ఆనంద బాష్పాల అంతుచిక్కిందా?!

25 Nov, 2014 22:55 IST|Sakshi
ఆనంద బాష్పాల అంతుచిక్కిందా?!

బాధాకరమైన సందర్భంలో, మనసుకు కష్టం కలిగినప్పుడే కాదు... అత్యంత ఆనందకరమైన సమయంలో కూడా వచ్చేది కన్నీరే. వీటినే మనం ఆనంద బాష్పాలుగా చెప్పుకొంటాం. సాధారణంగా పెళ్లిళ్లలో కూతురిని సాగనంపినప్పుడు, క్రీడాకారులు ఒక గొప్ప ఫీట్‌ను సాధించినప్పుడు, ఏ వ్యక్తి అయినా జీవిత సాఫల్యతను సాధించానని భావించినప్పుడు... కళ్లు వర్షిస్తాయి. మరి ఎందుకలా... అనే అంశం గురించి పరిశోధన నిర్వహించారు యేల్ విశ్వవిద్యాలయం వాళ్లు. అలా ఎందుకు జరుగుతుందనే అంశం గురించి కొంత వివరణ కూడా ఇచ్చారు... సంతోషకరమైన సమయాల్లో కన్నీరు పెట్టుకోవడం ఒకింత అసంకల్పిత ప్రతీకార చర్యగానే అభివర్ణించారు. భావోద్వేగ సమతుల్యత సాధించడానికే ఇలా కన్నీరు పెట్టుకోవడం జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.

ఒక్కసారిగా కలిగే ఆనందాన్ని తట్టుకోలేని సమయంలో... ఇలా కన్నీరు పెట్టుకోవడం ద్వారా మనసు కొంత వరకూ తేలికపడుతుందని వివరించారు. ఆనందకరమైన సమయాల్లో కన్నీరు రావడం అంటే అది భావోద్వేగం తీవ్ర స్థాయికి చేరిందనడానికి నిదర్శనమని తెలిపారు. అంతే కాదు... మనిషి అసహాయ స్థితిలో, బాగా నిరాశ పడ్డ సమయంలో కూడా ఒక నవ్వు నవ్వుతాడు. దాన్ని వెర్రినవ్వుగా చెప్పుకొంటాం. సంతోషకరమైన స్థితిలో కన్నీరు రావడం, నిస్సహాయ స్థితిలో నవ్వడం.. ఈ రెండూ కూడా పరస్పర భిన్నమైన భావాలు, భావోద్వేగ సమతుల్యత కోసం మనసు అంతర్గత స్పందనకు ఇవి నిదర్శనాలు అని యేల్ పరిశోధకులు వివరించారు.
 
 

మరిన్ని వార్తలు