ప్రకృతి ఒడిలో రైతే రాజు!

12 Jul, 2020 08:30 IST|Sakshi
 కడప జిల్లాలో తొలి డ్రాగన్‌ ఫ్రూట్‌ పొలం, నిలువెత్తు పెరిగిన దేశీ వరి నవారా 

ఉద్యోగాలకు స్వస్తి చెప్పిన ఇంజినీర్‌ దంపతులు  

చేయీ చేయీ కలిపి.. 

ప్రకృతి వ్యవసాయం చేపట్టి..

సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న అశోక్‌రాజు, అపర్ణ 

ఇద్దరూ ఇంజినీరింగ్‌ చదువుకున్నారు.. ఢిల్లీ, హైదరాబాద్‌లోని పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేశారు. పదేళ్లు గడిచాయి. ఉద్యోగాల్లో హోదా పెరిగేకొద్దీ జీతంతోపాటే వత్తిళ్లు పెరుగుతున్నాయి. శాంతి, సంతోషం సన్నగిల్లిపోతూ ఉంటే.. ప్రకృతికి తిరిగి దగ్గరగా వెళ్లటం ద్వారానే తిరిగి సంతోషాన్ని సంతరించుకోగలమన్న స్పృహ కలిగింది. అంతే.. రెండేళ్ల క్రితం స్వగ్రామం చేరుకొని ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. పాడి, పంటలతో కూడిన పనుల్లో నిమగ్నమై ప్రకృతితో మమేకమైతేనే రైతు రాజయ్యేదని చాటి చెబుతున్నారు. సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ సంతృప్తిగా జీవిస్తున్న యువ రైతు దంపతులను పలుకరిద్దాం పదండి.. 

ముప్పాళ్ల అశోక్‌రాజు, ఆయన సతీమణి అపర్ణ ఇంజినీరింగ్‌ చదువుకున్నారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేసిన అశోక్‌ది వైఎస్సార్‌ కడప జిల్లా రామాపురం మండలం గోపగుడిపల్లె గ్రామ పంచాయతీలోని నాగరాజుపల్లె గ్రామం. చదువు అయ్యాక తొలుత ఢిల్లీలో, తర్వాత హైదరాబాద్‌లో దాదాపు పదేళ్లు పెద్ద సంస్థల్లో ఉద్యోగం చేశారు. అపర్ణ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేసి హైదరాబాద్‌లో మూడేళ్లపాటు ఉద్యోగం చేశారు. 

ఏడాది గడిచే కొద్దీ ఆదాయంతో పాటే వత్తిళ్లు, ఆందోళన పెరుగుతూనే ఉన్నాయి. సంతోషం, సంతృప్తి లోపిస్తూ వచ్చాయి. మదిలో వెలితి అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. ఆ దశలో ఉద్యోగానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదా? అన్న ఆలోచన అశోక్‌ మదిలోకి వచ్చినప్పుడు ప్రకృతికి దగ్గరగా జీవనం సాగించడం ద్వారా మాత్రమే ఈ వెలితిని పోగొట్టుకోగలమని తోచింది. ప్రకృతి వ్యవసాయం చేపట్టడమే ఇందుకు మార్గమని భావించాడు.  అశోక్‌రాజు తండ్రి వెంకట్రామరాజు 9 ఎకరాల రైతు. రసాయనిక పురుగుమందులు వాడకుండా ఎన్‌.పి.ఎం. పద్ధతులను అనుసరించి అనేక ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారాయన. అశోక్‌ తన మదిలో ఆలోచన చెప్పడంతో భార్య, తల్లిదండ్రులు సంతోషంగా అంగీకరించారు. ఆ విధంగా రెండేళ్ల క్రితం అశోక్‌రాజు, అపర్ణ ఉద్యోగాలకు చెల్లుచీటీ ఇచ్చి నాగరాజుపల్లె వచ్చేశారు. పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టారు. ఆరోగ్యదాయకమైన పంటలు పంటలు పండిస్తూ సంతృప్తిగా జీవిస్తున్నారు. 

తెలివిగా పంటలు ఎంచుకోవాలి.. 
చదువుకున్న యువత వ్యవసాయంలోకి అందులోనూ ప్రకృతి వ్యవసాయంలోకి రావాల్సిందేనని అంటున్న అశోక్‌ సాగు తన రెండేళ్ల అనుభవంలో చాలా నేర్చుకున్నానన్నారు. భార్య, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండటంతో వ్యవసాయంలో నిలదొక్కుకున్నానని ఆయన అన్నారు. తమ ప్రాంతానికి, నేలకు, వాతావరణానికి తగిన పంటలను తెలివిగా ఎంచుకొని సాగు చేస్తే వ్యవసాయంలో నష్టం అనేది రాదని అశోక్‌ చెబుతున్నారు.

