నేను మీ కణాన్ని!

3 Aug, 2016 22:35 IST|Sakshi
నేను మీ కణాన్ని!

ఒక డజను పవర్ స్టేషన్స్‌ను అణు పరిమాణంలోకి మారిస్తే... ఒక పెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థను సూక్ష్మరూపానికి తగ్గిస్తే... ఒక పెద్ద నగరాన్ని మినియేచర్ స్కేలుకు కుదిస్తే... అదే నేను. ఆనంద్ జీవకణాన్ని. అనేక పవర్ స్టేషన్‌లో శక్తి ఉత్పత్తి, రకరకాల రవాణా వ్యవస్థలో రాకపోకలూ, ఆత్మరక్షణకు ఓ పోలీసు వ్యవస్థ, ఇతర వస్తువుల ఉత్పాదన... ఇన్ని మాటలెందుకు? ఒక మెట్రోపాలిటన్ సిటీని అమాంతం సూక్ష్మీకరిస్తే ఒక కణం అవుతుంది. అలాంటి కణాలు ఆనంద్ ఒంట్లో ఎన్ని ఉంటాయో తెలుసా? 60 ట్రిలియన్! (ఒక ట్రిలియన్ అంటే... ఒకటి పక్కన పన్నెండు సున్నాలు. అంటే పది లక్షల కోట్లు).


నేను జీవానికి మూలం. నేను ఇలాగే ఉంటానని చెప్పడం కష్టం. ఒక్కో చోట ఒకలా ఉంటా. అంటే కన్ను కణమైతే ఒకలాగా... కాలేయ కణం మరొకలాగా ఉంటానన్నమాట. అంతెందుకు... అంతెత్తున ఉండే జిరాఫీలో ఒకలాగా... చిన్న చిట్టెలుకలో మరోలా ఉంటాను.


ఎన్నెన్నో ఆకృతులు... మరెన్నో రూపాలు
నాకు నిర్దిష్టంగా ఒక రూపం అంటూ ఉండదు. నాకు ఎన్నో ఆకృతులు. గుండ్రంగా, గోళాకృతిలో, రాడ్ షేప్‌లో ఇలా ఎన్నెన్నో ఆకారాలు. కణాన్ని బట్టి... అది ఉండే స్థానాన్ని బట్టి... నిర్వహించాల్సిన పనిని బట్టి... అనుక్షణం స్పందించే గుండె దగ్గర్నుంచి... ఎప్పటికీ స్థిరంగా ఉన్నట్లు అనిపించే ఎముక వరకు ఎన్నెన్నో రకాల కణాలుంటాయి. ఆనంద్ ఏ పని చేయాలన్నా అందులో కోట్లాది కణాలు పనిచేస్తాయి. కణం అంటూ ఒకే దాన్ని గురించి చెప్పడం కష్టం. కాబట్టి ఉదాహరణకు రాడ్ కణాన్ని తీసుకుందాం. ఉదాహరణకు ఆనంద్ రాత్రిపూట మిణుకు మిణుకుమనే ఒక చుక్కను చూడాలనుకోండి. అతడిలోని 25 కోట్ల రాడ్ కణాలు పనిచేయాలి. అందులోని కనీసం మూడు కోట్ల కణాలు వెలుగును పట్టేసే విద్యుత్ రసాయనాలను వెలువరించాలి. ఇందుకు శక్తి కావాలి. ఆ శక్తి కోసం నాలోని పవర్ జనరేటింగ్ యూనిట్స్ పనిచేయాలి. నా  పవర్ జనరేటింగ్ యూనిట్స్ పేరు మైటోకాండ్రియా. చాలా మెటోకాండ్రియాల ద్వారా ఆ శక్తిని ఉత్పత్తి జరుగుతుంది. అసలు నాదే చాలా సూక్ష్మ రూపం కదా. మరి నాలోని కణాంశమైన ఆ మైటోకాండ్రియా ఇంకెంత సూక్ష్మరూపంలో ఉంటుందో ఊహించండి.

