క్రిస్పర్‌తో అందరికీ సరిపోయే మూలకణం!

20 Feb, 2019 00:41 IST|Sakshi

శరీరంలోని ఏ కణంగానైనా, అవయవంగానైనా మారిపోగల సామర్థ్యం మూలకణాల సొంతం. అయితే ఒకరి మూలకణాలు ఇంకొకరికి సరిపోవు. అందరికీ సరిపోయేలా మూలకణాలను తీర్చిదిద్దగలిగితే.. ఎన్నో వ్యాధులకు సమర్థమైన చికిత్స అందించడం వీలవుతుంది. ఈ అద్భుతాన్ని సాధించారు కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ సార్వత్రిక మూలకణాలు రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పి పనిచేయడం ఇంకో విశేషం. పెద్దల్లోని మూలకణాలను పిండ మూల కణాల లక్షణాలు కనపరిచేలా చేయగలరని దశాబ్దం క్రితం ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి వాటిని సమర్థంగా వాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే నాణ్యత.. పునరుత్పత్తి విషయంలో కొన్ని సమస్యలు రావడంతో విస్తృత వినియోగంలోకి రాలేకపోయాయి.

ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తలు జన్యు ఎడిటింగ్‌ టెక్నాలజీ క్రిస్పర్‌ను ఉపయోగించి ఏ మూలకణాన్నైనా పిండ మూల కణాల లక్షణాలు కనిపించేలా మార్చగలిగారు. ఇందుకోసం రెండు జన్యువులను పనిచేయకుండా చేశామని, సీడీ47 అనే జన్యువు ద్వారా ఎక్కువ మోతాదులో ప్రొటీన్లను ఉత్పత్తి చేయించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకున్నామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డ్యూస్‌ తెలిపారు. జంతువులపై జరిగిన పరిశోధనలు సంతప్తికరంగా ఉన్నాయని వివరించారు. అంతేకాకుండా.. ఈ కొత్త సార్వత్రిక మూలకణాలతో తాము గుండె కండర కణాలను తయారు చేశామని.. ఎలుకల్లోకి వీటిని జొప్పించి పరిశీలించామని వివరించారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు