పులినోట పసిబిడ్డ

1 Jun, 2019 07:35 IST|Sakshi

బాలామృతం... తల్లిపాలు! బిడ్డకు ఆర్నెల్లు వచ్చేవరకు విధిగా తల్లిపాలు ఇవ్వాలి. తర్వాత బిడ్డకు రెండేళ్ల వయసు వచ్చేవరకు కొనసాగించవచ్చు... డాక్టర్లు... ఆరోగ్యకార్యకర్తలు, ఎన్‌జీవోలు, ప్రభుత్వాలు కూడా ఈ మాటలే చెప్తున్నారు.. చెప్తున్నాయి. ‘‘టైగర్స్‌’’ అచ్చంగా ఈ అంశంమీద తీసిన సినిమా కాకపోయినా దీనికి సంబంధించింది. బిడ్డకు పాలిస్తున్న తల్లులకు డబ్బాపాలను పరిచయం చేసి... వాటిని వాడితేనే పిల్లలు బొద్దుగా.. ముద్దుగా తయారవుతారని చెప్పి... వందల మంది పసిపిల్లల చావులకు ప్రత్యక్షంగా కారణమైన ఓ మల్టీనేషనల్‌ బేబీ ఫుడ్‌ కంపెనీ నిర్వాకం.. పరోక్షంగా పనిచేసిన డాక్టర్ల లాలూచీ... ఈ రెండిటికీ వారధిగా ఉన్న ఓ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ పోరాటం... ఈ సినిమా!

1990ల్లో పాకిస్తాన్‌లో వాస్తవంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా  2014లో ‘‘టైగర్స్‌’’ను తెరకెక్కించారు భారతీయ చలనచిత్ర నిర్మాతలు. బోస్నియన్‌ డైరెక్టర్, ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ‘‘డానిస్‌ టానోవిచ్‌’’ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో స్క్రీన్‌ అయింది.. ప్రశంసలూ అందుకుంది.. కాని మన దేశంలో మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు జీ5లో స్ట్రీమ్‌ అవుతోంది.

సినిమాలోకి...
అయాన్‌ (ఇమ్రాన్‌ హష్మి)... మెడికల్‌ రిప్రజెంటేటివ్‌. పాకిస్తానీ ఫార్మాసూటికల్‌ కంపెనీల మందులు ప్రమోట్‌ చేస్తూంటాడు. కానీ స్థానిక డాక్టర్ల దగ్గర్నుంచి సరైన స్పందన ఉండదు. మల్టీనేషనల్‌ కంపెనీల ప్రొడక్ట్స్‌ అయితేనే ప్రిస్క్రైబ్‌ చేస్తామంటూంటారు. మందుల ఆర్డర్లు రాకపోయినా.. ఆ ఊళ్లోని డాక్టర్లు, వాళ్ల ప్రాక్టీస్‌ పట్లయితే అవగాహన వచ్చేస్తుంది అయాన్‌కి. భార్య.. జైనాబ్‌ (గీతాంజలి థాప), అమ్మ (సుప్రియా పాఠక్‌), నాన్న (వినోద్‌ నాగ్‌పాల్‌), ఇద్దరు తమ్ముళ్లు అతని కుటుంబం. తండ్రి డాక్యుమెంట్‌ రైటర్‌. ఒకసారి ఓ వార్తాపత్రికలో పడిన ప్రకటనను అయాన్‌కు చూపిస్తుంది భార్య. టైప్‌ రైటింగ్‌ కూడా వచ్చిన చదువుకున్న వ్యక్తి ఆమె. ఆసక్తిగానే ఆ ప్రకటన చూసి అంతే నిరాశతో ఆ పేపర్‌ను మడతపెట్టేస్తాడు. ‘‘ఏమైందీ?’’ అడుగుతుంది జైనాబ్‌. ‘‘గ్రాడ్యుయేట్స్‌ కావాలట’’ చెప్తాడు. ‘‘ట్రై చేసి చూడు.. తప్పకుండా సెలెక్ట్‌ అవుతావ్‌’’ నమ్మకమిస్తుంది ఆమె. పాకిస్తాన్‌లో లాంచ్‌ చేయబోయే తమ ‘బేబీ ఫుడ్‌’ కంపెనీకి సమర్థులైన మెడికల్‌ రిప్స్‌ కావాలని ఓ మల్టీనేషనల్‌ కంపెనీ ఇచ్చిన ప్రకటన అది.