శక్తి కోసం మండించే ఇంధనం... చక్కెర!
చక్కెరను మండించి శక్తిని తయారు చేస్తాను. ఫ్యాక్టరీలో వస్తువుల ఉత్పాదనకు ఇంధనం మండిస్తే... పొగ, కాలుష్యాల లాగే నాలోనూ వ్యర్థాలు వెలువడతాయి. అవి ప్రధానంగా కార్బన్ డైయాక్సైడ్, నీళ్ల రూపంలో ఉంటాయి. మీకు కనిపించే శక్తి విద్యుత్ రూపంలో కనిపిస్తుంది కదా. అలాగే నాలోని శక్తి అడినోసిస్ ట్రై ఫాస్ఫేట్ (ఏటీపీ) అనేది రసాయన శక్తి రూపంలో ఉంటుంది. శ్వాస పీల్చడం అనే పెద్ద పని దగ్గర్నుంచి, రెప్పపాటులో కనురెప్ప మూయడానికీ ఆ శక్తి ఉపయోగపడుతుంటుంది. ఆనంద్ చురుగ్గా ఉన్నప్పుడే కాదు... మామూలు సమయంలోనూ ఆనంద్‌లో శక్తి వెలువడటం జరుగుతూనే ఉంటుంది. అంతెందుకు ఆనంద్ నిద్రపోతున్నా, కలలు కంటున్నా అవసరమైన శక్తిని నేను ఉత్పత్తి చేసుకుంటూనే ఉంటా. ఒక్క ఎర్రరక్తకణాల్లో తప్ప మైటోకాండ్రియా అనే ఈ శక్తి ఉత్పాదక కేంద్రాలు అన్ని కణాల్లోనూ ఉంటాయి. అవి రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండాలి. వాటికి ప్రత్యేకంగా శక్తి అవసరం లేదు కాబట్టి ఎర్రరక్తకణాల్లో మైటోకాండ్రియాలు ఉండవు.

అది క్షణక్షణాభివృద్ధి... క్షణకణాభివృద్ధి...
నేను అనుక్షణం అభివృద్ధి చెందే క్రమాన్ని... ఒకటి రెండుగానూ, రెండు నాలుగుగానూ విడిపోయే అద్భుతాన్ని చూడాలంటే... అమ్మ కడుపులో పడ్డ తర్వాత ఆనంద్ మొదటి కణం విడిపోవడాన్ని చూడవచ్చు. అక్కడి నుంచి  మొదలైన కణకణాభివృద్ధి చూడవచ్చు. కణకణాభివృద్ధి కాదది... క్షణక్షణాభివృద్ధి! కణాల్లోని డీఎన్‌ఏలలో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా ఒక కణం నుంచి ఒక రూపం పెరుగుతుంది. ఒక ప్లాన్ తాలూకు బ్లూప్రింట్‌ను చూసి... నిర్మాణం పూర్తయ్యాక పెద్ద బిల్డింగ్‌ను చూసిన అనుభవమే పిండం పూర్తి ఆకృతిని పొందాక కలుగుతుంది. అక్కడ కణంలోని అతి చిన్న కణాంశాలలో ఉన్న సమాచారం మేరకు వెంట్రుకల ఆకృతి, వాటి రంగు, ఒంటి రంగూ... ఇవన్నీ చిన్నారికి వచ్చేస్తాయి. ఇది ఒక అద్భుతమైతే ఒక అవయవం ఎంత పెరగాలో అంతే పెరిగి అక్కడ ఆగిపోవడం మరో అబ్బురం. అన్ని వేళ్లూ ఒకేలా పెరిగినా చిటికెన వేలు చూడండి... ఎంత చిన్నగా ఉంటుందో!

మీకు మరో అద్భుత విషయం చెప్పనా...? ఆనంద్ కంటిలో ఉన్న రాడ్  కణంలోని డీఎన్‌ఏలోనూ ఒక పూర్తి ఆనంద్‌ను రూపొందేందుకు అవసరమైన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అతడి కాలి కణంలోనూ అదే సమాచారం ఉంటుంది. అయితే ఆనంద్‌ను మళ్లీ రూపొందించే పని మేం చేయం. ఉదాహరణకు  నేను కంటిలోని రాడ్ కణాన్ని అనుకోండి. మరో రాడ్ కణాన్ని రూపొందిస్తానంతే. కాకపోతే నేనున్న చోటిని బట్టి ఒక కణం వేగంగా విభజితం కావాలా, లేక ఆలస్యంగా కావాలా అన్నది నేను ఏ కణాన్ని అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఇందుకు మరో ఉదాహరణ ఇస్తా. నేను కొవ్వు కణాన్ని అనుకోండి. కాస్తంత ఆలస్యంగా కణభివృద్ధి జరుగుతుంది. అదే చర్మం కణాన్ని అనుకోండి. ప్రతి పదిగంటలకోసారి కొత్త కణాలు రూపొందడం జరుగుతుంది. ఇలా మిగతా కణాలు పుట్టడం, చనిపోతూ ఉండటం జరుగుతుంటాయి. కానీ... మెదడు కణాలు మాత్రం ఒకసారి పుట్టాక చనిపోవడం అంటూ జరిగితే కొత్త కణాలు పుట్టవు. అయితే మెదడులో ఎన్నెన్నో కణాలుంటాయి. అవి జీవితకాలానికి సరిపోయేంతగానే కాదు... మరెన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే అవి చనిపోతూ ఉన్నా... మిగతావి జీవితకాలపు అవసరాలకు మించి ఉంటాయి.