దేశీ వరి రకాలు
తండ్రి రసాయనిక పురుగుమందుల వాడకం మాత్రం మానేస్తే.. అశోక్‌ రసాయనిక ఎరువులకూ పూర్తిగా స్వస్తి చెప్పారు. తండ్రి ట్రాక్టర్‌తో దుక్కి చేయించేవారు. కొడుకు ఎడ్ల నాగళ్లతోనే దుక్కి చేయిస్తున్నారు. తండ్రి సాధారణ వరి రకాలు పండిస్తే కొడుకు పోషకాల సాంద్రత కలిగిన దేశీ వరి రకాలు నవార, కుళ్లాకర్, కాలాబట్టి సాగు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. 9 ఎకరాల్లో వ్యవసాయం మొత్తాన్నీ అశోక్‌ సమూలంగా మార్చేసి, పూర్తి స్థాయిలో ప్రకృతి బాటపట్టించారు అశోక్‌రాజు. 

పాడి.. పంట..
పశువులు లేకుండా వ్యవసాయం సాగదని ఆయన అంటారు. తమకు 20 వరకు నాటు ఆవులు, ఎద్దులు ఉన్నాయి. వాటి పేడ, మూత్రంతో పంటలకు జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకుంటున్నారు. 9 ఎకరాల్లో సగం ఎర్ర నేల, సగం నల్ల నేల. ఎర్ర నేల 4 ఎకరాలకు పైగా ఉంటే.. 2 ఎకరాల్లో మామిడి తోట ఉంది. మిగతా భూమిలో ఈ ఏడాది వేరుశనగ విత్తారు. ఆరోగ్యదాయకమైన దేశీ వరి రకాలు నవార, కుళ్లాకర్, కాలాబట్టిలను నల్ల నేలలో ఒక్కో ఎకరంలో సాగు చేస్తున్నారు. ఎకరంలో శాశ్వత పందిర్లు వేసి బీర సాగు చేస్తున్నారు. రింగ్‌ పిట్‌ మెథడ్‌లో ఒక ఎకరంలో చెరకు, ఒక ఎకరంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే పాలిహౌస్‌ ఏర్పాటు చేసుకొని జెర్చరా పూలు సాగు చేయాలన్నది అశోక్‌రాజు ఆకాంక్ష. ప్రకృతికి దూరమై కంప్యూటర్లకే పరిమితమైపోయి ఉద్యోగాలలో టెన్షన్లు, అనిశ్చితితో సతమతమయ్యేకన్నా.. వీలైనంత వరకు యువత ప్రకృతి వ్యవసాయంలోకి రావటమే ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా చూసినా దీర్ఘకాలంలో మంచిదని అశోక్‌రాజు, అపర్ణ ఇంజినీర్‌ యువ రైతు దంపతులు ముక్తకంఠంతో చెప్తున్నారు!

రింగ్‌ పిట్‌ మెథడ్‌లో చెరకు సాగు
ఎకరంలో ఆర్నెల్ల క్రితం చెరకు విత్తారు. రింగ్‌ పిట్‌ మెథడ్‌లో ఎకరానికి 9 టన్నుల విత్తనం పట్టింది. 2.5 అడుగుల చుట్టుకొలత ఉన్న రింగ్‌లో అడుగు లోతున చెరకు విత్తనాన్ని నాటుతారు. కాబట్టి చెరకు ఎంత ఎదిగినా పడిపోకుండా ఉంటుంది. రింగ్‌లో 50 వరకు వత్తుగా పిలకలు వస్తాయి. రింగ్‌కు రింగ్‌కు మధ్య 2 మీటర్ల దూరం ఉంటుంది కాబట్టి గాలి, వెలుతురు బాగా తగిలి తోట ఏపుగా పెరుగుతుంది. దిగుబడి ఎకరానికి 80 టన్నులకు తగ్గదని అశోక్‌రాజు ఆశిస్తున్నారు. మరో ఆర్నెల్లకు చెరకు కోతకు వస్తుంది. బెల్లం వండుదామనుకుంటున్నారు.

