టూకీగా ప్రపంచ చరిత్ర 42

22 Feb, 2015 23:14 IST|Sakshi
టూకీగా ప్రపంచ చరిత్ర 42

నేరం
 
ఆ దశలో, అనుకూలించిన ప్రతిచోటా, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి మానవులంతా ఎక్కడికక్కడ స్థిరనివాసాలకు పనపడిపోయారని తీర్మానించుకోవడం పొరపాటౌతుంది; ఎందుకంటే, సమాజంలో ఏ పరిణామమైనా రెప్పపాటులో జరిగే మాయాజాలంగా ఉండబోదు. క్రీస్తుపూర్వం నాలుగువేల సంవత్సరాల ముందుదాకా స్థిరనివాసాల జనసంఖ్య ప్రపంచ జనాభాలో కేవలం మూడింట ఒకవంతు మాత్రమేనని తెలుసుకుంటే ఆ పరివర్తన ఎంత నింపాదిగా, ఎంత పలుచగా మొదలయిందో మనం సులభంగా ఊహించుకోవచ్చు. ఆ కారణంగానే ఈ నేలమీద ఎదుగుదలకు నోచుకోకుండా పాతరాతియుగం దశలో ఆగిపోయిన తెగలు అక్కడక్కడ ఇంకా మిగిలున్నాయి. ఆస్ట్రేలియాలోని ఆదిమవాసులకు (ఆబొరిజినల్స్‌కు) విల్లనమ్ములు ఎలా ఉంటాయో ఇప్పటికీ తెలీదు.

మానవ సమాజం పురిటినొప్పులు పడుతున్న అదే సమయంలో భూమి ఉపరితలం పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. మంచు కరిగినకొద్దీ సముద్రాల్లో నీటిమట్టం ఎగదన్ని, భూమి బలహీనంగా ఉన్న తావుల్లో కోతలు పెడుతూ నేలను ముక్కలు ముక్కలుగా చీల్చేయడం మొదలెట్టింది. చీలిన ముక్కల్లో కొన్ని మునిగిపోగా, కొన్ని మాత్రం దీవులుగా నిలదొక్కుకుంటున్నాయి. అమెరిగా ఖండాన్ని ఆసియాతో కలిపుంచిన వంతెన నీటిలో మునిగి, చిరునామా లేకుండా కరిగిపోయింది. ఆసియాఖండానికి ఆగ్నేయంలో కలిసుండిన ఆస్ట్రేలియా, న్యూజిల్యాండులు దాన్నుండి చీలిపోయి దూరంగా జరిగిపోతున్నాయి. ఇంగ్లండు, ఐర్లండులు యూరప్ నుండి తెగిపోయి ద్వీపాలుగా ఏర్పడ్డాయి. దక్షిణ భారతదేశం నుండి శ్రీలకం తెగిపోయింది. ఇలా ప్రతి భూఖండం నుండి వందలాది ముక్కలు విడిపోయి దీవులుగా ఏర్పడుతున్నాయి.

ఆ తరువాత, ఆఫ్రికా యూరప్‌లను చీలుస్తూ, మధ్యధరా ప్రాంతంలో అట్లాంటిక్ మహాసముద్రం చొరబడి, అదివరకు అక్కడున్న సరస్సులు రెండింటినీ సముద్రంగా మార్చేసింది. ఆ కోత అంతటితో ఆగకుండా ఇంకా తూర్పుకు విస్తరించి, మధ్యధరా సముద్రాన్ని నల్లసముద్రంతో కలిపేయడంతో ఆసియా ఖండానికి యూరప్‌తో ఉండిన భూమార్గం సంపూర్ణంగా తెగిపోయింది. ఈ దూకుడును ఓర్చుకున్న భూమి, ఎనిమిది తొమ్మిది వేల సంవత్సరాలప్పుడు క్రమంగా ఇప్పుడున్న స్వరూపానికి స్థిరపడింది. జ్ఞాపకశక్తి మొలకెత్తిన బుర్రల్లో ఆనాటి భూగోళంలో ఏర్పడిన అతలాకుతలం, చెప్పుకునేందుకు అర్హమైన మొట్టమొదటి చారిత్రిక సంఘటనగా నమోదైంది.
 బైబిల్లో చెప్పిన ‘నోవా అండ్ ది ఆర్క్’ వృత్తాంతంలో, జలప్రళయం సృష్టించి భూమిమీదున్న సకల జీవరాసులనూ తుడిచిపెట్టాలని దేవుడు సంకల్పించాడు. కానీ, నిజాయితీపరుడైన నోవామీద ఆయనకు జాలి కలిగింది. పెద్ద నౌకను తయారుజేసుకుని ప్రళయం నుండి బయటపడేందుకు సిద్ధం కమ్మని నోవాను దేవుడు ఆదేశిస్తాడు. ఆ నౌకను తిండిగింజలూ తదితర ఆహారపదార్థాలతో నింపుకుని, తానూ తన కుటుంబం యావత్తు అందులో చేరుకోమంటాడు. ప్రతి జంతువు నుండి ఒక పోతు ఒక పెంటి, ప్రతి పక్షి నుండి ఒక పుంజు ఒక పెట్ట ఉండేట్టుగా నౌకలోకి తీసుకోమంటాడు. నలభై రాత్రులూ నలభై పగళ్ళూ వర్షం ఏకధారగా కురిసి, సముద్రాలన్నీ ఏకమై భూమిని ముంచెత్తడంతో జీవరాసులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. నౌకకు చేరిన నోవా కుటుంబం, జంతువులూ, పక్షులూ మాత్రమే మిగిలి, సంతానోత్పత్తితో తరువాతి ప్రపంచాన్ని నింపేస్తాయి.

(పౌరాణిక గ్రంథాల్లో అన్నిటికంటే ముందుదిగా చరిత్రకారులు భావిస్తున్న ‘గిల్‌గమేశ్’లో, ఇదే ఇతివృత్తం, కేవలం పాత్రల పేర్ల మార్పిడితో లిఖితమైవుండడం గమనార్హం)

 రచన: ఎం.వి.రమణారెడ్డి
 
 

మరిన్ని వార్తలు