మూర్తీభవించిన వ్యక్తిత్వవికాసం

24 Aug, 2017 00:06 IST|Sakshi
మూర్తీభవించిన వ్యక్తిత్వవికాసం

ఆత్మీయం

శ్రీకృష్ణుని రూపం నల్లటిది. కాని మనసు మాత్రం తెల్లనిది, స్వచ్ఛమైనది. బాల్యం నుంచి – ఆ మాటకొస్తే పుట్టకముందు నుంచే ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు? ఎన్ని సవాళ్లను అధిగమించాడు? కన్నతల్లిదండ్రులకు దూరమయ్యాడు. కడుపులో పెట్టుకుని కాపాడవలసిన మేనమామే శత్రువై సంహరింప చూసినా చలించక తామరాకు మీది నీటిబొట్టులా ఉన్నాడు. దేనికీ భయపడలేదు, ఎవరికీ లొంగలేదు. వెన్నుచూపలేదు. కార్యసాధన అంటే ఏమిటో చాటి చెప్పాడు. శరణన్న వారికి సదా రక్షణ వహించాడు. సహాయం కోరిన వారికి ఒట్టి చెయ్యి ఎప్పుడూ చూపించలేదు.

మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీసివేయాలని, తగిన ఉపాయముంటే ఎంతటి అపాయం నుంచయినా బయట పడవచ్చునని రుజువు చేసి చూపాడు. అవసరమయిన చోట మహిమలు చూపాడు. యుద్ధంలో విజయం సాధించడానికి భుజబలమే కాదు, బుద్ధిబలం ఉంటే చాలునని కొన్ని అక్షౌహిణుల సేనను, రథ, గజ, తురగ పదాతి దళాలను కౌరవుల పరం చేసి, తానొక్కడు మాత్రం పాండవుల పక్షం వహించి, వారిని విజయం వైపు నడిపించి నిరూపించాడు. అసలైన వ్యక్తిత్వ వికాసమంటే ఏమిటో గీత ద్వారా బోధించి చూపాడు. శ్రీకృష్ణుని లీలలు తెలుసుకోవడమే కాదు, ఆయన మంచితనాన్ని, ఉన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన చేసిన గీతాబోధను ఆకళింపు చేసుకోవాలి. అర్థం అయిన వాటిని వ్యర్థం చేయకూడదు. ఆచరణలో పెట్టగలగాలి. అప్పుడే మనం కృష్ణునికి ప్రియభక్తులమవుతాం.

మరిన్ని వార్తలు