ఈఎన్‌టీ కౌన్సెలింగ్

9 May, 2015 02:47 IST|Sakshi

నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. దాంతో చాలా బలహీనంగా మారుతున్నాను. రోజువారీ పనులు కుదరడం లేదు.  జలుబు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.
 - రాకేశ్, గుంతకల్లు


 మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఇబ్బంది ఉందన్నారు. కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దాంతో ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు చోట్లా సమస్యలకు దారితీయవచ్చు. యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా రావచ్చు. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్‌ఎఫెక్ట్స్ కూడా తక్కువ. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోండి. మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి.
 
నాకు ఇటీవలే ‘ఓపెన్ హార్ట్ సర్జరీ’ అయ్యింది. అప్పట్నుంచి మాట సరిగా రావడం లేదు. తినేప్పుడు, తాగేప్పుడు, మింగడంలోనూ ఇబ్బందిగా ఉంది. ఎప్పుడూ గొంతులో ఏదో అడ్డం పడ్డట్లుగా ఉంది. దగ్గు కూడా వస్తోంది. దీనికి తగిన పరిష్కారం చూపండి.
 - పరంధాములు, నకిరేకల్లు


మీకు స్వరపేటికలోని ‘వోకల్ ఫోల్డ్’లో సమస్య ఉన్నట్లుగా అనిపిస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లలో కొన్నిసార్లు ‘వోకల్ ఫోల్డ్’పై ఒత్తిడి పడటానికీ ఆస్కారం ఉంటుంది. దాంతో మింగడం, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. ముందుగా మీరు  ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి ‘ల్యారింగోస్కోపీ లేదా ఎండోస్కోపీ’ వంటి పరీక్షలు చేయించుకోండి.  స్పీచ్‌థెరపిస్ట్‌ను సంప్రదించి గొంతురావడానికి అవసరమైన ఎక్సర్‌సైజ్‌లను  ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.
 
డాక్టర్ ఈసీ వినయకుమార్
హెచ్‌ఓడి అండ్ ఇఎన్‌టి సర్జన్
అపోలో హాస్పిటల్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్
 
 

మరిన్ని వార్తలు