నాకూ ఒక అద్భుతమైన ప్యాకింగ్...
నాకు రూపం ఇచ్చేందుకు నాపైన ఒక పొర ఉంటుంది. అదెంత పలచగా ఉంటుందో మీకు తెలుసా? దాని మందం 0.0000001 మిల్లీమీటర్లు. నిన్నమొన్నటి వరకూ అది పల్చటి ఒక పొర మాత్రమే మాత్రమే  అని అందరూ అనుకునే వారు. నాలోని అంతర్గత అవయవాలకు పైన సెలోఫెన్ బ్యాగ్‌లా మాత్రమే నా పొరని చూసేవారు. కానీ  ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కనిపెట్టాక నా పొర గురించి ఎన్నో విషయాలు తెలిశాయి. అది నాలోని వాతావరణాన్ని ఒకేలా ఉంచడానికి పనికి వచ్చే ఒక పొర. నాలోని లవణాలూ, రసాయనాలూ, నీళ్లూ అన్నీ సమతులంగా ఉంచేలా చూసే ఒక కోటగోడ. ప్రోటీన్లు పుట్టడానికి నా లోపలికి వేటిని అనుమతించాలో, వేటిని రానివ్వకుండా చూడాలో తెలిసిన ఒక మహాదుర్గం. ఇదెలా జరుగుతుందో చెప్పడానికి అందరికీ అర్థం కావడానికి ఒక పోలిక చెప్పనా? నాలోకి రావాల్సిన రసాయనాలూ, బయటి పదార్థాలూ నా గోడ గుర్తుపట్టేలా ఒక ఐడెంటిటీ కార్డ్‌ను ధరిస్తాయి. ఆ ట్యాగ్‌లను చూసి గుర్తుపట్టాకే ఆ పదార్థాలను లోపలికి పంపుతుందది. నా పొర గుర్తుపట్టలేదంటే నాలోకి నో ఎంట్రీ. నాలోకి అనుమతించకపోవడమే కాదు... నా కాలనీలోని ఇరుగుపొరుగు కణాలన్నీ కలిసి దాన్ని కొంతదూరం తరిమికొడతాయి. ఇదే పని చేయకపోతే ఏమవుతుందో తెలుసుకోండి. కనురెప్ప దగ్గర దుమ్ము చేరితే కళ్లు చికిలించుకోవు. దాంతో కంట్లోకి దుమ్ము చేరుతుంది. కంట్లోకి దుమ్ము చేరినట్టే ఏ కాలేయంలోకో, కిడ్నీలోకో ఫారిన్‌బాడీ వెళ్తే? అందుకే ఈ తరిమి కొట్టడాలు. మాలోనే ఒక కణానికీ మరో కణానికీ సంభాషణ జరుగుతూ ఉంటుంది. అదెలాగో ఇంకా స్పష్టంగా తెలియదు. బహుశా ఎంజైములే కావచ్చు. ఇలా సంభాషణ ఎలా జరుగుతుందని అబ్బురపడకండి. దీనికీ ఉదాహరణ ఉంది. ఆనంద్ శరీరం నుంచి గుండెను వేరు చేస్తే కణాలన్నీ క్రమబద్ధంగా కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు స్పందిస్తూ ఉంటాయి. కానీ మళ్లీ గుండెను ఒంట్లోకి చేర్చండి. వేళ్లతాటింపుతో క్రమబద్ధంగా కదిలే హార్మోనియం మెట్లలా మళ్లీ ఇవి క్రమబద్ధంగా కదలడం మొదలవుతుంది. ఈ సమాచారం ఎలా చేరుతుందన్నది ఇంకా మిస్టరీయే. హర్మోనులు కూడా కణాల మధ్య కమ్యూనికేషన్స్‌కు ముఖ్యమైన సాధనాలే! ఉదాహరణకు ఆనంద్ ఒంటికి శక్తి కోసం చక్కెరను మండిస్తూ ఉంటాం కదా. ఇంతలోనే... ‘‘ఇంక ఉత్పత్తి అయిన శక్తి చాలు. ఆ ప్రక్రియ ఆపేయండి’’ అంటూ హార్మోన్ల సహాయంతో రక్తప్రవాహ మార్గంలో ఆదేశాలు అందుతాయి. అంతే... శక్తి ఉత్పత్తి ఆగిపోతుంది. మళ్లీ అవసరం పడగానే ‘‘పవర్ కావాలి. ఏటీపీలను అందించండి’’ అంటూ ఆర్డర్స్ వచ్చేస్తాయి.

