసుకుంటున్నప్పుడు సరిపోదు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా క్యాలరీ ల నియంత్రణ పాటించని పక్షంలో దేహానికి అవసరమైన మజిల్‌తోపాటు మెటబాలిజమ్ స్థాయిని కూడా కోల్పోవలసి వస్తుంది. 
 
 మహిళలకే గాని పురుషులకు డైటింగ్ అక్కర్లేదు...
 
 ఇది పూర్తిగా అపోహ. డైటింగ్ ఎవరికైనా అవసరమే. అయితే వ్యత్యాసం మాత్రం తప్పనిసరి. పురుషులు తమ డైట్‌లో సాట్యురేటెడ్ ఫ్యాట్‌ను ఎక్కువగా తీసుకోవలసి ఉంటుంది. అదే సమయంలో మహిళలు పూర్తిగా దీన్ని తిరస్కరించాలి. న్యూట్రిషనిస్ట్‌లు చెప్తున్న ప్రకారం... పురుషులు ఎంత వీలైతే అంతకాలం తాము తీసుకునే మొత్తం ఆహారంలో కొవ్వుగలిగిన ఆహారం 15శాతం మించకుండా చూడగలిగితే... సాట్యురేటెడ్ ఫ్యాట్ వీరికి హాని చేయదు. నిజానికి తక్కువ పరిమాణంలో సాట్యురేటెడ్ ఫ్యాట్ తీసుకోవడం టెస్టోస్టిరాన్ నష్టాన్ని నివారిస్తుంది కూడా. 
 
 ఉప్పు వద్దు...
 
 చాలామంది ఉప్పుకు దూరంగా ఉండడం మంచిదనుకుంటారు. అది తమ దేహానికి నష్టం చేస్తుందనుకుంటారు. అయితే శరీరం కొన్ని విధులు నిర్వర్తించడానికి ఉప్పు తప్పనిసరి. ఒకవేళ ఎక్కువ స్థాయిలో ఉప్పు వినియోగిస్తున్నట్టయితే పొటాషియం కూడా అధికంగా వినియోగించాలి. అలా చేయడం ద్వారా సోడియం-పొటాషియం స్థాయులు స్థిరంగా ఉంటాయి. ఇది ఎక్కువ సాల్ట్ వినియోగం ద్వారా కలిగే నష్టాలను నివారిస్తుంది. 
 
 ఎక్కువ ప్రొటీన్... ఎక్కువ మజిల్
 
 మజిల్‌ను నిర్మించడంలో ప్రొటీన్ కీలకపాత్ర పోషిస్తుందనేది నిజం. అంతమాత్రాన అధికంగా ప్రొటీన్ తీసుకుంటే అదంతా మజిల్‌గా మారదు. ఫిట్‌నెస్ నిపుణులు చెప్తున్న ప్రకారం...మీకు రోజువారీ అవసరమైన ప్రొటీన్ ను తీసేసుకున్న తర్వాత... అదనంగా తీసుకున్న ప్రొటీన్ అదనపు మజిల్‌ను అందించదు. అనవసరంగా తీసుకున్న ప్రొటీన్ శక్తి నిల్వగా మారుతుంది. అంతేకాదు అది ఫ్యాట్‌గా రూపాంతరం చెందే ప్రమాదమూ లేకపోలేదు. 
 
 వయసుతో పాటు మజిల్‌మాస్ కోల్పోవలసిందే...
 
 మజిల్‌ను నష్టపోవడంలో వయసుది ప్రధానపాత్ర అయినా... వర్కవుట్స్‌కి సముచిత ప్రాధాన్యత ఇచ్చేవారి విషయంలో ఇది నిజం కాదు. సామర్థ్యంతో చేసే ఎక్సర్‌సైజ్‌లతో వయసు ప్రభావాన్ని బాగా తగ్గించవచ్చు. మజిల్ టిష్యూని యాక్టివ్‌గా ఉంచడానికి రోజువారీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్లాన్‌కు మంచి ఆహారాన్ని కూడా జోడించడం అవసరం. 
 
 నిద్రలేమిని వారాంతంలో భర్తీ చేసుకోవచ్చు...
 
 చాలామంది రోజువారీ నిద్రకు తగిన సమయం కేటాయించకుండా... వారాంతంలో అదనపు గంటలు నిద్రపోవడం ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు అనుకుంటారు. ఆదివారం రోజు ఓ 10గంటల పాటు సుదీర్ఘనిద్రకు సిద్ధపడతారు. అయితే ఇది సరి కాదు. రోజువారీ దినచర్యల కారణంగా నిద్రపోవడం - మేల్కోవడం... నిర్ణీతవేళలకు దేహం అలవాటు పడుతుంది. దానికి భిన్నంగా వారంలో ఒకరోజును గడపడం  వలన మేలు కంటే కీడే జరుగుతుంది. అంతేకాదు, రోజువారీ కలిగే నిద్రలేమి అనేది బరువు పెరగడానికి కూడా దోహదం చేస్తుందని గుర్తుంచుకోవాలి. 
 
 వ్యాయామం విషయంలో ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం అవసరం.  లేని పక్షంలో అపోహలు అలాగే ఉండిపోతాయి. వైద్యులు, నిపుణులు చెప్తున్న ఇలాంటి అంశాలను విశ్లేషించుకుని వాటిని మన జీవనశైలిలో భాగంగా మార్చుకుంటూ... వ్యాయామం కొనసాగిస్తే... చక్కని ఫలితాలు తథ్యం.
 
 - ఎస్.సత్యబాబు
 
 ఎగ్‌వైట్స్ అత్యుత్తమం...
 చాలామంది అనుకుంటున్నట్టు గుడ్లు బాగా కొలెస్ట్రాల్ అందిస్తాయి. ఈ నమ్మకం తో తమ రోజువారీ ఆహారంలో దీనిని భాగం చేసుకోరు. అయితే వాస్తవం ఏమిటంటే గుడ్డులోని పచ్చసొన అనేది ప్రోటీన్ కాకుండా మిగిలిన పోషకాలతో నిండి ఉన్న భాగం. దీన్ని వదులుకోవడం అంటే విటమిన్లను, పోషకాలను కోల్పోతున్నట్టే. డాక్టర్లు చెప్తున్న ప్రకారం... అతిగా కొలెస్ట్రాల్ సమస్యలు లేనివారెవరైనా సరే ఒకటి లేదా రెండు గుడ్లు  డైట్‌లో భాగం చేసుకోవడం మంచిది. అంతకన్నా మించితే ఎగ్‌వైట్స్‌కు పరిమితమవ్వాలి.
 
>
మరిన్ని వార్తలు