వాళ్లు అడిగిన అన్ని అర్హతలూ ఉంటాయి అయాన్‌కు ఒక్క గ్రాడ్యుయేషన్‌ తప్ప. అయినా ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ ఏరియాలో ఆ కంపెనీ మార్కెటింగ్‌కి అధిపతి బిలాల్‌ (అదిల్‌ హుస్సేన్‌). అతను అడిగిన ప్రశ్నకు తప్పు జవాబు చెప్పాడని అయాన్‌ను రిజెక్ట్‌ చేస్తాడు బిలాల్‌. ‘‘నేను తప్పు చెప్పలేదు. అయినా మీకు కావల్సింది  మీ క్వశ్చన్స్‌కు కరెక్ట్‌ ఆన్సర్‌ ఇచ్చేవాళ్లా? లేక మీ ప్రొడక్ట్స్‌ సేల్స్‌ పెంచేవాళ్లా?’’ అని సూటిగా అడిగి బిలాల్‌ను ఇంప్రెస్‌ చేస్తాడు. ఉద్యోగం దక్కించుకుంటాడు. అయాన్‌కు మెడికల్‌ డెలిగేట్‌ అనే హోదా  ఇచ్చి.. ఆ ఏరియా సేల్స్‌ విభాగాన్ని అప్పగిస్తారు. తమ ప్రొడక్ట్‌ను ప్రిస్క్రైబ్‌ చేసేందుకు డాక్టర్లకు ఫ్రీ సాంపుల్స్‌తోపాటు ఖరీదైన కానుకలను అందిస్తుంటారు కంపెనీ వాళ్లు. దాంతో ఆ పట్టణంలోనే కాదు.. పాకిస్తాన్‌లోని చాలా ఊళ్లల్లో పీడియాట్రిషన్స్‌ అంతా తల్లిపాలు మాన్పించేసి ఈ పాలడబ్బాలను సూచిస్తుంటారు. అయాన్‌ తమ కంపెనీ పాలడబ్బాలను ప్రమోట్‌ చేయమని సంప్రదించిన డాక్టర్లలో డాక్టర్‌ ఫయాజ్‌ (సత్యదీప్‌ మిశ్రా) ఒకరు. కొన్నాళ్లకే అతను కరాచీ వెళ్లిపోతాడు స్పెషలైజేషన్‌ కోసం.

కథ అడ్డం తిరుగుతుంది...
డాక్టర్‌ ఫయాజ్‌  కరాచీ నుంచి తిరిగి వచ్చేసరికి ఇక్కడ అయాన్‌ చాలా ఎదుగుతాడు. ఆ బేబీ ఫుడ్‌ కంపెనీని ఆ ప్రాంతంలో లాభాల్లో నడిపిస్తుంటాడు తన మార్కెటింగ్‌ స్కిల్స్‌తో. సంపాదన పెరుగుతుంది. ఊళ్లో తన పరపతీ పెరుగుతుంది. పెద్ద ఇల్లు కొంటాడు. కొడుకు పుడ్తాడు. కుటుంబం సంతోషంగా ఉంటూంటుంది. ‘‘బేబీ ఫుడ్‌ లాభాల్లో ఉన్నట్టుంది..గుడ్‌ ’’ అంటాడు డాక్టర్‌ ఫయాజ్‌ తనను కలవడానికి ఆసుపత్రికి వచ్చిన అయాన్‌తో. ఆ మాటలో ఏదో వ్యంగ్యం వినిపిస్తుంది అయాన్‌కి. ‘‘సరే.. నేను వెళ్తా’’ అని అయాన్‌ వెళ్లబోతుంటే.. ‘‘ఫయాజ్‌.. ఆ పిల్లాడికి సీరియస్‌గా ఉంది’’ అంటూ లేడీ డాక్టర్‌ వచ్చింది. వెంటనే అలర్ట్‌ అయిన ఫయాజ్‌ ‘‘నాతో రా’’ అంటూ అయాన్‌నీ లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ.. నాలుగు నెలల పిల్లాడు.. డీ హైడ్రేషన్‌తో చిక్కి శల్యమై.. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ఆ పిల్లాడికి చికిత్సచేసి  కన్సల్టేషన్‌ రూమ్‌లోకి ఫయాజ్‌ వెళ్తూండగా అడుగుతాడు అయాన్‌.. ‘‘ఏమైంది ఆ పిల్లాడికి?’’ అని. ‘‘మీరు ప్రమోట్‌ చేసే డబ్బా పాల వల్ల ఆ బిడ్డ డీ హైడ్రేట్‌ అయ్యాడు. నిక్షేపంగా తల్లిపాలు తాగుతున్న ఆ బిడ్డకు మీ కంపెనీ పాలడబ్బాను ప్రిస్క్రైబ్‌ చేసి తల్లిపాలు అందకుండా చేశారు. అయాన్‌... ఇక్కడున్నప్పుడు నువ్వు చెప్పినట్టే నేనూ ఆ డబ్బాపాలనే ప్రమోట్‌ చేశా.. కరాచీ వెళ్లాక తెలిసింది నేనెంత పెద్ద తప్పు చేశానో అని. కనీసం తాగడానికి శుభ్రమైన నీళ్లు దొరకని దేశం ఇది. కలుషితమైన నీటిలోనే ఈ పౌడర్‌ కలిపి పిల్లలకు తాగించడం వల్ల.. వందలమంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు తెలుసా?’’ చెప్తాడు డాక్టర్‌ ఫయాజ్‌. ఆ మాట విని హతాశుడవుతాడు అయాన్‌.

బాధ్యత వహించం..
కలత మనసుతోనే ఇంటి దారి పడ్తాడు అయాన్‌. దార్లో స్లమ్స్‌లో ఉండే తల్లులు.. మురికిగా ఉన్న ప్లాస్టిక్‌ క్యాన్లలోని నీటితోనే పాలపొడి కలిపి.. ఆ పాలను పిల్లలకు పట్టించడం కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ ఊళ్లో కూడా వందల సంఖ్యలో పసిపిల్లలు అనారోగ్యం పాలవడం.. ఆసుపత్రిలో చేరడం.. ప్రాణాలు పోవడం.. సాధారణమవుతుంది. ఈలోపే అయాన్‌కు కూతురు పుడ్తుంది. చనిపోతున్న పిల్లల్లో తన పిల్లలు కనిపిస్తుంటారు. ఒక నిశ్చయానికి వచ్చిన అయాన్‌  ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడమే కాక ఆ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటానికీ దిగుతాడు. కుటుంబమూ అర్థం చేసుకొని అతనికి సపోర్ట్‌ చేస్తుంది. వెన్నంటే ఉంటాడు డాక్టర్‌ ఫయాజ్‌.  ఆ కంపెనీ మీద వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌కు కంప్లయింట్‌ ఇస్తాడు. అది పెద్ద దుమారమే రేపుతుంది. దాని ప్రభావం కంపెనీ మీదే కాదు.. మెడికల్‌ ప్రాక్టీషనర్ల మీదా పడుతుంది. అందరూ అయాన్‌కు వ్యతిరేకం అవుతారు. బిలాల్‌ అయితే బెదిరింపులకు దిగుతాడు. దాడులు చేయిస్తాడు. అయినా అయాన్‌ వెరువడు.

