అమ్మో! సత్యవతమ్మ చూస్తుంది..!

25 Sep, 2019 01:22 IST|Sakshi

స్వచ్ఛత – శుభ్రత

తన ఇల్లే కాదు కాలనీల రోడ్లూ అద్దంలా ఉండాలని సత్యవతమ్మ తపన. అందుకే, తెల్లవారకముందే రోడ్డెక్కుతుంది. కూడళ్ల వద్ద కాపుకాస్తుంది మున్సిపల్‌ ఆటోలు వస్తున్నాయా లేదా చెక్‌ చేస్తుంది. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు అందిస్తుంది ఇదంతా ఎందుకంటే.. రోడ్ల మీద, కూడళ్లలో ఎవ్వరూ చెత్త వేయకూడదు. ఇప్పుడిక అక్కడ ఎవరైనా చెత్త వేయడం కాదు వేయాలనే ఆలోచనే మానుకున్నారు. ఎందుకంటే చెత్త వేస్తే.. ‘అమ్మో, సత్యవతమ్మ చూస్తుంది’ అని వారికి భయం.

సత్యవతి...  జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో ఈ పేరు తెలియనివారుండరు. ఎందుకంటే నిరంతరం చెత్త సమస్యపై మున్సిపల్‌ కార్యాలయం, తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వినతిపత్రాలు అందిస్తుంటోంది. అధికారులే కాదు ప్రజాప్రతినిధులనూ కలిసి చెత్త సమస్యకు పరిష్కారం చూపమంటూ డిమాండ్‌ చేస్తుంటోంది. ఇటీవలి కాలంలో తమ కాలనీలో చెత్త సమస్యకు ఆమె ఓ పరిష్కారం చూపింది. మున్సిపల్‌ నుంచి ఆటో రెగ్యులర్‌గా నడపాలని, రోడ్డుపై, కూడళ్ల వద్ద ఎవ్వరూ చెత్త వేయకుండా చూసే బాధ్యత తనదంటూ సత్యవతి శపథం చేసింది. కూడళ్ల వద్ద  చెత్త వేస్తే రూ.50 జరిమానా విధిస్తామంటూ ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసింది. అంతటితో ఆగకుండా ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచే ఆమె ఆ కూడళ్ల వద్ద కాపుకాస్తోంది. దీంతో ‘అమ్మో సత్యవతమ్మ చూస్తుంది’ అన్న భయంతో కాలనీ వాసులు చెత్త వేయడం మానేశారు. పొరపాటున ఎవరైనా తను చూడనపుడు చెత్త వేస్తే ఆమె స్వయంగా వెళ్లి ఆ చెత్తను తీసి ఆటోల్లో వేసి వస్తుంటుంది.

ఏడుపదుల వయసులోనూ..
కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో నివసించే డి.సత్యవతి కుటుంబం భువనగిరి నుంచి 1975లో కామారెడ్డికి వలస వచ్చింది. కొన్నాళ్లు ప్రైవేటు పాఠశాలను నడిపింది. 1985లో పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన సత్యవతి ఐదేళ్ల పాటు పనిచేసింది. పంచాయతీ సభ్యురాలిగా పనిచేసిన సమయంలో, తరువాతి కాలంలోనూ ఆమె సామాజిక బాధ్యతను విస్మరించలేదు. తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగుతోంది. ఏడు పదుల వయసులోనూ ఆమె నిరంతరం సామాజిక సమస్యలపై సమరం సాగిస్తోంది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొనే పారిశుద్ధ్యం సమస్య, తాగునీటి సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంది. ఏడు పదుల వయసులోనూ ఆమె తన మార్గాన్ని వీడకుండా ప్రజల సమస్యలపై స్పందిస్తోంది. ‘ప్రజాప్రతినిధులు, నాయకులు మున్సిపల్‌ కార్మికులను తమ ఇళ్లలో ఊడిగం చేయించుకుంటున్నారని, వారిని వదిలేస్తే పారిశుద్ధ్య సమస్య ఉండద’ని సత్యవతి చెబుతుంటోంది.

అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి ఈ సమస్యపై వందల సార్లు ఫిర్యాదులు చేశానని, ఎవరూ దీనిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయినా, తన పట్టుదల విడువనని చెబుతోంది సత్యవతమ్మ. తాను నివసించే శ్రీరాంనగర్‌ కాలనీ డెవలప్‌మెంట్‌ వర్కింగ్‌ కమిటీకి అధ్యక్షురాలిగా సత్యవతి కాలనీలోని సమస్యలపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని చెబుతోంది. మున్సిపల్‌లో అక్రమాలపై కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ పంచుతుంటుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం, కాని పక్షంలో నిరసన తెలుపుతూ తన పంథాను కొనసాగించడం సత్యవతమ్మ ముందున్న మరో పని.

ఇంటింటికీ తిరుగుతూ..
శ్రీరాంనగర్‌ కాలనీలో స్థానికులు పలు కూడళ్లు, రోడ్లపై చెత్త వేయడంతో అక్కడ వాతావరణం అపరిశుభ్రంగా తయారవుతోందని గుర్తించిన సత్యవతమ్మ చెత్త వేయవద్దని కాలనీ వాసులకు ఇంటింటికీ తిరుగుతూ విన్నవించింది. అయినా చాలా మంది చెత్త వేస్తుండడంతో ఆమె సొంత డబ్బులతో ఫ్లెక్సీలు, బోర్డులు తయారు చేయించి ఆ కూడళ్ల వద్ద కట్టింది. అంతటితో ఆగకుండా ప్రతిరోజూ తెల్లవారుజామునే ఆమె కూడళ్ల వద్ద తిరుగుతూ ఎవరూ చెత్త వేయకుండా కట్టడి చేస్తుంటుంది. పొరపాటున ఎవరైనా చెత్త వేస్తే తానే వెళ్లి ఆ చెత్తను తొలగిస్తూ మున్సిపల్‌ ఆటోలో పడేస్తున్న సత్యవతమ్మను చూసి ఎవరూ చెత్త వేయడానికి సాహసించడం లేదు. సత్యవతమ్మ తపనను అర్థం చేసుకున్న కాలనీల వాసులు తమ చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉండాలనే అవగాహనను ఏర్పరచుకున్నారు. దీంతో ఇంతకాలం చెత్తతో అధ్వాన్నంగా తయారైన ఆ కూడళ్లు ఇప్పుడు పరిశుభ్రంగా మారాయి.
సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి
ఫోటోలు: అరుణ్

►చెత్తను ఎక్కడ చూసినా ఇబ్బందే. మా కాలనీలలో అలాగే కనిపించేది. పేరుకుపోయిన చెత్త తీసేయాలని అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయాను. అయినా నా ప్రయత్నం మానలేదు. మున్సిపల్‌ ఆటోలోనే చెత్త వేయాలని కాలనీ వాసులకు నచ్చజెప్పాను. మొదట్లో నా మాటలు వినిపించుకోకపోయినా ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు. అయినప్పటికీ మానవనైజం నిర్లక్ష్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే చెత్త వేయకూడదంటూ బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చే సి నియంత్రించే ప్రయత్నం చేశాను. మున్సిపల్‌ కార్మికులు ప్రజాప్రతినిధులు, నాయకుల ఇళ్లలో పనిచేస్తున్నారు. వారిని విముక్తి చేయాలి. ఇప్పుడు ఉన్న కార్మికులు పట్టణానికి సరిపోవడం లేదు. ఎవరో ఒకరు పూనుకుంటేనే ఎంతటి సమస్య అయినా పరిష్కారమవుతుంది.

సత్యవతమ్మ, స్వచ్ఛ సేవకురాలు, కామారెడ్డి

మరిన్ని వార్తలు