జీవకణాలకు శక్తి

6 Mar, 2018 00:59 IST|Sakshi

గుడ్‌ ఫుడ్‌ 

జొన్నలను మనం చాలావరకు మరచిపోయినప్పటికీ అప్పుడప్పుడైనా వాటిని తినడం వల్ల వాటిలోని పోషకాలతో మనకు మేలు జరుగుతుందని గుర్తుంచుకోవాలి. జొన్నల వల్ల ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.   జొన్నలో పీచుపదార్థాలు చాలా ఎక్కువ. ఫలితంగా వాటి వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది.  జొన్నల్లో పిండి పదార్థంతో పాటు పీచు పదార్థాలు కూడా ఎక్కువే కాబట్టి జొన్నల్లోని చక్కెర వేగంగా కాకుండా... జీర్ణమయ్యాక చాలా మెల్లిగా రక్తంలోకి వస్తుంది. డయాబెటిస్‌ రోగులకు ఇదెంతో మేలు చేసే అంశం. స్థూలకాయంతో పాటు  గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులను నివారిస్తాయి. జొన్నల్లో ప్రొటీన్లు కూడా ఎక్కువే. కండరాల రిపేర్లు, కణాల పుట్టుక, పెరుగుదలకు ప్రొటీన్లు ఎంతగానో తోడ్పడతాయి. 

జొన్నలు ఒంట్లోని చెడుకొవ్వులను నియంత్రిస్తాయి. వీటిల్లో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. జొన్నల్లో మెగ్నీషియమ్‌ పాళ్లు ఎక్కువ. దాంతో అవి క్యాల్షియమ్‌ను ఎక్కువగా గ్రహించేలా దోహదపడటం ద్వారా ఎముకల దారుఢ్యాన్ని పెంచుతాయి.  జీవకణాల్లో మరింత శక్తినింపుతాయి. వాటిలో పునరుత్తేజం కలిగిస్తాయి.

మరిన్ని వార్తలు