గీకే మిషన్లదే... గిరాకీ !

20 Nov, 2016 23:10 IST|Sakshi
గీకే మిషన్లదే... గిరాకీ !

కరెన్సీ రూపంలో చెల్లించకుండా, షాపులో ప్లాస్టిక్ కార్డు గీకడం ద్వారా చెల్లింపులు జరపడానికి ఇవాళ అందరూ షాపుల్లో వాడుతున్న మిషన్లను ‘ఎలక్ట్రానిక్ డ్రాఫ్ట్ క్యాప్చర్ (ఇ.డి.సి)’ మిషన్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే, స్వైప్ కార్డ్ మిషన్. చైనాలో... సగటున ప్రతి 25 మందికి ఒక స్వైప్ మిషన్ ఉంది. మలేసియాలో సగటున ప్రతి 31 మందికీ, బ్రెజిల్‌లో ప్రతి 200 మందికీ ఒక మిషన్ ఉన్నాయి. కానీ, మన దేశంలో మాత్రం ఇప్పటికీ ఈ స్వైప్ మిషన్ల సంఖ్య తక్కువే. ఇక్కడ సగటున ప్రతి 900 మందికీ ఒక స్వైప్ మిషన్ ఉంది. 14.4 లక్షలు... ఈ ఏడాది జూలై నాటికి మన దేశవ్యాప్తంగా ఉన్న కార్డ్ స్వైప్ మిషన్ల సంఖ్య.

తాజాగా ఈ పెద్ద నోట్ల రద్దు దెబ్బతో చేతిలో డబ్బులు లేక, జనమంతా కార్డుల వినియోగాన్ని ఆశ్రయిస్తున్నారు. చాలామంది చిల్లర వర్తకులు ఇప్పుడు కార్డ్ స్వైప్ మిషన్లు ఆర్డర్ చేస్తున్నారు. కాలేజ్ క్యాంటీన్లు, చిన్న స్థాయి వర్తకులు, టోకు వ్యాపారులు - ఇలా అందరూ ఆర్డర్ చేస్తుండడంతో, ఈ గీకే మిషన్ల గిరాకీ రెట్టింపయింది. దాంతో, కార్డ్ స్వైప్ మిషన్ల సంఖ్య దాదాపు 60 శాతం మేర పెరుగుతాయని అంచనా. ఏ.టి.ఎం.లలో డబ్బులు, మార్కెట్‌లో చిల్లర దొరకడం కష్టమవడంతో తాజాగా క్రెడిట్ కార్డుల వినియోగం ఒకే రోజులో 60 శాతం పెరిగింది. డెబిట్ కార్డులపై ఖర్చు చేయడం 108 శాతం ఎక్కువైంది.

మరిన్ని వార్తలు