టూకీగా ప్రపంచ చరిత్ర 52

5 Mar, 2015 23:50 IST|Sakshi
టూకీగా ప్రపంచ చరిత్ర 52

కొత్త ఒరవడి
 
మేలిరకం పనిముట్ల ఆధరువు దొరికిందే తడవుగా చేతివృత్తుల నైపుణ్యం గణనీయంగా పెరిగింది. అది ఏ స్థాయికి పెరిగిందో సూచించే ఉదంతమొకటి మనకు ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఋభువులు అనే ముగ్గురు సోదరులు మానవులు. త్వష్ట దేవతలకు దారుశిల్పి. త్వష్ట ‘చమసము’ అనబడే పాత్రనొకదానిని తయారుచేశాడు. ఆ పాత్రను ఋభువులు నాలుగు పాత్రలుగా చేశారు. త్వష్ట సిగ్గుతో తలదించుకున్నాడు. తమ వృత్తి నైపుణ్యంతో ఋభువులు దేవతలైనారు. ‘చమసము’ అన్నది చెక్కతో నిర్మించిందో లేక లోహంతో నిర్మించిందో చెప్పలేదు గానీ, ‘దారుశిల్పి’ అంటే వడ్రంగి కావడంతో, ఆ విన్యాసానికి ముడిసరుకు కొయ్యదే అయ్యుండాలి.

వడ్రంగంలో సాధించిన ప్రగతి వల్ల ఎంతోకాలంగా మానవుడు కంటున్న కలల్లో మరొకటి ఫలించింది. ఎప్పుడో ఇరవై వేల సంవత్సరాలకు ముందే నిప్పు భయం అతనికి తీరిపోయినా, నీటి బెదురు మాత్రం ఇంకా తగ్గలేదు. నాగరిక జీవితం ముడిపడింది ఎడతెగకుండా పారే నదితో. అందువల్ల, నదిని సాధించితీరాలనేది మానవుని ఆశయమేగాదు, అవసరం కూడా. తీగెలతో దట్టంగా అల్లిన పొడవాటి బుట్టలకు తారు దట్టించి తేలడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని; వెదురు బొంగులకు జంతు చర్మాన్ని సాగదీసిన దొన్నెలతో చేసిన ప్రయత్నాలు కొన్ని; తేలికైన దుంగలను చాపమోస్తరుగా పరిచికట్టిన తెప్పలతో తృప్తిపడిన రోజులు కొన్ని. ఇవన్నీ ప్రవాహానికి అనుకూలంగా పనికొచ్చే సాధనాలేగానీ ఎదురెక్కేందుకు వీలు కలిగించేవిగావు. పనిముట్లు మెరుగుపడటంతో ఇప్పుడు ప్రవాహానికి ఎదురెక్కే తెడ్లపడవ ఉనికిలోకి వచ్చింది. తెడ్లతోపాటు తెరచాపను కూడా వినియోగించుకుంటూ అది మరికొంచెం పెరిగి, కాలగమనంలో మరింత పెద్దదై, నదీముఖాల్లో తేలికపాటి అలలను తట్టుకునేంత పటిష్టమైన, ఒక దశలో సముద్రాన్ని సైతం ఈదగలిగే ‘ఓడ’గా ఎదిగింది.

ఈ ఒరిపిడుల మధ్యన, ఆయా రంగాల్లో నైపుణ్యంవారీగా వృత్తుల్లో పని విభజన మొదలయింది. లోహంతో పనిచేసేవాడు కమ్మరి, బంకమట్టితో పనిచేసేవాడు కుమ్మరి, కలపతో పనిచేసేవాడు వడ్రంగి, రాయితో పనిచేసేవాడు వాస్తుశిల్పి - ఇలా, నేతతో సహా, దేనికదిగా విడిపోయి, స్వతంత్ర జీవనోపాధులుగా అవి నాగరికతకు అతుక్కుపోయాయి.

మెరుగైన పనిముట్ల వల్ల వృత్తిపనుల్లో ఉత్పత్తి పెరిగింది. నాగరికత పెరగడం వల్ల, తయారైన వస్తువులకు గిరాకీ ఏర్పడింది. వాటిని గింజలతోనో, గొర్రెలతోనో, బర్రెలతోనో వస్తుమార్పిడి చేసుకునే సంతల్లో సందడి పెరిగింది. సంతలకు పేరుబోయిన ప్రదేశాలు క్రమంగా పట్టణాలుగానూ, నగరాలుగానూ విస్తరించాయి. క్రీ.పూ. నాలుగవ శతాబ్దానికి నగరాలుగా చెప్పుకోదగిన ప్రదేశాలు ఇరవైదాకా మెసొపొటేమియాలో ఉండినట్టు అంచనా. వాటిని చుట్టుకొనివున్న జనావాసాల్లో కొన్ని పట్టణాలుకాగా, తక్కినవి గ్రామాలు. ప్రపంచంలో అన్నిటికంటే ముందు నగరాలుగా ఎదిగినట్టు నిరూపించుకున్న ప్రదేశాలు ‘ఎరెచ్’, ‘నిప్పర్’లు రెండున్నూ మెసొపొటేమియాకు చెందినవే. పర్షియన్‌గల్ఫ్ తీరానికి సుమారు రెండు వందల కిలోమీటర్ల ఎగువన, యూఫ్రటీస్ నదీతీరంలో వెలిసిన నగరం ‘ఎరెచ్’. దీనికి ఉత్తరంగా, మరో వంద కిలోమీటర్ల దూరంలో, జంట నదులకు నడిమిగా ఏర్పాటైన నగరం ‘నిప్పర్’. మెసొపొటేమియన్లు ఆరాధించిన దేవతల్లో ప్రముఖుడైన ‘ఎన్లిల్’కు (ఋగ్వేదంలోని మరుత్తులతో పోల్చదగిన శక్తికి) ఈ నగరంలో ఒక దేవాలయం నిర్మించారు. చరిత్రకు తెలిసిన ఈ మొట్టమొదటి దేవాలయానికి ఆకాశాన్ని తాకేంత ఎత్తై గోపురాన్ని ఇటుకలతో నిర్మించారని ప్రతీతి. బైబిల్లో ప్రస్తావించిన ‘టవర్ ఆఫ్ బేబెల్’ ఇదేనని చరిత్రకారుల అభిప్రాయం.

పురాతన నాగరికతల్లో అన్నిటికంటే విశాలంగా విస్తరించిన సింధూ నాగరికతలో నగరాల సంఖ్య తక్కువ, గ్రామాల సంఖ్య ఎక్కువ. నగరాలుగా ఎదిగినవి మామూలు నగరాలు కాదు, మహానగరాలు (మెట్రోపొలీస్). ఇకపోతే, ఈజిప్టు, చైనా నాగరికతల్లో వంశపారంపర్య పరిపాలన మొదలయిందాకా పట్టణాలూ, నగరాలు ఏర్పడిన దాఖలాలు కనిపించవు.


రచన: ఎం.వి.రమణారెడ్డి

మరిన్ని వార్తలు