ఎన్‌జీవో.. డాక్యుమెంటరీ..
ఆ ఊళ్లో పసిపిల్లల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న ఓ ఫారిన్‌ ఎన్‌జీవో సంస్థాపకురాలైన మ్యాగీ (మరియం డి అబో)ని  కలుస్తాడు అయాన్‌. అతనికి సహాయంగా నిలబడుతుంది మ్యాగీ. పాకిస్తాన్‌లో ఆ బేబీ ఫుడ్‌ కంపెనీ వల్ల జరుగుతున్న నష్టం, చనిపోయిన పిల్లల వివరాలు, తల్లుల బాధలు, అయాన్‌ చేస్తున్న న్యాయపోరాటం అన్నిటి గురించి  విదేశీ పత్రికల్లో రాయిస్తుంది మ్యాగీ. ఓ డాక్యుమెంటరీ కూడా తీయిస్తుంది. ఇది యూరప్‌లో వైరల్‌ అవుతుంది. జర్మన్‌ టెలివిజన్‌ రిపోర్టర్‌ ఒకరు ఆ మల్టీ నేషనల్‌ కంపెనీ సిబ్బందినీ ఇంటర్వ్యూ చేస్తారు.. ‘‘పాకిస్తాన్‌  పిల్లల మరణాలకు బాధ్యత వహిస్తారా’’ అని ఆ ఇంటర్వ్యూలో అడుగుతాడు. ‘‘వహించం’’ అంటూ చాలా కఠినంగా జవాబిస్తాడు సిబ్బందిలో ఒకరు. దానికి కౌంటర్‌ పార్ట్‌గా అయాన్‌ను ఇంటర్వ్యూ చేయాలని అతణ్ణి జర్మనీకి పిలుస్తారు. అయితే అంతకుముందే బిలాల్‌ మిలిటరీ ఆఫీసర్‌ ద్వారా అయాన్‌ పిలిపించి.. బెదిరించి ఒక ఒప్పందానికి వచ్చేలా బలవంతపెడతాడు. ఇందులో మిలటరీ ఆఫీసర్‌ జోక్యం చేసుకోవడానికి కారణం ఉంది. అయాన్‌ ఆ బేబీ ఫుడ్‌ను మిలటరీ ఆసుపత్రికి, మిలటరీ క్యాంటీన్‌కు కూడా సప్లయ్‌ చేస్తాడు. ఆ వివరాన్ని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులోనూ పొందుపరుస్తాడు.

దాంతో ఆ మిలటరీ ఆఫీసర్‌ పేరూ బద్నామ్‌ అవుతుంది అన్నమాట. దాన్ని బిలాల్‌ అడ్వంటేజ్‌గా తీసుకొని ఆ మిలటరీ ఆఫీసర్‌ ద్వారా అయాన్‌ను భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. తగ్గట్టుగానే మిలటరీ ఆఫీసర్‌ వ్యవహరిస్తాడు. అయాన్‌.. బిలాల్‌తో బేరం కుదుర్చుకునేలా ఒత్తిడి తెస్తాడు. దాని తాలూకు ఫోన్‌ సంభాషణనంతా బిలాల్‌ రికార్డ్‌ చేస్తాడు. జర్మనీలో అయాన్‌ టెలివిజన్‌  కెమెరా ముందు కూర్చున్న టైమ్‌కి ఆ ఫోన్‌ సంభాషణను టెలివిజన్‌ చీఫ్‌కు వినిపిస్తారు మల్టీనేషనల్‌ కంపెనీ సిబ్బంది. మ్యాగీతో సహా అక్కడున్న అందరూ షాక్‌ అవుతారు. అయాన్‌ నిజాయితీని శంకిస్తారు. కాని అయాన్‌ అసలు విషయం చెప్తాడు. తను బేరం కుదుర్చుకున్న మాట నిజమేనని, అయితే ఆరోజు రాత్రే ఆ విషయాన్ని తన తండ్రితో షేర్‌ చేసుకున్నానని, తండ్రి తిట్టి, వారించాడని, దాంతో ఆ ఒప్పందం జోలికి వెళ్లలేదని, డబ్బు తీసుకోలేదనీ చెప్తాడు.. రుజువు చేస్తాడు కూడా. ఇక్కడితో సినిమా సుఖాంతం అవుతుంది.  ఇంత జరిగినా ఆ మల్టీనేషనల్‌ కంపెనీకి వ్యతిరేకమైన తీర్పేమీ వెలువడదు. కానీ ఆ పోరాటం చేసిన ఆ సేల్స్‌ రిప్రజెంటేటివ్‌.. సయ్యద్‌ ఆమిర్‌ రజా (అసలు పేరు) మాత్రం ఆ దేశం వదిలి వెళ్లిపోయాడు భార్యా పిల్లలను తీసుకొని. ప్రస్తుతం కెనడాలో టాక్సీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు అతను. ఈ విషయాన్ని సినిమాలో చూపించరు.
– సరస్వతి రమ

మరిన్ని వార్తలు