శక్తి వికాసం

13 Oct, 2014 23:41 IST|Sakshi

పుట్టి పెరిగింది అమెరికాలో అయినా... ఆమె అణువణువులో భారతీయత ఉంది. అదే ఆమెను భారతదేశానికి రప్పించింది. యోగాను శ్వాసించే సౌమ్య అయ్యర్, దాన్ని  సామాజిక ప్రయోజనానికి వినియోగించాలంటారు. అనడమే కాదు... అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చి ‘ప్రఫుల్ ఓర్జా’ పేరుతో స్వచ్ఛంద సంస్థ మొదలు పెట్టి, స్నేహితురాలు మెడ్లిన్ సేర్స్‌తో కలిసి  బుద్ధిమాంద్యులైన పిల్లలకు ‘యోగా థెరపీ’ చేస్తున్నారు. పిల్లల కళ్లలో కొత్త కాంతులు చూస్తున్నారు....
 
ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది... అనే సామెతలో ఎంత నిజం ఉందో తెలియదుగానీ... సౌమ్య అయ్యర్ యోగా ఉపాధ్యాయురాలు కావడం వెనుక మాత్రం ఆమె కుటుంబ నేపథ్యం ఉంది. అమెరికాలో పుట్టి పెరిగిన సౌమ్య చిన్నప్పటి నుంచే యోగా గొప్పతనం గురించి విన్నారు. ఆమె తాత యోగా గురువు. ఆయనకు స్వామి వివేకానందతో సాన్నిహిత్యం ఉండేది. సౌమ్య అమ్మ, నానమ్మలు, బంధువులకు కూడా యోగాలో మంచి ప్రవేశం ఉండేది. దీంతో పాటు సౌమ్యకు యోగా తరగతులకు వెళ్లడం కూడా అలవాటైంది. అది ఇష్టంగా కూడా మారింది.
 
యోగా టీచర్ ట్రైనింగ్ పూర్తయ్యాక ‘పీస్ స్టడీస్’ కోసం ఆస్ట్రియా వెళ్లారు సౌమ్య. ఆమె యోగా టీచర్ అని తెలుసుకున్న సహ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా యోగా గొప్పదనం గురించి విన్నారు. సౌమ్య నుంచి యోగా నేర్చుకున్నారు. సహ విద్యార్థులకే కాకుండా ‘యోగా ఫర్ పీస్’ పేరుతో ఆస్ట్రియాలో ఎందరికో యోగా నేర్పించారు. ఒక్క ఆస్ట్రియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా యోగా తరగతులు నిర్వహించారు.
 
రెండు సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చిన సౌమ్య అయ్యర్ యోగా తరగతులు నిర్వహించడంతో పాటు బెంగళూరులో పర్యావరణ సమస్యలపై, స్త్రీల హక్కుల గురించి పని చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఒకసారి ఒక పిల్లాడిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అతడి ప్రవర్తన మిగిలిన పిల్లల కంటే చాలా భిన్నంగా ఉంది. ఆ పిల్లాడికి ‘హైపర్ యాక్టివ్ డిజార్డర్’ అనే విషయాన్ని తెలుసుకున్నారు సౌమ్య.
 
ఆ అబ్బాయి తల్లిదండ్రులను కలుసుకొని యోగా నేర్పించడం ద్వారా పరిస్థితిని మెరుగుపరచవచ్చని చెప్పారు. ఆ పిల్లాడికి యోగా నేర్పడం ద్వారా మైండ్-బాడీ కనెక్ట్ అయ్యేటట్లు చేసి సెల్ఫ్ అవేర్‌నెస్ వచ్చేలా చేశారు సౌమ్య. పిల్లాడిలో వచ్చిన మార్పు తల్లిదండ్రులను ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ప్రత్యేక అవసరాలుగల పిల్లల (స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్) కోసం యోగా తరగతులు నిర్వహించాలనే ఆలోచనకు ఇది ప్రేరణ ఇచ్చింది.
 
‘‘ఒకేవిధమైన ఆలోచనలు ఉన్నవారితో మైత్రివల్ల సంకల్ప బలం రెట్టింపు అవుతుంది. ఫలితం త్వరగా చేరువ అవుతుంది’’ అనేది సౌమ్య అభిప్రాయం.
 
ఫేస్‌బుక్ ద్వారా సౌమ్య చేస్తున్న మంచి పనులను గురించి తెలుసుకొని ప్రభావితమయ్యారు మెడ్లిన్ సేర్స్ అనే అమెరికన్.‘యోగా ద్వారా మానసిక స్వాంతన మాత్రమే కాదు. సమాజానికి సేవ చేయవచ్చు’ అనే విషయం గురించి చర్చించుకున్నారు. ఇది జరిగిన కొద్ది కాలానికే అమెరికాలో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగళూరులోని సౌమ్య దగ్గరు వచ్చా రు సేర్స్. ఇద్దరు కలిసి బుద్ది మాంద్యంతో పాటు ప్రత్యేక అవసరాలుగల పిల్లల కోసం పనిచేయాలనుకున్నారు. అలా వారి ఆలోచనలో నుంచి పుట్టిందే ‘ప్రపుల్ ఒర్జా’ అనే స్వచ్ఛంద సంస్థ.
 
