అవును 30... అయితే ఏంటి?

8 Nov, 2019 02:56 IST|Sakshi

‘‘పెళ్లెప్పుడు?!’’ అని అడిగే వాళ్లకు సరదాగా ఉంటుంది. చెప్పేవాళ్లకే చిర్రెత్తుకొస్తుంటుంది. ‘‘ముప్పయ్‌ ఏళ్లు వచ్చాయి, ఇక పెళ్లి చేసుకో’’ అని ఎమ్మా వాట్సన్‌కు హితులు, సన్నిహితుల నుంచి పోరు ఎక్కువైంది. ‘‘నాకు 29 దాటాయి, సంతోషంగా ఉన్నాను. సింగిల్‌గా ఉండడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. నాకు పార్టనర్‌ లేరని ఎవరన్నారు! నాకు నేనే పార్టనర్‌ని. సెల్ఫ్‌ పార్టనర్డ్‌ పర్సన్‌’’ అని ఒక పోస్ట్‌లో అందరికీ కలిపి ఒకే సమాధానమిచ్చింది ఎమ్మా. ఎమ్మా వాట్సన్‌ బ్రిటిష్‌ నటి. ప్యారిస్‌లో పుట్టింది.

హ్యారీ పోటర్‌ సినిమాలు చూసిన వాళ్లకు హర్మియోన్‌ గ్రేంజర్‌ పాత్రలో ఆమె తెలిసే ఉంటుంది. హ్యారీ పోటర్‌ సీరీస్‌తో ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా నేమ్‌ అండ్‌ ఫేమ్‌ వచ్చి పడింది. డబ్బు కూడా ఇబ్బడిముబ్బడిగా వచ్చింది. ఆమె కష్టాలూ అప్పటి నుంచే మొదలయ్యాయి. ఆమె పెళ్లెప్పుడు చేసుకుంటుందో? ఎవరిని పెళ్లి చేసుకుంటుందోనని ఒక చూపు ఆమె మీద పెట్టేసింది అక్కడి మీడియా. ఆమెను వెంబడిస్తూ, రహస్యంగా ఆమె కదలికలను ఫొటో తీసే పాపరాజ్జిలు కూడా ఎక్కువైపోయారు.

ఆమె ఏ వేడుకలో కనిపించినా సరే... ఆమెతో మరెవరైనా వచ్చారా అని అందరి కళ్లూ వెతకడమూ ఎక్కువైంది. ఇంత గందరగోళాన్ని భరించలేక ఇప్పుడామె సోషల్‌ మీడియాలో ఈ ‘పెళ్లి పోస్ట్‌’ పెట్టారు. అమ్మాయి విషయంలో ఇంగ్లండ్‌ అయినా ఇండియా అయినా ఒక్కటే కాబోలు. ఆమె పెళ్లి బాధ్యత తమ భుజాల మీదనే ఉన్నట్లు సమాజం ఒత్తిడి తెస్తుంటుంది. అందుకే అంత సున్నితంగా, కొంచెం ఘాటుగా బదులిచ్చింది ఎమ్మా. అందుకు కారణం తన కెరీర్‌ని ఆమె గాఢంగా ప్రేమిస్తుండటం. తనపై తాను కాన్ఫిడెంట్‌గా ఉండటం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు