పాలరాతి శిథిలాలు కాకూడదు మన చర్చిలు

7 Apr, 2019 01:09 IST|Sakshi

సువార్త

నీ క్రియలన్నీ, నీ కష్టాన్నంతా, నీ సహనాన్నంతా నేను యెరుగుదునంటూ ప్రకటన గ్రంథంలోని ఎఫెసు చర్చికి కితాబునిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రభువు కోసం పరిచర్య చెయ్యడంలో ఆ చర్చి ఎన్నడూ వెనకంజ వెయ్యలేదు. ఆ చర్చిలో  తప్పుడు పనులున్నాయి, విచ్చలవిడిగా  లైంగిక స్వేచ్ఛను ప్రోత్సహించే నీకొలాయితులనే వారి దుర్బోధలున్నాయి. అయితే వారి విషయం నాకెందుకులే అని ఊరుకోకుండా, ప్రభువు ద్వేషించే అలాంటి జుగుప్సాకరమైన విషయాలు, బోధలను ఎఫెసీ చర్చి కూడా వ్యతిరేకించి తన ప్రత్యకతను చాటుకుంది. ఒకప్పుడు యెరూషలేము చర్చికి  చెందిన భక్తిపరులైన ఏడుగురు పెద్దలను అపొస్తలులు ఏర్పర్చి, ప్రార్థించి వారిని పరిచర్య కోసం ప్రతిష్టించారు (అపో.కా 6:5.6). వారిలో స్తెఫను ఆదిమ హతసాక్షి అయ్యాడు.

కానీ నికోలాసు అనే మరో పెద్ద అభిషేకం పొంది కూడా  లైంగిక విశృంఖలత్వాన్ని బోధిస్తూ విశ్వాసభ్రష్టుడయ్యాడు, చర్చిలో చాలామందిని ఆ బోధ దారి మళ్లిస్తుంటే ఎఫెసు చర్చి ఆ చాలా ఖచ్చితమైన వైఖరితో వారిని ఖండించి పారదోలింది.అది దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించింది (ప్రక 2:1–7). దేవుని నిర్మలమైన ప్రేమను ప్రకటించే చర్చిలోనే  అవినీతి నిండితే, అరాచకాలు, అపవిత్రత, ఆశ్రిత పక్షపాతానికి అది నిలయమైతే, ఆ చర్చి లోకానికి వెలుగునేలా చూపిస్తుంది. ఒకప్పుడెంతో గొప్పపేరున్న ఓ చర్చిలో ఇప్పుడు అక్కడి బోధకులు ‘రూతు–బోయజు’ ఉదంతాన్ని ప్రసంగాంశంగా తీసుకొని వారికి సంబంధించి చేసిన అనుచితమైన వర్ణనలు, వ్యాఖ్యలు, వివరణలు వింటూ చర్చిలో ఆడాళ్ళంతా తల దించుకున్నారు, చాలా మంది లేచి వెళ్లి పోయారట.

అంటే ఇది మీ చర్చి, మీ ప్రసంగాలు మీరు చేసుకోండంటూ చర్చిని వదిలేసి, వారిని ప్రోత్సహించేందుకు కొన్ని కానుకలేసి మరీ వెళ్లిపోయారట. ఇదీ ఆ సభ్యుల ఆత్మీయ అపరిపక్వత, నిర్వాకం, భ్రష్టత్వం, చేతకాని తనం. ఆ పాస్టర్‌ ఎలాగు శాపగ్రస్థుడే అన్నది అతని జీవితాన్ని, కుటుంబాన్ని చూస్తేనే తెలుస్తుంది. కానీ చర్చి సభ్యులు అతన్ని నిలదీయొద్దా? అంటే పాస్టర్‌ కన్నా భ్రష్టులు ఆ చర్చి పెద్దలు, సభ్యులని దేవుడే తేల్చి వారిని పక్కన బెట్టాడన్న మాట. ఎఫెసీ చర్చిలో మాత్రం అలాంటి పప్పులుడకవు.

అందుకే ఆయన అంతగా ఆ చర్చిని శ్లాఘించాడు. అయితే నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఎక్కడి నుండి ఆరంభించి ఎక్కడపడ్డావో గుర్తు చేసుకోమ్మన్నాడు దేవుడు. ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. పెళ్లయిన మొదటి రోజున వధూవరుల మధ్య కనిపించే ప్రేమానుభూతులు జీవితమంతా కొనసాగితే అదెంత భాగ్యం కదూ!! కానీ కొన్నిసార్లు ఆ మొదటి ప్రేమ క్రమంగా చల్లారిపోతుంది. ఇద్దరూ విడిపోరు, కలిసే ఉంటారు. ఇంట్లో కార్యక్రమాలన్నీ యధావిధిగానే సాగుతుంటాయి. కాకపోతే ఆ కార్యాలు ప్రేమతో కాక ఒక తంతులాగా సాగుతాయి... అప్పటికి పిల్లలు పుడతారు, బాధ్యతలు పెరుగుతాయి.

అయితే వాళ్ళిద్దరినీ ఒకటిగా పట్టి ఉంచేది వారి మధ్య ఒకప్పుడుండిన ప్రేమ కాదు, పిల్లల పట్ల బాధ్యతలే వారిని కలిపి నడుపుతుంటాయి. యేసును ఆరాధించే చర్చి యేసును ప్రేమించకుంటే ఎలా? యేసును ప్రేమించకుండానే చర్చిని నడుపుతామంటే ప్రేమ కరువైన ఆ దంపతుల కుటుంబం లాగే చర్చి నడుస్తుందేమో కానీ దేవుడందులో ఉండడు. నీ కొలాయితులను చర్చీ నుండి తరిమేయ్యడం ఎంత కష్టమో, పాత ప్రేమల్ని పునరుద్ధరించుకోవడం అంతకన్నా కష్టం. ఈ రెండూ జరగకుంటే ‘నీ దీపస్తంభాన్ని దాని చోటి నుండి తొలగించేస్తానని’  దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది చాలా తీవ్రమైన శిక్ష.

దీపం ఆరిపోయిన చర్చి అంటే వైభవం, ప్రభావం కోల్పోయి విశ్వాసులైన జనం లేక శిథిలాలుగా మారడమన్న మాట. ఇప్పుడంతటా అవే కనిపిస్తున్నాయి. ఆరంభంలో పౌలు ఎఫెసు చర్చిలో మూడేళ్లు పరిచర్య చేశాడు. అయితే అది కనుమరుగయ్యింది. టర్కీ దేశంలో ఒకప్పుడా చర్చి ఉన్న ప్రదేశంలో ఇపుడు శిథిలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా చోట్ల అవి చర్చిలన్న బోర్డులు కనిపిస్తాయి, కానీ వాస్తవానికవి శిథిలాలే!! ఆ చర్చి ఎంత అందమైన పాలరాతి భవనమైనా, అందులో అపవిత్రత ఉంటే అది యేసు లేని పాలరాతి శిథిలమే!!
– రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్‌ 
 

మరిన్ని వార్తలు