నవతరం రైతులు అశోక్‌రాజు, అపర్ణ  

ఆనందం.. ఆదాయం కూడా!
ప్రకృతికి దూరమైన జీవితంలో ఆత్మసంతృప్తి, సంతోషం ఉండవు. ఎంత పెద్ద చదువు చదివి ఉద్యోగంలో చేరినా.. ఏళ్లు గడిచేకొద్దీ ఆదాయంతోపాటే ఆందోళన, అనిశ్చితి పెరుగుతూనే ఉంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రకృతిలో మమేకమై జీవించడంలోనే.. అంటే ప్రకృతి వ్యవసాయక జీవనంలోనే ఆనందం ఉంది. ఉద్యోగం వదిలి రావాలని ఉన్నా చాలా మంది ఏదో ఒక కారణంతో వెనకాడుతూ ఉన్నారు. మొదట మానసికంగా కచ్చితమైన నిర్ణయానికి రావాలి. పొలం ఎక్కువ లేదనుకోవద్దు. రెండు, మూడు ఎకరాలున్నా చాలు. భార్య, తల్లిదండ్రుల ప్రోద్బలం తప్పనిసరి. పనుల్లో పూర్తిగా నిమగ్నమవ్వాలి. తెలివిగా చేసుకోవాలి. తొలి దశలో నెమ్మదిగానైనా చేసుకుంటూ వెళ్లాలి. నెలాఖరుకు జీతం రాదు. పైగా పెట్టుబడి పెడుతూనే ఉండాలి. అయితే, అవగాహన పెంచుకొని చేస్తే.. ప్రకృతి వ్యవసాయంలో నష్టం రాదు. అన్నీ కుదురుకోవడానికి 1–2 ఏళ్లు పోరాటం తప్పదు. సాధారణంగా రైతులు విత్తనం, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకే 50% ఖర్చు పెడుతున్నారు. అవి కొనకుండా మనమే తయారు చేసుకుంటే సగం సమస్యలు తీరుతాయి. చదువుకున్న యువత తెలిసి చేస్తే ప్రకృతి వ్యవసాయంలో నష్టం ప్రసక్తే ఉండదు. నెమ్మదిగానైనా ఉద్యోగానికి మించి ఆదాయం వస్తుంది. రెండేళ్లుగా మేం అందరం చాలా ఆనందంగా ఉన్నాం. 
– ముప్పాళ్ల అశోక్‌రాజు 
(95028 26931), 
రైతుగా మారిన యువ ఇంజినీర్, 
నాగరాజుపల్లె, రామాపురం మండలం, 
వైఎస్సార్‌ కడప జిల్లా 

డ్రాగన్‌ ఫ్రూట్‌కు శ్రీకారం 
డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు జిల్లాలో శ్రీకారం చుట్టిన ఘనత అశోక్‌దే. ఉద్యోగం మానెయ్యడానికి  ఏడాది ముందే అరకు ప్రాంతంలో స్నేహితుడు సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట చూసి తమ పొలంలో దిగుబడినిస్తుందో లేదో చూద్దామనుకున్నారు. 500 పింక్‌ డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలు కొని తెచ్చి నాటించారు. ఆరు నెల్ల వరకు మొక్కలు పెద్దగా ఎదగలేదు. ఆ మొక్కల నుంచే అంట్లు కట్టి, ఆ మొక్కలను నాటి చూశారు. అవి ఏపుగా పెరుగుతున్నాయి. ఆర్నెల్లకే పూతకు వచ్చాయని అశోక్‌ తెలిపారు. ఇప్పుడు ఎకరంపైగా విస్తీర్ణంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును విస్తరించారు. 300 పోల్స్‌లో 1400 వరకు డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలు నాటారు. తమ ప్రాంతానికి ఈ పంట తగినదేనని నిర్థారించుకున్న తర్వాత డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలను ఇతర రైతులకూ విక్రయిస్తున్నారు. ఎండాకాలంలో 49 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతకు సైతం పింక్‌ డ్రాగన్‌ రకం తట్టుకున్నదన్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ అధిక పోషక విలువలతో కూడిన పంట కావడంతోపాటు చీడపీడలు లేవు, కూలీల అవసరం తక్కువ, పోషణ కూడా చాలా సులభమని ఆయన తెలిపారు. ఖర్జూరపు పంట పూత మీద ఉండే కాలంలోనే మనకు వర్షాలు పడతాయి కాబట్టి, పూత నిలవదన్నారు. అందుకే ఆ పంట మనకు అనువు కాదని అనుకున్నానని అశోక్‌రాజు అంటున్నారు. 
– కోడూరు రామమోహనరెడ్డి, సాక్షి, కడప సిటీ

మరిన్ని వార్తలు