ఈనాటి రోగాలు... ఏనాటివో!

4 Aug, 2014 23:02 IST|Sakshi
ఈనాటి రోగాలు... ఏనాటివో!

పరిశోధన
ఆధునిక జీవనశైలి, అలవాట్ల వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని మనం తరచుగా అంటుంటాంగానీ, అసలు ఈ జీవనశైలి లేని కాలంలో కూడా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయని తాజా పరిశోధన ఒకటి చెబుతోంది. కొంతకాలం క్రితం కొన్ని ఈజిప్ట్ మమ్మీలను సీటీ స్కాన్ చేసి పరిశోధించారు. ఇప్పుడు ఏవైతే గుండెకు సంబంధించిన రుగ్మతలు ఎదుర్కొంటున్నామో, ఆ రకమైనవే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్లు ఎదుర్కొన్నారని పరిశోధనలో బయటపడింది.
 
అయితే ఇది కేవలం ఈజిప్షియన్లకే పరిమితమా? ఇతరులలో కూడా ఉందా? అనే కోణంలో భిన్న సాంస్కృతిక నేపథ్యాలు ఉన్న అయిదు రకాల మమ్మీలను ఇటీవల పరిశోధనకు ఎంచుకున్నారు. పరిశోధన తరువాత తెలిసిన విషయం ఏమిటంటే, ఈజిప్షియన్లతో పోల్చితే మిగిలిన వారు భిన్నంగా ఏమీ లేరని. మంటలతో  పుల్లలు అంటించి అప్పటి మనుషులు పొగ పీల్చేవారు. ఈ విషయంలో మహిళలు ముందు ఉండేవారు. అందుకే గుండెకు సంబంధించిన రుగ్మతలు వారిలో ఎక్కువగా కనిపించాయి.
 
‘‘స్థూలకాయం అనేది నిన్న మొన్నటి సమస్యలాగే మాట్లాడుతుంటాం. నిజానికి ప్రాచీన మానవుల్లో ఆ రోజుల్లోనే ఇది కనిపిస్తుంది’’ అంటున్నారు క్యాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ మెమోరియల్ మెడికల్ డెరైక్టర్ డా.జార్జ్ థామస్.
 
‘‘రోగలక్షణాలు ఒకటే అయినప్పటికీ రోగానికి దారి తీసే ప్రధాన కారణాలు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి’’ అనేది ఆయన విశ్లేషణ. మనతో పోల్చితే ఆనాటి ఈజిప్షియన్లు చురుగ్గా ఉండేవారు, శ్రమించే తత్వం కూడా వారికి ఎక్కువగానే ఉండేది. పిజ్జాలు, మందు, సుఖసాధనాలు లేని ఆకాలంలో ఈనాటి వ్యాధులు ఎలా వచ్చాయి? ఈ సందేహానికి పరిశోధకులు ఇలా చెబుతున్నారు...

‘‘అపరిశుభ్రత, పారిశుధ్యం లోపించడం, కలుషిత నీరు, జంతువులకు దగ్గరగా నివసించడం మొదలైన కారణాలు రిస్క్ ఫ్యాక్టర్‌లుగా ఉండి ఉంటాయి’’.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు