శ్రమయేవ జయతే

23 Mar, 2020 11:12 IST|Sakshi
2010లో ఎగ్జిబిషన్‌ స్టాల్‌లో...

పరిచయం గురుదేవ్‌ కౌర్, పారిశ్రామికవేత్త

అది పందొమ్మిది వందల తొంబై ఐదవ సంవత్సరం. పంజాబ్‌లోని లూథియానా జిల్లా, పిండ్‌ గ్రామం. ఆడపిల్ల అంటే... మగవాళ్ల ఎదుట పడకుండా, తల మీది గూంఘట్‌ సవరించుకుని, తలుపు చాటు నుంచి మాట చెప్పి, అణకువగా ఒదిగి ఉండాలని నిర్దేశించే రోజులు. ఆ రోజుల్లో అమ్మాయి చదువుకోవడమే ఒక విడ్డూరం. అలాంటి ఊరికి ఓ చదువుకున్న అమ్మాయి కోడలిగా వచ్చింది. చదువుకోవడమే విడ్డూరమైతే ఇక ఉద్యోగం, వ్యాపారం చేయడమన్నది మరీ విచిత్రం. ఆ అమ్మాయిని గ్రహాంతర వాసిని చూసినట్లు చూసేవాళ్లు. ఆ చూపులను ఎదుర్కొన్న గురుదేవ్‌ కౌర్‌ను ఇప్పుడు అదే ఊరి వాళ్లు ఒక సెలబ్రిటీని చూసినట్లు చూస్తున్నారు. పాతికేళ్ల నిరంతర శ్రమ ఆమెను స్టార్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలబెట్టింది.

తేనె రుచి
గురుదేవ్‌ కౌర్‌ పెళ్లి నాటికి బీఈడీ చేస్తోంది. పెళ్లితో ఆమె చదువు ఆగిపోయింది. అయితే ఆగిపోయింది టీచర్‌ ట్రైనింగ్‌ మాత్రమే. తన వంతుగా... మహిళా సమాజాన్ని ఎడ్యుకేట్‌ చేసే బాధ్యతకు ఎటువంటి ఆటంకం కలగకూడదు అనుకుందామె. అప్పుడామె చెప్పిన మంచి మాటలేవీ ఆ గ్రామ మహిళలకు చెవికెక్కనేలేదు. అలాగని గుర్‌దేవ్‌ కౌర్‌ నిరాశపడనూ లేదు. ఈ ప్రయత్నం ఇలా ఉండగానే తనకు ఇష్టమైన తేనెటీగల పెంపకంతో కెరీర్‌ను ప్రారంభించింది. తన ఇంటి వెనుక ఉన్న కొద్ది స్థలంలో ఐదు బాక్సులతో మొదలు పెట్టింది. నాలుగేళ్లకు ఆమె తేనెటీగల పెంపకం 450 బాక్సులకు అభివృద్ధి చెందింది. ఒక్కొక్క బాక్సు నుంచి ఇరవై నుంచి పాతిక కిలోల స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి అయ్యేది. మొదట్లో ఆమె సహాయంగా ఉండడానికి కూడా మహిళలు ముందుకు రాలేదు. మగవాళ్లతోనే పని మొదలు పెట్టింది. క్రమంగా ఆమె దగ్గర పని చేయడానికి, పని నేర్చుకోవడానికి మహిళలు ముందుకొచ్చారు. మహిళలకు స్వయం స్వావలంబన అంటే ఏమిటో తెలియచేసింది గురుదేవ్‌ కౌర్‌. తేనె రుచితోపాటు సొంతంగా ఒక రూపాయి సంపాదించడంలో ఉండే సంతోషాన్ని కూడా రుచి చూపించింది. అలా ఆమె... పితృస్వామ్య సమాజం మహిళలకు విధించిన కంటికి కనిపించని లక్ష్మణరేఖలను తుడిచేయగలిగింది. ఇప్పుడు పంజాబ్‌లో గుర్‌దేవ్‌ కౌర్‌ ఆధ్వర్యంలో 350 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.