‘ప్రపుల్ ఒర్జా’ అంటే... ‘వికసించే శక్తి’

పేరుకు తగినట్లుగానే పిల్లల్లో నిద్రాణంగా ఉన్న శక్తులను వెలికి తీయడంలో ‘ప్రపుల్ ఒర్జా’ శక్తిమంతంగా పని చేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ డౌన్స్ సిండ్రోమ్, అటెన్షన్ డెఫిసిటి, హైపర్ యాక్టివ్ డిజార్డర్, స్పీచ్ ఇంపెయిర్‌మెంట్, సెరిబ్రెల్ పాల్సి, ఆటిజం... తదితర రుగ్మతలు ఉన్న పిల్లలకు యోగా నేర్పడంతో పాటు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు మొదలైన విధానాల ద్వారా పిల్లల్లో మార్పు తేవడానికి ప్రయత్నిస్తుంది. ఆసన, మంత్ర, ముద్ర, ధ్యానం మొదలైనవి పిల్లలకు నేర్పించే క్రమంలో వారి ఫిజికల్, ఎమోషనల్ లెవెల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ‘ప్రపుల్ ఓర్జా’లో 15 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ‘చైల్డ్-ఫ్రెండ్లీ’ పద్ధతిలో పాటలు, ఆటలు, నృత్యం ద్వారా పిల్లలకు యోగాసనాలు నేర్పిస్తారు. పిల్లల సామర్థ్యం, అవసరాలను దృష్టిలో పెట్టుకొని 25 ప్రత్యేకమైన యోగాసనాలు రూపొందించారు.
 
ప్రత్యేక అవసరాలుగల పిల్లలకే కాక డయాబెటీస్, డిప్రెషన్, ఆర్థరైటిస్...మొదలైన సమస్యలతో బాధ పడే పిల్లలతో పాటు గ్రామీణ ప్రాంతాలలోని హెచ్‌ఐవి పాజిటివ్ పిల్లలకు ‘యోగా థెరపీ’ చేస్తుంది ‘ప్రపుల్ ఒర్జా’.
 
‘‘అన్నిటికంటే పెద్ద సవాలు... క్లాసుకు పిల్లలు వచ్చేలా ఉత్సాహపరచడం’’ అంటారు సేర్స్. ఎందుకంటే కొన్నిసార్లు వారి ప్రవర్తన వింతగా ఉంటుంది. కొన్నిసార్లు ఏమీ చేయకుండా అలాగే కూర్చుండి పోతారు. ఒకోసారి కోపంతో గట్టిగా అరుస్తారు... కాబట్టి క్లాసు చెప్పే ఉపాధ్యాయులకు ఎంతో ఓపిక కావాలి. వారికి యోగా మాత్రమే కాకుండా... పిల్లలకు ప్రత్యేకమైన ఆర్ట్ క్లాసులు, మ్యూజిక్ థెరపి కూడా నిర్వహిస్తుంది ప్రపుల్ ఓర్జా.
 
యోగా, ఆర్ట్, డ్యాన్స్, మ్యూజిక్‌లలో పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి అవసరమై ట్రైన్ట్ టీచర్ల కోసం ‘ప్రఫుల్ ఓర్జా’ ఎదురుచూస్తోంది. పిల్లల కోసం ‘ప్రపుల్ ఒర్జా’ ఉపాధ్యాయులు దశావతారాలు ఎత్తుతారు. ఎవరైనా పిల్లాడు ముఖం మాడ్చుకొని ఉంటే అతనిని నవ్వించడానికి జోకర్ అవతారం ఎత్తుతారు. అలకపూనిన అమ్మాయిని అలక తీర్చడానికి అమ్మ అవతారం ఎత్తుతారు. పిల్లల్లో హుషారు నింపడానికి సంగీతకారులవుతారు. సృజనకు ప్రాణం పోయడానికి చిత్రకారులవుతారు... ఏ అవతారం ఎత్తినా... వారి శక్తికి సానబెట్టడం కోసమే!
 ‘‘తల్లిదండ్రులమైన మాకే కొన్నిసార్లు ఓపిక నశిస్తుంది. కోపం వస్తుంది. ప్రపుల్ ఓర్జా మాత్రం చాలా ఓపికతో వ్యవహరిస్తారు. వారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి’’ అంటున్నారు ఒక పేరెంట్ మెచ్చుకోలుగా.
 
సౌమ్య అయ్యర్, సేర్స్ ద్వయం... ఒకవైపు ‘ప్రపుల్ ఓర్జా’ పనుల్లో తలమునకలవుతూనే మరోవైపు తమ అభిరుచులకు, ఆసక్తులకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. తీరిక ఉన్నప్పుడు తమ అభిరుచులైన ప్రయాణం, పుస్తకపఠనం, మ్యూజియమ్‌లను దర్శించడం కొనసాగిస్తున్నారు. తమ సంస్థను విశ్వవ్యాప్తం చేయాలనే వారి కోరిక ఫలించాలని ఆశిద్దాం.
 

మరిన్ని వార్తలు