ఆ శత్రువుతో పోరాటం కష్టం...
మాకు ప్రధాన శత్రువు వైరస్. అదీ కణంలాగే ఉంటుంది. కానీ దానికి శక్తి ఉత్పాదన కేంద్రాలైన మైటోకాండ్రియాలు ఉండవు. అది కణం తాలూకు కోటగోడ అయిన పైపొరను దాటి వస్తుంది. కణంలో అచ్చం కణంలాగే ఇమిడిపోయి మా మైటోకాండ్రియానుంచి శక్తిని విచ్చలవిడిగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దాంతో అసలు కణం చనిపోతుంది. చనిపోయిన కణాన్ని వదిలేసి పొరుగుకణంలోని మైటోకాండ్రియాను మళ్లీ పట్టుకుంటుంది వైరస్. ఇలా ఒంటిలోకి చేరిన కొద్దిసేపట్లోనే వైరస్ లక్షలాది కణాలను ధ్వంసం చేస్తుంది. ఇదే ప్రక్రియ అదేపనిగా జరిగితే ఆనంద్ ప్రాణాలకు ముప్పు తప్పదు.


ఆనంద్ ఫ్రెండ్స్ పదిమంది ఒక చోట చేరితే... వాళ్ల మధ్య సమన్వయం ఉంటుందా? ఆలోచించండి... మేం అరవై ట్రిలియన్స్ మందిమి అద్భుతమైన క్రమశిక్షణతో ఆనంద్ ఒంట్లో నూరేళ్లు ఉంటాం కదా. ఇది వేనోళ్ల చెప్పుకోవాల్సిన మాట కాదా!

 

ఎన్నో పనుల్లో ఇదీ ఒకటి...
నేనేం చేస్తానో... ఎలా చేస్తానో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ... ఒక చేపలో ప్రొటీన్స్ ఉంటాయి. మనం తినే మాంసంలో ప్రొటీన్లు ఉంటాయి. పప్పుల్లోనూ అవి ఉంటాయి. వాటిని మీరు తింటారు కదా... అలాగే మన గోరు తయారయ్యే పదార్థమూ ప్రొటీనే. చేపల్లో, మాంసాహారంలో, పప్పుల్లో ఉన్న ప్రొటీన్లను విడగొట్టి... మళ్లీ ఒంటికి కావాల్సిన ప్రొటీన్‌గా రూపొందించుకుంటూ ఉంటా. ఇలా నేను రకరకాల ఎన్ని ప్రోటీన్లను నా అవసరానికి తగ్గట్లుగా మార్చుకుంటూ ఉంటా. నాలో కనీసం 600 రకాల ఎంజైములు తయారవుతుంటాయి. ఆర్‌ఎన్‌ఏ (రైబో న్యూక్లిక్ యాసిడ్) అనే మాస్టర్ కెమిస్ట్ ఆదేశాల మీద ఈ ఎంజైములు తయారవుతుంటాయి. నాలో ఆవిర్భవించే సెల్యులార్ ఎంజైముల సహాయంతో అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం ఉండే హార్మోన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే రోగనిరోధక యాంటీబాడీలు రూపొందుతుంటాయి.

 

మరిన్ని వార్తలు