నెలకో వంద పొదుపు
గురుదేవ్‌ కౌర్‌ తన పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం... పంజాబ్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుంచి ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో మెళకువలు నేర్చుకుంది. ఆ మెళకువలను గ్రామీణ మహిళలకు నేర్పించింది. ఆ మహిళ చేత స్వయం సహాయక బృందాలను రిజిస్టర్‌ చేయించింది. బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయించి నెలకు వంద రూపాయలు పొదుపు చేసేటట్లు ప్రోత్సహించింది. ఆరు నెలల తర్వాత ఆ మహిళలకు రుణాలివ్వడానికి బ్యాంకులే చొరవ చూపించాయి. ఇప్పుడు వాళ్లు సొంతంగా ఆర్జిస్తున్నారు. సమాజంలో ధీమాగా ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు.

విజయం ఊరికే రాలేదు
అయితే... గుర్‌దేవ్‌ కౌర్‌ వ్యాపార ప్రయాణం మనం పైన చెప్పుకున్నంత సులువుగా ఏమీ సాగలేదు. మహిళలను చైతన్యవంతం చేయడానికి ఆమె తన గ్రామంలో ఇంటింటి తలుపు తట్టింది. ఆడవాళ్లు ఇంటి బయటకు వచ్చి పని చేయడం తప్పు కాదని నచ్చచెప్పింది. అందరి సహకారంతో తేనె, పచ్చళ్లు, జామ్, మురబ్బా, షర్బత్, ఆర్గానిక్‌ బెల్లం, అప్పడాలు, మసాలా దినుసుల వంటి మొత్తం 32 ఉత్పత్తులను తయారు చేయగలిగింది. కానీ వాటిని మార్కెట్‌ చేయడం మాత్రం తయారు చేసినంత సులభంగా జరగలేదు. పెద్ద ఎగ్జిబిషన్‌లలో ఒక టేబుల్‌ వేసుకుని ‘టేబుల్‌టాప్‌ షాప్‌’లు పెట్టింది. ఎగ్జిబిషన్‌లు లేని రోజుల్లో రోడ్డు పక్కన టేబుల్‌ వేసుకుని కొనుగోలుదారుల కోసం ఎదురు చూసింది. ‘అప్‌నీ మండీ’ పేరుతో తన ఉత్పత్తులను మార్కెట్‌ చేయడం మొదలు పెట్టింది.

తర్వాత ‘అప్‌నీ కిసాన్‌ మండీ’ పేరుతో తన వ్యాపారాన్ని విస్తరించింది. పంజాబ్, రాజస్థాన్, హిమాచల్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఐదు వందల కుటుంబాలు గుర్‌దేవ్‌ కౌర్‌ వ్యాపార సామ్రాజ్యంలో భాగమయ్యాయి. విజయం ఎవరికీ ఊరికే రాదు. దాని వెనుక కఠోరమైన శ్రమ ఉంటుంది. ఇప్పుడు గుర్‌దేవ్‌ కౌర్‌ అందుకుంటున్న గౌరవం... పాతికేళ్ల శ్రమ సాధించిన విజయం. ఇప్పుడామె సమావేశాల్లో అదే మాట చెబుతున్నారు. ‘‘ఇప్పుడు నాకు దక్కుతున్న ఈ గౌరవాలను మాత్రమే చూడవద్దు. నేను వేసిన తొలి అడుగును కూడా చూడండి. అనామకంగా వేసిన ముందడుగు అది. నన్ను చూసి స్ఫూర్తి పొందుతామంటే నాకు అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. అయితే మీ కెరీర్‌ ప్రస్థానంలో ఒడిదొడుకులు ఎదురైనప్పుడు నిరుత్సాహపడకండి. రెండు దశాబ్దాల కఠోరశ్రమ తర్వాత మాత్రమే నేను ఈ దశకు చేరుకున్నాననే నిజాన్ని కూడా గుర్తు చేసుకోండి’’ అని చెబుతుంటారు గురుదేవ్‌ కౌర్‌. – మంజీర

మరిన్ని వార్తలు